హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దీపావళి పండుగను ఆనందిస్తారు. ప్రతి ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. చీకటిలో వెలుగులు నింపే దీపావళి పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? దీపం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని సూచించే పండుగ అని చెప్పొచ్చు.
ఈరోజు సానుకూల శక్తి రావడానికి చాలా మంది రకరకాల దీపాలను వెలిగిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. లక్ష్మీదేవి, వినాయకుని విగ్రహాలను కూడా ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. నరక చతుర్దశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు. యమధర్మరాజుని నరక చతుర్దశినాడు పూజిస్తే దీర్ఘాయువు లభిస్తుంది. ఇక ఈసారి నరక చతుర్దశి ఎప్పుడు వచ్చింది? నరక చతుర్దశి తేదీ, సమయంతో పాటుగా పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు నరక చతుర్దశి వస్తుంది. అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:54కి ప్రారంభమవుతుంది, అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. ఈ లెక్కను చూసినట్లయితే అక్టోబర్ 19, ఆదివారం నాడు నరక చతుర్దశి జరుపుకోవాలి.
నరక చతుర్దశి శుభ సమయం: అక్టోబర్ 19 రాత్రి 11:41 నుంచి ఉదయం 12:31 వరకు.
నరక చతుర్దశి నాడు కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా నువ్వుల నూనెతో ఏకముఖి దీపాన్ని పెట్టాలి. వెల్లుల్లి లేకుండా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అదే విధంగా ఆ రోజు ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేయాలి.
నరక చతుర్దశి పండుగను ఎందుకు చేసుకోవాలంటే, కృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడిని వధించాడు. కృష్ణుడు సత్యభామ సహాయంతో దేవతలను, ఋషులను నరకాసురుడి బాధల నుంచి విడిపించాడు. ఆశ్వయుజ మాసం చతుర్దశి నాడు ఇది జరిగింది. అందుకే ప్రజలందరూ సంతోషంగా నరక చతుర్దశినాడు సంబరాలు చేసుకుంటారు. అప్పటినుంచి నరక చతుర్దశిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.