Nagulachavithi: నాగులచవితి రోజు నాగదేవతలను ఎందుకు ఆరాధించాలి?
నాగుల చవితి దీపావళి పండుగ వెళ్ళిన నాలుగో రోజు వస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. నాగుల చవితి రోజు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని నమ్మకం.
ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపముగా భావించి మనపూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని పామును - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే... అందులో భాగంగానే 'నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితినాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అని అంటూ ఉంటారు. మానవశరీరంలో నాడులతో నిండిఉన్న వెన్నెముకను 'వెన్నుబాము” అని అంటారు.
అందు కుండలినీశక్తి మూలాధార చక్రంలో 'పాము” ఆకారము వలెనే ఉంటుందని 'యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాన్ని గ్రక్కుతూ మానవునిలోని 'సత్వగుణసంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్చ పుట్టలను ఆరాధించి పుట్టలో పాలుపోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివశించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా, శేషపాన్నుగా మారాలని కోరికతో చేసేదే. ఈ నాగుపాము పుట్టలో పాలుపోయుటలో గల ఆంతర్యం ఇదేనని చెబుతారు.
ఏవి నివేదన చేయాలి
నాగుల చవితి రోజు అవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి (నూపప్పు, బెల్లంతో చేస్తారు), అరటిపళ్ళు, తాటిబుర్రగుంజు, తేగలు మున్నగునవి నివేదన చేస్తారు. ఈ సందర్భంగా దీపావళినాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. సాగరతీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం.
నాగరాజుకు హారతి పట్టడం కాని, వేడిపదార్థాల ఆరగింపు కానీ పనికిరాదు. మన భారతీయులు చాలా ఇళ్ళలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆయనను ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి చాలామంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావుగా పేర్లు పెట్టుకుంటుంటారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నాగుల చవితి పూజ చేయు విధానం
- నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటుపోసుకొని ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టుకొని పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.
- పూజామందిరంలో కలశాన్ని ఏర్పాటుచేసి దానిపై ఎరుపు వస్త్రం పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను కానీ, లేదా ఫొటోను కానీ పూజకు ఉపయోగించాలి.
- పూజకు మందారపూలు, ఎర్రని పూలు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు సిద్ధం చేసుకోవాలి.
- ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించాలి.
- ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
- దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూది వత్తులు, ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్చించుకోవాలి.
- పూజ ముగిశాక నాగేంద్రస్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువకు అందజేయాలి.
- తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకము చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజ చేయించడం శుభదాయకం. చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవారికి చవితి ఉపవాసం మంచిది.
నాగుల చవితి పురాణ కథ
సంతానానికి సర్పపూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది. శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు, అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరకు వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్ని వారు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్ళకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్ళకు ఆ పాము తనకు పెళ్ళి చేయమని కోరింది.
ఖడ్గాన్ని పంపి ఒక రాజకుమార్తెతో పెళ్ళి చేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన భర్త ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని ఆమె సమాధానం చెప్పింది.
అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సర్వాయి పాపడు కథ
పాముల పడగ నీడ వల్ల పశువుల కాపరులు ప్రభువులైన కథలు చాలా ఉన్నాయి. సర్వాయి పాపడు కథ ఇందుకు ఒక నిదర్శనం. పశువులను మేపుతూ చెట్టు నీడలో నిద్రపోతూ ఉన్న పాపడు మీదకు ఎండ రాకుండా పన్నెండు పడగల నాగుపాము వచ్చి పడగెత్తి గొడుగు పట్టింది. తరువాత అతనికి రాజయోగం పట్టింది.
భవిష్యపురాణం “నాగదష్ట వ్రతం” గురించి చెబుతోంది. “నాగదపష్టో నరో రాజన్ ప్రాష్య మృత్యుం ప్రజత్యథః అథోగత్వా భవేత్సర్చో నిర్తిషో నాత్ర సంశయః” “రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళలోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతాడు” అని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచిన వాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్ని చోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కాంద పురాణం దీనిని 'శాంతివ్రతం”గా అభివర్ణించిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.