Maha Kumbh Mela 2025 dates: మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు ఏయే తేదీల్లో చేయాలి? చరిత్ర, ప్రాముఖ్యత తెలుసుకోండి
Maha Kumbh Mela 2025 dates: జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ మేళాలో భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో శుద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి కోసం ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారు. ఏయే తేదీల్లో పుణ్య స్నానాలు, రాజ (షాహీ) స్నానాలు ఆచరించడం అవశ్యమో ఇక్కడ తెలుసుకోండి.
మహా కుంభమేళా హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన పుణ్య కార్యాల్లో ఒకటి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2025లో లక్షలాది మంది భక్తులు ఈ శుభకార్యంలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సందర్శిస్తారు. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడం ద్వారా యాత్రికులు తమను తాము ఆధ్యాత్మికంగా శుభ్రపరచుకునే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. ముఖ్య తేదీల నుండి దాని గొప్ప చరిత్ర వరకు మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.
మహా కుంభమేళా 2025: పవిత్ర స్నానాలకు కీలక తేదీలు
మహా కుంభమేళా 2025 జనవరి 13, 2025న పుష్య పూర్ణిమ స్నానంతో ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న మహా శివరాత్రితో ముగుస్తుంది.
ముఖ్యమైన పవిత్ర స్నాన తేదీలు:
పవిత్ర స్నానాలకు ముఖ్య తేదీలు | విశిష్టత |
---|---|
January 13, 2025 | పుష్య పౌర్ణమి స్నానం (ప్రారంభ దినం) |
January 15, 2025 | మకర సంక్రాంతి స్నానం |
January 29, 2025 | మౌని అమావాస్య స్నానం (రాజ స్నానం/షాహీ స్నానం) |
February 3, 2025 | వసంత పంచమి స్నానం (రాజ స్నానం/షాహీ స్నానం) |
February 12, 2025 | మాఘ పౌర్ణమి స్నానం |
February 26, 2025 | మహా శివరాత్రి స్నానం (ముగింపు రోజు) |
మహా కుంభ మేళాలో పుష్య పౌర్ణమి (జనవరి 13), మకర సంక్రాంతి (జనవరి 15), మౌని అమావాస్య (జనవరి 29), వసంత పంచమి (ఫిబ్రవరి 3), మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12), మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) తేదీల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలి. ఈ పవిత్ర స్నాన ఆచారాలు లేదా షాహి స్నానాలు ఆత్మను శుద్ధి చేస్తాయని, పాపాలను కడిగేస్తాయని నమ్ముతారు.
మహా కుంభమేళా 2025 చరిత్ర
కుంభమేళా మూలాలు హిందూ పురాణాలకు, ముఖ్యంగా సముద్ర మథనం లేదా సముద్రం చిలకడం అనే పురాణానికి సంబంధించినవి. ప్రాచీన గ్రంథాల ప్రకారం, ఈ ఖగోళ సంఘటన అమృతం, అమరత్వం తిరిగి పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య సహకార ప్రయత్నం.
ఈ ప్రక్రియలో, పవిత్ర అమృతంతో నిండిన కుంభం (కుండ) బయటపడింది. రాక్షసుల నుండి దానిని కాపాడుకోవడానికి, మోహినిగా మారువేషంలో ఉన్న విష్ణువు కుండను పట్టుకుని పారిపోయాడు. అతని ప్రయాణంలో, అమృతం యొక్క కొన్ని చుక్కలు నాలుగు ప్రదేశాలలో చిందాయి. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. ఈ ఘటన కుంభమేళాకు పవిత్ర స్థలాలుగా చేసింది.
మహా కుంభమేళా ప్రాముఖ్యత
ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్) దాని పౌరాణిక మూలాలు, భౌగోళికం కారణంగా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది త్రివేణి సంగమానికి నిలయం—గంగా, యమునా మరియు పౌరాణిక సరస్వతి నదుల పవిత్ర సంగమం. హిందూ మతంలోని పవిత్ర స్థలాలలో ఒకటిగా పూజలు అందుకుంటోంది. కుంభమేళా సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క ఖగోళ స్థానాల ఆధారంగా 12 సంవత్సరాల చక్రాన్ని అనుసరిస్తుంది.
ప్రయాగ్‌రాజ్‌లోని 2025 మహా కుంభ మేళా చాలా అరుదు. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన అమరిక ప్రార్థనలు, ఆచారాలకు అత్యంత శుభప్రదమైన సమయంగా భావిస్తారు. యాత్రికులు నదులలో పవిత్ర స్నానం చేసి, శుద్ధి, మోక్షాన్ని కోరుకుంటారు. దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, కుంభమేళా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, భక్తి, సామరస్యం కలిగి ఉండే ఈ గొప్ప వేడుక లక్షలాది మందిని ఏకం చేస్తుంది.
మహా కుంభమేళా 2025 కీలక ఆచారాలు
షాహి స్నానం (రాజ స్నానం): నాగ సాధువులు, ఆధ్యాత్మిక నాయకులతో సహా సాధువులు పవిత్ర నదులలో చేసే పవిత్ర స్నానం. ఇది పాపాలను శుభ్రపరుస్తుందని, దైవిక ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. మౌని అమావాస్య, వసంత పంచమి రోజు ఈ రాజస్నానాలు ఉంటాయి.
సంకీర్తన, భజనలు: భక్తులు శ్లోకాలు, జపాలు, భజనలు పాడుతూ, వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తి, భక్తితో నింపుతారు.
యోగా మరియు ధ్యానం: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడానికి యాత్రికులు యోగా, ధ్యాన సెషన్‌లలో పాల్గొంటారు.
ఆధ్యాత్మిక ఉపన్యాసాలు: ప్రఖ్యాత పండితులు, ఆధ్యాత్మిక నాయకులు ప్రసంగాలు, తాత్విక చర్చలు చేస్తారు, మతం, ఆధ్యాత్మికత, జీవితంపై లోతైన అంశాలను చర్చిస్తారు.
సంబంధిత కథనం