Mesha Rasi 2025 Telugu: మేష రాశి ఫలాలు.. కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్లు-mesha rasi horoscope 2025 in telugu new hopes opportunities and challenges for aries ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mesha Rasi 2025 Telugu: మేష రాశి ఫలాలు.. కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్లు

Mesha Rasi 2025 Telugu: మేష రాశి ఫలాలు.. కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్లు

HT Telugu Desk HT Telugu
Dec 05, 2024 05:04 PM IST

Mesha Rasi 2025 Telugu: మేషరాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు అందిస్తున్న జాతక ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మేషరాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?
మేషరాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

మేషరాశి 2025 రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వీరికి బృహస్పతి మే నుండి తృతీయ స్థానమునందు సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యయ స్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి లాభ స్థానము నందు, కేతువు మే నుండి పంచమ స్థానమునందు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి 2025 మధ్యస్థ నుండి చెడు ఫలితములు అధికముగా ఉన్నవి.

yearly horoscope entry point

మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది కలుగును. భ్రాతృ స్థానములో గురు ప్రభావం వలన సోదరులు, బంధుమిత్రులతో భేదాభిప్రాయము కలుగును. అనుకున్న పనులు ఆలస్యమగును. అయితే వివాహ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు, చికాకులు అధికమగును. వ్యాపారస్తులకు ధన నష్టము అధికముగా ఉండును. అప్పులు బాధలు పెరుగు సూచన.

మేష రాశి వారి కోసం 2025 సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్లు తీసుకువస్తుంది. ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపర్చుకోవడం ముఖ్యం.

ఎవరెవరికి ఎలా ఉండబోతోంది?

మేషరాశి విద్యార్థులకు 2025 సంవత్సరం కష్టపడాల్సిన సంవత్సరం. మధ్యస్థ ఫలితాలు కలుగుచున్నవి. మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితములు ఏర్పడు చున్నవి. మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును. విమర్శలు, అవమానాలు పెరుగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కోర్టు వ్యవహారాలు, సమస్యలు చికాకు కలిగించును. భగవత్ కార్యక్రమాలు చేసెదరు. అవసరానికి తగిన ధనము ఆలస్యము అయినను ఏదో ఒక రకంగా లభించును.

సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును. రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం. సినీ, మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును. ఏలినాటి శని ప్రభావం గురుడు తృతీయంలో సంచరించటం చేత తప్పుడు నిర్ణయాల వలన, ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరిగినను ఇబ్బందులు తప్పవు.

2025లో మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు. ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడం కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. విద్యార్థులు తమ చదువులో ప్రగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు, వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి.

పాటించాల్సిన పరిహారాలు

మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించడం మంచిది.

మేష రాశి వారికి మాసవారీ ఫలితములు

జనవరి 2025:

ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పని ఒత్తిడిని తగ్గించడానికి సమయాన్ని మెరుగుగా నిర్వహించండి. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబములో ఆనందము తక్కువ. సంతానం గూర్చి ఆలోచనలుంటాయి. ధనలాభముంటుంది. అయితే ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులుంటాయి. మీ సలహాను ఇతరులు పాటిస్తారు. భార్యకు అనారోగ్య సమస్యలుంటాయి. శత్రువుల వలన భయము.

ఫిబ్రవరి 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఈ నెలలో మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. మీకు శ్రేయోభిలాషుల సహాయం లభిస్తుంది.ఆకస్మిక ప్రయాణాలుంటాయి. అనారోగ్య సూచనలున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోను ఆటంకములేర్పడును. స్త్రీ పరిచయం. దేవాలయ దర్శనం. వ్యాపారములో లాభములు వచ్చినప్పటికి ఆటంకములు ఏర్పడును.

మార్చి 2025:

ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. సంచార గ్రహాల ప్రభావం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వ్యాపార వర్గాలు మంచి లాభాలు పొందే నెల. శత్రువులను జయించగలరు. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. వ్యాపారాలు అంతగా రాణించవు. శుభములకు ఆటంకాలేర్పడును. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొనుట మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఏప్రిల్ 2025:

ఈ మాసము మేష రాశి వారికి అంత అనుకూలంగా లేదు. పెద్దవారి సలహాలు పాటించుట మంచిది. పెట్టుబడులకు మంచి సమయం కాదు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది. రాబడిపై దృష్టిపెడతారు.

మే 2025:

ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు కలసి వచ్చును. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్య సమస్యలు తొందరగానే పరిష్కరించుకోండి.

జూన్ 2025:

మేష రాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి . కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కష్టపడితే కాని పనులు పూర్తికావు. వృత్తిపరంగా అనుకూలం. కోర్టు వ్యవహారములు చిక్కులుంటాయి. కొత్త వస్తువులు కొంటారు.ఉద్యోగలాభము.

జూలై 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలన మార్పులుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మాటపట్టింపులుంటాయి. జాయింట్ వ్యాపారం అనుకూలించును. అనారోగ్య సూచనలుంటాయి.

ఆగస్టు 2025:

ఈ మాసంలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలుంటాయి. అప్పులు తీర్చుతారు. మీరు చేసే ప్రతి పనియందు చికాకులు ఎదురై చివరకు పూర్తియగును. దానధర్మాలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం. ధనవ్యయముండును. అనవసరపు ఆలోచనలు చేస్తారు. స్వతంత్రంగా జీవిస్తారు.

సెప్టెంబర్ 2025:

ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. పెద్దవారితో పరిచయాలేర్పడ తాయి. ఆకస్మిక ధనయోగం. మనస్సునందు భయాందోళనలుంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారముంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో నిరాశ.

అక్టోబర్ 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘం నందు గౌరవ మర్యాద లుంటాయి. సినీ పరిశ్రమల వారికి అనుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ బోనస్లుంటాయి. మీరు చేసే పనులుయందు విజయం సాధిస్తారు. మానసిక ఆనందము కలుగును.

నవంబర్ 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వృథా ఖర్చులు అధికమవుతాయి. శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మనస్సురందు భయమేర్పడును. జాయింట్ వ్యాపారములలో మోసపోవుదురు.

డిసెంబర్ 2025:

ఈ మాసం మేష రాశి వారికి అంత అనుకూలంగా లేదు. స్త్రీ వలన ధనవ్యయముండును. వ్యాపారమూలకంగా ధన నష్టములు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. శత్రువుల వలన భయము. అధికారం వలన లాభములు. అధిక ప్రయాణములుంటాయి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner