Maha Shivaratri: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి- బ్రహ్మశ్రీ చిలకమర్తి
Maha Shivaratri: శివలింగాన్ని బిల్వ పత్రాలతో అభిషేకిస్తే శివానుగ్రహం కలుగుతుంది. సంవత్సర మంతా నిత్య శివ పూజ చేసిన ఫలం దక్కుతుంది. ఇది లింగోద్భవం, అంటే శివుడు లింగ రూపంలో కనిపించిన రోజు. శివుడు పార్వతిని వివాహమాడిన రోజుగా కూడా దీనిని పరిగణిస్తారు.

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి.. రాత్రిపూట శివనామ స్మరణతో జాగరణ చేయడంతో పాటు శివలింగాన్ని బిల్వ పత్రాలతో అభిషేకిస్తే శివానుగ్రహం కలుగుతుంది. సంవత్సర మంతా నిత్య శివ పూజ చేసిన ఫలం దక్కుతుంది. ఇది లింగోద్భవం, అంటే శివుడు లింగ రూపంలో కనిపించిన రోజు. శివుడు పార్వతిని వివాహమాడిన రోజుగా కూడా దీనిని పరిగణిస్తారు.
శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతుంటాయి. మహాశివరాత్రి పర్వదినాన అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.భగవంతుని ఆరాధనలన్నీ పగట సమయంలో జరుపు కోవడం సర్వసాధారణం. రాత్రిపూట ఆరాధన ఒక శివరాత్రికే చెల్లింది.
శివరాత్రి రోజున రాత్రి సమయంలో పూజలందుకొనే విశిష్ట దైవం శివుడు. పరమేశ్వరుడు, త్రినేత్రుడు, శంకరుడు, శంభుడు మున్నగు నామాలు కలిగివున్నా భక్తులకు మాత్రం అత్యంత ప్రియమైన నామం 'శివ'. ఈ పదం శుభాలనొసగే పదం. 'శి' అనే అక్షరం పాపాలను నశింపజేస్తుంది. 'వ' అనే అక్షరం ముక్తి ప్రసాదిస్తుంది. కనుకనే శివ నామము శుభంకరము అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివ యను ఈ రెండు అక్షరములు మహాపాతకములను నాశనము చేయ గల సామర్థ్యము గలవి. శివ శబ్దమునకు నమః ఓడించి నమఃశివాయ అని ఉచ్ఛరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నిర్మలుడు, శాంతుడు, సాధువు, మిత భాషి, కామక్రోధరహితుడు, సదాచారి, జితేంద్రియుడు, అయిన గురువు ద్వారా ఉపదేశించిన మంత్రము శీఘ్రముగా సిద్ధిస్తుంది.
శకార, ఇకార, వకారముల కలయికయే శివుడు. శ అనగా నిత్యము, సుఖము ఆనందము. ఇ అనగా పరమపురుషుడు, వ అనగా అమృత సమానమైన దివ్యశక్తిని ప్రసాదించు పరమపురుషుడు శివుడు అంటారు.శుబంకరుడైన శివుడికి సంబంధించిన పర్వము మహాశివ రాత్రి.
మాఘ బహుళ చతుర్దశి నిశిరాత్రి అనగా అర్ధరాత్రి సమయమున శివుడు లింగరూపధారిగా అవతరించాడని శివపురాణము పేర్కొంటున్నది. ఈ రాత్రి శివుడికి అత్యంత ప్రియమైన రాత్రి. ఈ రోజున ఉపవాస, జాగరణం చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. రాత్రి నాలుగు ఝాములలో ప్రతి ఝాము శివలింగానికి అభిషేకములు జరపాలి.
ప్రధమ ఝాములో దుగ్ధము, ద్వితీయ ఝాములో దది, తృతీయ ఝాములో ఘృతము, చతుర్థ ఝాములో మధుతో పూజలు, అభిషేకాలు చేయాలి. శివరాత్రి రోజు వేకువఝామునే లేచి స్నానాదికాలు ముగించుకుని శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోవాలి. షోడశోపచారములతోను, మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం మున్నగునవి జరిపించాలి.
ఉదయం సమయంలో దర్శనం చేసుకుంటే సర్వపాపాల నుంచి విముక్తి లభిస్తుంది. మధ్యాహ్నం దర్శనం చేసుకుంటే భవబంధ దుఃఖములు తొలగిపోతాయి. రాత్రి దర్శనం వలన అంతులేని పుణ్యరావి ప్రాప్తిస్తుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.