మాఘ మాస వైభవం- బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ-magha masam begins from today check this month greatness and specialty here are the full details see these ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మాఘ మాస వైభవం- బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మాఘ మాస వైభవం- బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk HT Telugu
Jan 30, 2025 04:30 PM IST

మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండో నెల. ఉత్తరాయణ పుణ్య కాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకూ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మాఘమాసంలో నదీ స్నానం చేసి, శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తికొద్దీ దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది.

మాఘ మాస వైభవం- బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మాఘ మాస వైభవం- బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ (pinterest)

మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండో నెల. చంద్రుడు మఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్య కాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకూ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మాఘమాసంలో నదీ స్నానం చేసి, శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తికొద్దీ దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

సంబంధిత ఫోటోలు

నదీ స్నానం చేయలేనివారు వీలున్నంతవరకూ చెరువు, కొలను, బావి నీటితోనైనా స్నానమాచరించొచ్చని అంటారు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఓ ఆచారమే. అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలనీ, దానం చేయాలనీ చెబుతారు. ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది.

ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది. నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమినాడైనా సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే.... ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది అని పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

సముద్ర స్నానం ఎందుకంటే?

నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ స్నానమాచరించిన పుణ్యఫలం దక్కు తుంది. ఇక, మాప మాసం శుభకార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్లు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు... ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు. ఇతర నెలలతో పోలిస్తే మాఘ మాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయనీ, ఈ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ నమ్మకం.

అందుకే ఈ నెల్లోనే పెళ్లి చేసుకునేందుకు ఎక్కువమంది. ఆసక్తి చూపిస్తారు. ఇక, ఈ మాసంలోనే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి జన్మదినం, ప్రత్యక్షనారాయణుడిగా పిలిచే సూర్యభగవానుడి జయంతీ రావడం గమనార్హం అని ప్రముఖ ఆధ్యాత్మిక వెత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

అక్షరాభ్యాసం, సూర్యారాధన

మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమిగా, వసంత పంచమిగా పిలుస్తాం. ఈ రోజునే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిందట. వాగ్దేవిని వసంతపంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని ఓ నమ్మకం.

దేవీశరన్నవ రాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నాడే కాకుండా.. ఈ రోజునా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా చేయడంవల్ల నిరాటం కంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ఐతిహ్యం. అందుకే వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగానూ పరిగణిస్తారు. ఆ తరువాత వచ్చే మాఘశుద్ధ సప్తమే రధసప్తమి కనిపించే దేవుడిగా పిలిచే సూర్యభగవానుడు జన్మించిన రోజే రధసప్తమి. ఏడు అశ్వాల రథంపైన సూర్యభగవానుడు పయనించి కరుణిస్తాడని ఓ విశ్వాసం.

అందుకే ఆ ప్రత్యక్షనారాయణుడి ఎదురుగానే పూజాకార్యక్రమాన్ని నిర్వహించే సంప్రదాయమూ వచ్చింది. అంటే... ఏడు జిల్లేడు ఆకులను శరీరంపైన పెట్టుకుని స్నానమాచరించి.. ఆ తరువాత ఆరుబయట సూర్యభగవానుడి ఎదురుగా పొంగలి వండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారుచేసి నివేదిస్తారు.

ఈ క్రతువు పూర్తికావడానికి దాదాపు గంటా రెండు గంటలు పడుతుంది గనుక శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజసిద్ధంగా లభించడంతోపాటు చర్మ సంబంధ సమస్యలు కూడా దరిచేరవని అంటారు. ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులకూ ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.

వివాహాది శుభకార్యాలను జరిపించేందుకూ, చదువుల తల్లినీ సూర్యనారాయణుడినీ పూజించేందుకూ అనువైన మాసం ఏదయినా ఉందంటే అది మాఘమే. ఈ నెలలో చేసే దేవతారాధనకూ నదీ స్నానానికీ ఎంతో విశిష్ఠత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అని బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner