Mithuna Rasi 2025 Telugu: మిథున రాశి ఫలాలు.. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది
Mithuna Rasi 2025 Telugu: మిథున రాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు అందిస్తున్న మిథున రాశి జాతక ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
2025 మిథున రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ తెలుసుకోబోతున్నాం. బృహస్పతి మే నుండి జన్మరాశి నందు సంచరించటం, శని 10వ స్థానమునందు సంచరించుట, రాహువు మే నుండి భాగ్య స్థానము నందు, కేతువు మే నుండి తృతీయ స్థానమునందు సంచరించుటచేత మిథునరాశి వారికి 2025సంవత్సరం మధ్యస్థ ఫలితాలున్నాయి.
ఎవరెవరికి ఎలా ఉండబోతుంది:
మిథున రాశి వారికి 2025సంవత్సరంలో జన్మగురుని ప్రభావంచేత పనుల యందు చికాకులు, సమస్యలు అధికమగును. వృత్తి స్థానములో శని సంచారం వలన ఉద్యోగమునందు, వ్యాపారమునందు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించుట మంచిది. దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి. అలకలు, కలహములు అధికమగును. రాహు కేతువుల ప్రభావంచేత కుటుంబమునందు కలహములు ఏర్పడును. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును.
మిథునరాశి విద్యార్థులకు ఒత్తిళ్ళతో కూడి యున్నటువంటి సమయం. స్త్రీలు ఆచితూచి వ్యవహరించవలసిన సమయం. మిథునరాశి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మిథున రాశి రైతాంగం వంటి రంగాలలో ఉన్నటువంటివారికి మధ్యస్థ ఫలములు కలుగును. మిథునరాశి వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఒత్తిళ్ళు పెరుగును. రుణభారము అధికమగును. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.
కోర్టు విషయాలు, వ్యవహారాలు చికాకులు కలిగించును. హాస్పిటల్ ఖర్చులు వంటివి కలుగు సూచన.జన్మ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. మిథునరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. బీపీ, షుగర్, హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టును.
చేయవలసిన పరిహారాలు:
మిథున రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం, అభిషేకం వంటివి చేసుకోవటం మంచిది. శనగలను నైవేద్యంగా చేసి ఆలయములలో పంచి పెట్టండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
మిథున రాశి 2025 నెల వారీ ఫలితాలు:
జనవరి 2025:
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, భయం. కొత్త పరిచయాలేర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. మాసం చివరలో ప్రమోషన్లుంటాయి. స్త్రీమూలక ధననష్టములుంటాయి.
ఫిబ్రవరి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువర్గంతో విరోధములుంటాయి. శుభకార్యాలు కలసి వచ్చును. స్నేహితులను కలుసుకుంటారు. విదేశీ యోగమున్నది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆర్థికముగా అనుకూలం.
మార్చి 2025:
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. విపరీతమైన ఖర్చులుంటాయి. శుభవార్తలు వింటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. చీటీలు కలసివచ్చును. దేవాలయ దర్శనం చేస్తారు.
ఏప్రిల్ 2025 :
ఈ మాసంలో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ఉద్యోగపరంగా అనుకూలం. పెద్దవారితో పరిచయాలుంటాయి. గృహ ప్రయత్నములు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. అపవాదులు వచ్చును.
మే 2025:
ఈ మాసం నందు మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ గొడవలతో మనస్తాపం చెందుతారు. భార్య వలన సౌఖ్యం. ఇంటియందు శుభ కార్యములు చేయుదురు. ఆలయ దర్శనం చేస్తారు. కారణం లేకనే విరోధములు ఏర్పడును.
జూన్ 2025:
ఈ మాసం మిథున రాశి వారికి అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. | కష్టపడితే కాని పనులు పూర్తికావు. వృత్తిపరంగా అనుకూలం. కోర్టు వ్యవహారములు చిక్కులుంటాయి. వాహన ప్రమాదములు. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ లాభములు.
జూలై 2025 :
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు చేయుదురు. అపజయములుంటాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేసెదరు. మీరు ఇతరులకు సహాయపడతారు. ఖర్చులుంటాయి.
ఆగస్టు 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. కొత్తవారితో పరిచయాలేర్పడతాయి. సంఘంలో మంచి గౌరవం లభించును. ఉద్యోగ ప్రయత్నాలు చేయుదురు. తలపెట్టిన పనులు పూర్తగును. స్త్రీ మూలకంగా ధనయోగం.
సెప్టెంబర్ 2025 :
ఈ మాసం మిథున రాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, ఆభరణములు కొను గోలు చేసెదరు. ప్రయత్నించిన కార్యములు ఫలించును. కలహములు ఏర్పడును. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉండును. అప్పులు చేయుదురు.
అక్టోబర్ 2025:
ఈ మాసం మిథున రాశి జాతకులకు అనుకూలంగా లేదు. అధిక ధనవ్యయముండును. విరోధములు, అపవాదులు అధికం. స్త్రీ సౌఖ్యము. ప్రయాణములో చోరభయములు. ఇతరుల గూర్చి ఆలోచిస్తారు. మనోవిచారములు. వ్యాపారం గూర్చి ఆలోచనలు పెరుగును.
నవంబర్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గృహనిర్మాణమునకు ఆటంకములు. అనుకోని ఖర్చులుంటాయి. సోదర సఖ్యత. వస్త్రలాభముంటుంది. భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారముంటుంది. ప్రమాద సూచనలున్నాయి. వృధా ఖర్చులుంటాయి.
డిసెంబర్ 2025:
ఈ మాసం మిథున రాశి జాతకులకు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబ కలహాలుంటాయి. శుభకార్యాలకు ఆటంకాలేర్పడును. నూతన స్నేహములేర్పడును. స్త్రీమూలక ధననష్టములు, దూరపు ప్రయాణాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి.