Lord ganesha: ఇక్కడ వినాయకుడికి తొండంలో మూడో కన్ను, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మోక్షం పొందుతారు
Lord ganesha: ముంబై పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆలయాలలో ఇదీ ఒకటి. అత్యంత ధనిక ఆలయం కూడా. ఈ ఆలయంలో వినాయకుడి తొండంలో మూడో కన్ను ఉంటుంది. అది మాత్రమే కాదు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది.
Lord ganesha: మూడో కన్ను అనగానే పరమేశ్వరుడు అందరికీ గుర్తుకు వస్తాడు. సృష్టి లయకారుడు, వినాశక కర్త రెండూ మహా దేవుడే. కానీ ఈ ఆలయంలోని వినాయకుడికి మూడో కన్ను ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. అదే ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయాల్లో సిద్ధి వినాయక దేవాలయం ఒకటి. గణేష్ ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆశీర్వాదం, కోరికలు తీరాలనే ఆశతో ఆలయాన్ని సందర్శిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ వినాయకుడి సందర్శించుకోవడానికి వస్తారు. ఈ ఆలయంలోని వినాయకుడి తొండంలో మూడో కన్ను ఉంటుంది.
అత్యంత ధనిక దేవాలయం
సిద్ధి వినాయక దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయమ ఇటుకలతో చేసిన చిన్న మందిరం దగ్గర నుంచి రూపాంతరం చెందింది. దేవబాయి పాటిల్ ఇచ్చిన విరాళం ద్వారా ఈ మందిరం భవనంగా నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయం గర్భగుడి బంగారు పూతతో అందంగా ఉంటుంది. ఏటా సిద్ది వినాయకుడు 100 మిలియన్ల వరకు విరాళాలు అందుకుంటాడు.
తొండం కుడివైపు
సాధారణంగా వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమ వైపు ఎక్కువగా ఉంటుంది. అయితే సిద్ధి వినాయకుడి ఆలయంలోని విగ్రహం తొండం కుడి వైపు ఉంటుంది. ఈ వినాయకుడిని మొక్కుకుంటే ప్రాపంచిక కోరికల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. సిద్ధి వినాయకుడి ఆలయంలో గణేష్ విగ్రహం ఒకే నల్లరాతతో చెక్కారు. 2.5 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహానికి ఇరువైపులా రిద్ధి, సిద్ధి ఉంటారు. విజయం, శ్రేయస్సు, సంపద ఇస్తారు.
హనుమాన్ విగ్రహం
1952లో సిద్ధి వినాయక దేవాలయం సమీపంలో హనుమంతుని విగ్రహం కనిపించింది. గమనించిన భక్తులు వెంటనే ఆలయ ప్రధాన అర్చకుడికి సమాచారం అందించారు. దీంతో పూజారి వెంటనే హనుమంతుని విగ్రహాన్ని ఆలయం లోపలికి తీసుకొచ్చి దాని కోసం చిన్న ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ఇక్కడ వినాయకుడి విగ్రహంతో పాటు హనుమంతుడి ఆలయం కూడా ఉంటుంది. సిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళు హనుమంతుడి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు.
మూడో కన్ను
సిద్ధి వినాయకుడి ఆలయంలో గణేషుని విగ్రహానికి శివుని వలె మూడో కన్ను ఉంటుంది. దైవిక ఆశీర్వాదం, అంతర్ దృష్టిని ఈ కన్ను సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం మూడో కన్ను అసాధారణ విషయాలను చూసే సామర్థ్యం ఉంటుంది. దీని సత్యాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. ఈ కన్ను నుదుటి మీద కాకుండా తొండం మీద ఉండటం విశేషం. ఈ కన్ను ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది.
ఈ ఆలయంలో ఉన్న వినాయకుడి దగ్గర మూషికం కూడా ఉంటుంది. అడ్డంకులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. సిద్ధి వినాయకుడి ఆలయంలో వెండితో చేసిన మూషికాన్ని వినాయకుడి దగ్గర ఉంచుతారు. ఒక్కోసారి ఈ ఎలుక వినాయకుడి దగ్గరకు వెళ్ళి గుసగుసలాడుతుందని భక్తులు విశ్వసిస్తారు.