మార్గశిర మాసం విశిష్టత ఏమిటి? నాలుగు వారాలు లక్ష్మీదేవిని పూజించే విధానం, వ్రత కథ-margasira lakshmivaram pooja vidhanam and vrata katha ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్గశిర మాసం విశిష్టత ఏమిటి? నాలుగు వారాలు లక్ష్మీదేవిని పూజించే విధానం, వ్రత కథ

మార్గశిర మాసం విశిష్టత ఏమిటి? నాలుగు వారాలు లక్ష్మీదేవిని పూజించే విధానం, వ్రత కథ

Peddinti Sravya HT Telugu
Dec 05, 2024 11:02 AM IST

మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి గురువారం నాడు పూజలు చేయడం మంచిది.

మార్గశిర లక్ష్మివారం పూజా విధానం
మార్గశిర లక్ష్మివారం పూజా విధానం

మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని నియమాలని పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి. మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించారని పండితులు చెప్తున్నారు. మార్గశిర మాసంలో చేసే యాగాలకు, పూజలకు, అభిషేకాలకు ఎంతో ప్రత్యేకంగా ఉంది. ప్రత్యేకించి శ్రీకృష్ణుడు స్వీకరిస్తానని తెలిపినట్టు కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది.

yearly horoscope entry point

మార్గశిర మాసం విశిష్టత:

లక్ష్మీ పూజ చేసినా, ఉపవాస దీక్షలు చేసినా సకల శుభాలు కలుగుతాయి. 'మాసానా మార్గశీర్షాహం' అని శ్రీకృష్ణుడు చెప్పారు. మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి గురువారం నాడు పూజలు చేయడం మంచిది. విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తే మార్గశిర మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి.

మార్గశిర గురువారం నాడు పాటించాల్సిన నియమాలు:

సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసి, దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. మార్గశిర గురువారం నాడు తలకు నూనె రాసుకోకూడదు. షాంపూతో తలస్నానం చేయడం కూడా మంచిది కాదు. పూజ మందిరాన్ని అందంగా అలంకరించుకుని బియ్యం పిండితో ముగ్గు వేసి, పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పూజని మొదలు పెట్టాలి.

మార్గశిర గురువారాలు ఎప్పుడు వచ్చాయి?

మొదటి వారం డిసెంబర్ 5న వచ్చింది. ఆ తర్వాత రెండవ గురువారం డిసెంబర్ 12న వచ్చింది. మూడవ గురువారం డిసెంబర్ 19న వచ్చింది. నాల్గవ గురువారం డిసెంబర్ 26వ తేదీన వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. అలాగే పైన చెప్పిన నియమాలని నాలుగు రోజులు పాటించడం మంచిది.

మార్గశిర గురువారం పూజా విధానం

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి

కరమూలే తు గోవిన్దః ప్రభాతే కరదర్శనమ్

ముందుగా వినాయకుడి పూజ చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదువుతూ లక్ష్మీదేవిని ఆరాధించాలి. వ్రత కథను కూడా చదువుకోవాలి. నైవేద్యంగా మొదటి గురువారం పులగం, రెండవ గురువారం అట్లు, తిమ్మనం, మూడవ గురువారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, ఐదవ వరం పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి.

మార్గశిర మాసం వ్రత కథ

ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి ప్రతిమను చేసి ఆరాధిస్తూ ఉండేది. బాలిక సవతి తల్లి ప్రతిరోజు తన బిడ్డను ఆడిస్తూ ఉండమని చెప్పేది. చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. బాలిక ప్రతిరోజు ఆమె ఇచ్చిన బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది. ఆమె పెళ్లి తరవాత లక్ష్మీదేవి బొమ్మను కూడా ఆమెతో తీసుకుపోయింది. అప్పటి నుంచి నిత్యదారిద్య్రం దాపురించింది. పుట్టింటివారు దారిద్య్రంతో బాధపడుతున్నారని ఆమె తన తమ్ముణ్ణి రప్పించి, ఒక వెదురుకర్రను దొలిపించి, అందులో బంగారు నాణెములు పోసి ఇచ్చింది.

