Mercury transit: ఆరుద్ర నక్షత్రంలోకి బుధుడు.. కెరీర్, ప్రేమ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే-mercury transit in arudra nakshtram on june 18th 2024 negative effects ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: ఆరుద్ర నక్షత్రంలోకి బుధుడు.. కెరీర్, ప్రేమ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

Mercury transit: ఆరుద్ర నక్షత్రంలోకి బుధుడు.. కెరీర్, ప్రేమ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

Gunti Soundarya HT Telugu
Jun 18, 2024 08:09 AM IST

Mercury transit: బుధుడు జూన్ 18 నుంచి ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీని ప్రతికూల ప్రభావం వల్ల కెరీర్, ప్రేమ సంబంధాల మీద పడుతుంది. అది ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

ఆరుద్ర నక్షత్రంలోకి బుధుడు
ఆరుద్ర నక్షత్రంలోకి బుధుడు

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. తెలివితేటలు, కమ్యూనికేషన్ వంటి వాటికి బుధుడు కారకుడు. రాశి, నక్షత్రాన్ని మార్చినప్పుడు అది జీవితంలోని అన్ని అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

yearly horoscope entry point

జూన్ 18వ తేదీ బుధుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇది రాహు ప్రభావంతో ఉంటుంది. సమస్యలు కలిగించే గుణాలు ఈ నక్షత్రానికి ఎక్కువగా ఉంటాయని చెబుతారు. బుధుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రయాణిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సంచారం అనేక అడ్డంకులను కలిగిస్తుంది. రెండు వారాల పాటు బుధుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు.

కెరీర్ పై ప్రభావం

బుధుడు ఆరుద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల కెరీర్ మీద ప్రభావం కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరు అయ్యేందుకు ఇది అనుకూలమైన సమయం కాకపోవచ్చు. చురుకుగా పని చేసే వారికి ఈ కాలం కార్యాలయంలో సవాళ్ళు, అడ్డంకులు ఎదురవుతాయి. ఒత్తిడితో ఇబ్బంది పడతారు. కమ్యూనికేషన్ లో ఇబ్బందులు వస్తాయి. కార్యాలయంలో కొన్ని విషయాల్లో విభేదాలు సంభావిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

ఆర్థిక ప్రభావం

బుధుడి నక్షత్ర మార్పు ఆర్థిక పరిస్థితి మీద కూడా ఉంటుంది. డబ్బుకు సంబంధించి తీసుకునే పెద్ద నిర్ణయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ద తీసుకోవాలి. కొనుగోళ్లు, పెట్టుబడుల విషయంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండటమే మంచిది. వీలైతే కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కూడా ఉంది. ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ప్రేమ సంబంధాలు

ఆరుద్ర నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ప్రేమ సంబంధాలు ప్రభావితం అవుతాయి. ఇరువైపులా భావోద్వేగాలతో కూడిన వాతావరణం నెలకొంటుంది. దంపతుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న వాళ్ళు కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడానికి ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చు.

కుటుంబం, స్నేహితులు

బుధుడి సంచార సమయంలో కుటుంబం, సన్నిహితుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరితో అయినా మర్యాదపూర్వకంగా సంయమనంతో మాట్లాడాలి. లేదంటే మీ మాటల వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినాలి. కుటుంబానికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం ఒత్తిడితో కూడి ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

చెడు ప్రభావాలు తగ్గించే మార్గాలు

ఆరుద్ర నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు పాటించడం ఉత్తమం. తెలుపు, లేత నీలం, లేత ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇవి ఓదార్పు ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

ఇల్లు లేదా కార్యాలయం వాయువ్య మూలలో రాగి లేదా మెటల్ తో కూడిన పిరమిడ్, శంఖాన్ని ఉంచడం వల్ల మంచి జరుగుతుంది. మహా మృత్యుంజయ మంత్రం లేదా పంచాక్షరీ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల శివయ్య అనుగ్రహం పొందుతారు. తెల్ల నువ్వులు, దుప్పట్లు వంటి వాటిని పేదలకు దానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner