Mahalaya Amavasya : మహాలయ అమావాస్య అంటే ఏమిటో తెలుసా? మహాభారతం ఏం చెప్తుందంటే..-mahalaya amavasya history and significance in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Mahalaya Amavasya History And Significance In Telugu

Mahalaya Amavasya : మహాలయ అమావాస్య అంటే ఏమిటో తెలుసా? మహాభారతం ఏం చెప్తుందంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 23, 2022 03:16 PM IST

Mahalaya Amavasya Rituals : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటువటవంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజు పితృ దేవతల ఋణం తీర్చుకోవడానికి చాలా ప్రాధాన్యమైనది. మహాభారతంలో కూడా దీనిగురించి ప్రస్తావించారు. ఇంతకీ ఈ అమావాస్య ప్రాధాన్యత ఏమిటి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మహాలయ అమావాస్య
మహాలయ అమావాస్య

Mahalaya Amavasya Rituals : మహాలయం అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే.. ఏ వ్యక్తి అయినా చనిపోయినా.. వారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోతే.. వారు గతించిన సంవత్సంలో.. చనిపోయిన తిథిలో శ్రాద్ధకర్మలు చేయలేని వారు.. కేవలం మహాలయ అమావాస్యరోజున వారికి శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు. అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి.. శుభ ఫలితాలు పొందుతారు. ప్రతీ మానవుడు సంవత్సరంలో మొత్తం ప్రతి అమావాస్యయందు గతించిన పితృ దేవతలకు తర్పణం వదలాలి. అలా వదలలేనటువంటివారు.. మహాలయ అమామాస్య రోజు గనుక పితృ దేవతలకు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం ఫలితం లభిస్తుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈసారి మహాలయ అమావాస్య సెప్టెంబర్ 25వ తేదీన వస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

కర్ణుడి కథ

మహాభారతం ప్రకారం.. కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తరువాత స్వర్గానికి ప్రయాణించేటటువంటి సమయంలో ఆ దారియందు కర్ణునికి చాలా దాహం వేస్తుంది. అలా దాహంతో ఉన్న కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వద్దకు వెళ్లి నీటిని తాగడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆ నదిలోని నీరంతా సువర్ణము (బంగారం)గా మారిపోయింది. అలా మరొ కొంత దూరం ప్రయాణం చేసిన కర్ణునికి దాహంతో పాటు ఆకలి వేసింది. ఒక మామిడిచెట్టు కనిపించగా.. ఆ చెట్టుకున్న కాయలు తిందామనుకున్నాడు. తినడానికి ప్రయత్నించిగా ఆ చెట్టు కాయలు బంగారంగా మారిపోయాయి. ఈ వింత చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రియైన సూర్యభగవానుని ప్రార్థించాడు.

నీ జన్మయందు అనేక దానములు చేశావు కానీ.. ఏ రోజు అన్నదానం, శ్రాద్ధ కర్మలు, పితృతర్పణాలు ఆచరించలేదు. అందువలనే నీకు పరిస్థితి ఏర్పడినది అని సూర్యభగవానుడు చెప్తాడు. అది విన్న కర్ణుడు నాకు ఈ విషయం గురించి తెలియక నేను అట్టి దానములు చేయలేకపోయితినే అని భాదపడతాడు. అప్పుడు నాకు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టి.. అన్నదానము చేసే స్థితి కల్పించాలని కోరగా.. ఇంద్రుని సహాయంతో కర్ణుని భూలోకానికి పంపిస్తాడు. అలా భూలోకమునకు కర్ణుడు వచ్చిన రోజునే భాద్రపద మాస పితృ పక్షము అంటారు. 15 రోజులు కర్ణుడు తను గతించినటువంటి పితృదేవతలకు అందరకు తర్పణాలు వదిలి.. అన్నదానము, శ్రాద్ధకర్మలు నిర్వర్తించి.. మహాలయ అమావాస్య రోజు స్వర్గానికి తిరిగి వెళ్లాడు.

అందువలన ప్రతీ ఒక్కరూ కనీసం మహాలయ అమావాస్యయందు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వర్తించి తర్పణాలు వదలి దానధర్మాలు చేయవలెను అని మహాభారతం చెప్తుంది. పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు ఋణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి. దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే 10 రెట్లు పుణ్యఫలం భాద్రపద మాసంలో చేసేటువంటి పితృ దేవతల ఆరాధనకు ఫలితం లభిస్తుంది.

పితృదేవత ఆరాధన అంటే

పితృ దేవత ఆరాధన అనగా మన 7 తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు, తాతముత్తాతలు, బంధువులు, గురువులు వీరి కోసం వదిలేటటువంటి తర్పణాలు, శ్రాద్ధకర్మలు, చేసేటువంటి దానాలు అని అర్థం. ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన తిథి రోజున శ్రాద్ధకర్మలు నిర్వర్తించాలి. అలా శ్రాద్ధకర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథిలో జరపని పక్షంలో.. భాద్రపదమాసంలో కృష్ణపక్షంలో (పితృ పక్షంలో) వచ్చేటువంటి తిథియందు ఆ శ్రాద్ధకర్మలు నిర్వర్తించినట్లయితే సంవత్సరంలో చేసేటటువంటి ఫలితం వారికి లభించును.

యుద్ధంలో చనిపోయినటువంటివారికి.. యాత్రలో చనిపోయినటువంటివారికి.. అలాగే ప్రయాణములలో యాక్సిడెంటులలో చనిపోయిన వారికి.. కరోనా వంటి మహమ్మారితో చనిపోయినటువంటి వారికి.. ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి.. భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృ పక్షంలో, మహాలయ అమావాస్యలో వారికి శ్రాద్ధకర్మ నిర్వహించడం ఉత్తమమైనది. పితృ ఋణాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదని శాస్త్ర వచనము. పితృ ఋణాలు కనుక ఉంటే.. ఆ ఇంట్లో మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు చెప్తున్నారు. శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు విడిచి పెట్టినటువంటి వారు పితృ దేవతలు ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది.. సుఖసౌఖ్యములు పొందుతారని పురాణాలు తెలియచేసాయి.

WhatsApp channel

టాపిక్