Navaratri 5th Day : నవరాత్రులు ఐదో రోజు.. శ్రీమహా చండీ దేవి విశిష్టత
Maha Chandi Devi : దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు శ్రీమహా చండీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు ప్రత్యేకతను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దేవి నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు ఐదో రోజు. శరదృతువులో వచ్చేటువంటి రాత్రులు కాబట్టి ఇవి శరన్నవరాత్రులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆశ్వయుజ శుద్ధ పంచమి శరన్నవరాత్రుల్లో చాలా విశేషమైనటుంటి రోజు. ఈ రోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా.. కొలవాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చండుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం, అలాగే ముందుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చిందని చిలకమర్తి చెప్పారు. దేవీ భాగవతం ప్రకారం.. చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి.. గ్రహ పీడలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన.. మానసిక రోగాలు, పిశాచ భయాలు.. అలాగే మానసిక వ్యాధులు తొలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జాతక చక్రంలో కుజ దోషం, కాలసర్ప దోషం, రాహు కేతు దోషాలు, కుజ రాహు సంధి వంటి దోషాలు ఉన్నట్టైతే.. అటువంటి వారందరికీ దేవి నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటువంటి దేవి ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని, పైన చెప్పిన గ్రహ పీడలు తొలగుతాయని చిలకమర్తి చెప్పారు.
నవరాత్రుల్లో మెుదటి మూడు రోజులు, అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, తర్వాత మూడు రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా, ఆఖరి మూడు రోజు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవి భాగవతం చెబుతోంది. అటువంటి సంధర్భములో ఐదో రోజు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన సరస్వతి కటాక్షంతో కూడి ఉన్నదని చిలకమర్తి వెల్లడించారు. పంచమి తిథి చాలా ప్రత్యేకమైనటువంటిది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.., ముహూర్త భాగం ప్రకారం.., పంచమి అత్యంత విశిష్టమైనటుంటి తిథి అని చెప్పబడింది.
గురువారంతో కూడి ఉన్నట్టు వంటి పంచమి, అమ్మవారి ఆరాధనకు చాల విశేషమైనది. నవరాత్రుల పూజలలో కలశ స్థాపన, కలశారాధన, దేవి అలంకరణ, నైవేధ్యములకు ప్రాధాన్యత కలిగి ఉన్నట్టువంటి అంశమని చిలకమర్తి పేర్కొన్నారు. అలాంటి గురువారం ఆశ్వయుజ మాసం పంచమి రోజున అమ్మవారిని నీలం రంగు వస్త్రంతో అలంకరించుకోవాలని, ఈ రోజు అమ్మవారికి పులుపుతో చేసినటువంటి పులిహోర, గారెలను నివేదన చేయాలని చిలకమర్తి చెప్పారు. ఈ రకంగా అమ్మవారిని ఆరాధించినటువంటి వారికి గ్రహ పీడలు తొలగి, దేవి నవరాత్రుల్లో పంచమి రోజు పూజ ఫలితం లభిస్తుందని చిలకమర్తి వెల్లడించారు.