మార్గమధ్యమున అతను కాలకృత్యములను తీర్చుకోవడానికి ఒకచోట ఆగి, చేతికర్రను ఒకచోట ఉంచగా.. దానిని ఓ బాటసారి తీసుకుపోయెను. చేతికర్ర లేకపోవడం చూసి నిరాశగా తమ్ముడు తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్నాళ్ళ తరువాత పుట్టింటివారి పరిస్థితిలో మార్పు లేదని గ్రహించి అక్క మళ్ళీ తమ్ముడిని రమ్మని, ఒక చెప్పుల జతలో బంగారు నాణెములు పోసి, దాన్ని వస్త్రంతో మూటకట్టి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది. దారిలో దప్పిక తీర్చుకొనుటకు ఒక కొలను దగ్గర ఆగి, మూటను గట్టుపై పెట్టి నీళ్లు తాగుతుండగా మూటను ఎవరో దొంగలించారు.

మళ్ళీ తమ్ముడిని రమ్మని ఒక గుమ్మడికాయను దొలిపించి అందులో రత్నాలు పోసి ఇచ్చింది. ఈసారి గుమ్మడికాయను ఒక బీద బ్రాహ్మణుడు తీసుకు వెళ్తాడు. తన దురదృష్టానికి తానే నిందించుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తరువాత తల్లి మార్గశిరమాసంలో కూతురు ఇంటికి వెళ్లారు. ఆమె సవతి తల్లితో అమ్మా..! ఈ రోజు మార్గశిర లక్ష్మివారము. కనుక నోము నోచుకుందాము. నీవు ఎటువంటి ఆహారము తీసుకోకు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి తన మనవలు, మనవరాళ్ళకి చద్దన్నాలు పెడుతూ అనుకోకుండా ఒక ముద్ద తినేసింది. చేసేది ఏమీ లేక రెండవ లక్ష్మివారం జరుపుకుందామని చెప్పింది.

రెండవ లక్ష్మివారం తల్లి పిల్లలకు తలంటుతూ, గిన్నె అడుగున మిగిలిన నూనె ఊడ్చి రాసేసుకుంది. ఇక మూడవవారం నోచుకుందువు అని సముదాయించింది. మూడవవారం తల్లి పొరపాట్లు చేయకుండా ఉండాలని.. ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి, పైన బల్లలు మూతలాగా పెట్టింది. అటు వైపు వచ్చిన పిల్లలు అరటిపళ్ళు, కొబ్బరిముక్కలు తింటూ తినగా మిగిలిన తొక్కలు, ముక్కలు గోతిలో పడేసారు. ఆకలితో ఉన్న తల్లి వాటిని తినేసింది.

నాలుగవ లక్ష్మివారం తల్లి కొంగును, తన కొంగుకి ముడివేసుకొని తనతో తిప్పుకుంటూ, ఇంటి పనులు పూర్తి చేసి పూజకు కూర్చుంది. విచిత్రంగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగి పోయింది. ఇది చూసిన కూతురు ఆశ్చర్యపోయింది. చేసిన తప్పు ఏంటని అమ్మవారిని కూతురు అడిగింది. నీ సవతితల్లి ఒక మార్గశిర లక్ష్మివారం నాడు నీ శరీరంపై పేడనీళ్ళు జల్లి, చీపురుకట్టతో కొడుతూ నానా తిట్లు తిట్టింది. అందుకే నీ తల్లి పూజను నేను స్వీకరించలేను అని చెప్పారు.

దీనికి పరిష్కారం చెప్పమని కుమార్తె అడుగగా.. నీ తల్లిని నీకు ఆమె చేసినట్లే చేస్తే శాంతిస్తానని చెప్పారు. అమ్మవారు చెప్పినట్లు దండించెను. పుష్యమాసంలో మొదటి గురువారం తల్లి, కూతురు అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు కరుణించి ఇద్దరినీ కూడా ఐశ్వర్యవంతులను చేసారు. (ఈ కథను చదివి అక్షింతలను శిరస్సుపై వేసుకోవాలి).

 

 

Whats_app_banner