Ugadi Rasi Phalalu 2024: కుంభ రాశి ఉగాది రాశి ఫలాలు.. ఏలినాటి శనితో కష్టాలే ఎక్కువ
Kumbha Rashi 2024 Ugadi Rasi Phalalu: కుంభ రాశి ఉగాది 2024 రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్, ప్రేమ తదితర అంశాల్లో ఈ క్రోధి నామ సంవత్సరం కుంభ రాశి జాతకులకు ఎలా ఉండబోతోందో వివరించారు. అలాగే మాసవారీ ఫలితాలను కూడా ఇక్కడ చూడవచ్చు.
2024-25 శ్రీ కోధి నామ సంవత్సరం కుంభ రాశి వారి జాతకం చెడు ఫలితాలను ఇస్తోందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభ రాశి జాతకులు అవుతారు. కుంభ రాశి వారికి నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 14 పాళ్లు, వ్యయం 14 పాళ్లు ఉంటుందని చిలకమర్తి వివరించారు. అలాగే రాజ్యపూజ్యం 6 పాళ్లు, అవమానం 1 పాలు ఉంటుందని తెలిపారు.
కుంభ రాశి వారి ఉగాది పంచాంగం
శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా కుంభ రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 4వ స్థానమునందు, శని జన్మరాశి స్థానము నందు సంచరిస్తున్నారు.
కుంభ రాశి వారికి వాక్ స్థానములో రాహువు, ఆయు స్థానములో కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు మరియు అనారోగ్య సమస్యలు వేధించును. కుంభ రాశి వారు ప్రశాంతంగా ఉండాలని సూచన. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచన.
ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు అధికముగా ఉండును. రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడును. ఉద్యోగ మార్పు కోసం చేయు ప్రయత్నాలు ఇబ్బంది కలిగించును. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారంలో సమస్యలు ఇబ్బందిపెట్టును. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగును.
స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు వేధించును. ఒత్తిళ్ళ వలన అనారోగ్య సమస్యలు కలుగు సూచన. రైతులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సినీ, మీడియా రంగాలవారికి కష్ట సమయం. కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్ధితి ఏర్పడును. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. అనారోగ్య సమస్యలు, చికాకులు ఇబ్బందిపెట్టును.
కుంభ రాశి వారి ప్రేమ జాతకం 2024-25
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించును. జీవిత భాగస్వామితో ఆనందముగా గడిపెదరు. ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమగును. అవివాహతులకు వివాహయోగమున్నది.
కుంభ రాశి వారి ఆర్థిక పంచాంగం 2024-25
కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా మార్పుకలుగు సంవత్సరం. ఏలినాటి శని ప్రభావం వలన ఒడిదుడుకులు, అప్పుల బాధలు ఉన్నప్పటికీ చతుర్ధంలో గురుని అనుకూలత వలన ఆర్థికాభివృద్ధి కలుగును.
కుంభ రాశి వారి కెరీర్ 2024-25
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్‌పరంగా మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభము కలుగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును.
కుంభరాశి వారి ఆరోగ్యం 2024-25
కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలు కలుగుచున్నవి. గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటకు వచ్చెదరు. అరోగ్యం కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. చతుర్ధంలో గురుని అనుకూలత వలన ఆరోగ్యాభివృద్ధి కలుగును.
చేయదగిన పరిహారాలు
కుంభ రాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నీలం ఉంగరం ధరించాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అలాగే దుర్గాదేవిని పూజించాలని, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయాలని సూచించారు.
ధరించాల్సిన నవరత్నం: కుంభరాశి వారు ధరించవలసిన నవరత్నం నీలము.
ప్రార్థించాల్సిన దైవం: కుంభ రాశి వారు పూజించవలసిన దైవం శివుడు.
కుంభరాశి వారికి నెలవారీ రాశి ఫలాలు 2024-25
ఏప్రిల్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనవసరపు విరోధములు. గృహములో శుభకార్యములు వాయిదాపడుటచే చికాకులు. శ్రమ, శత్రుబాధ. ఒత్తిళు అధికము. ప్రయాణముందు అనుకోని సమస్యలు. మనోచాంచల్యముతో బాధ.
మే: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార సంబంధిత విషయములలో నష్టము కలుగును. ఆందోళనచే కొంత అనారోగ్య సూచనలు. స్థిరచరాస్తుల విషయములో సమస్యలు. బంధు వ్యతిరేకత వల్ల సమస్యలు.
జూన్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచనలు. మిత్రబేధం. శ్రమ వృథా అగుట. ప్రయత్నములు అనుకూలించవు. పనులయందు ఇబ్బంది. ద్రవ్యము సమయానికి అందకపోవుట. భూసమస్యలకు సంబంధించిన వ్యవహారములు వాయిదా పడుట. కోర్టు వ్యవహారములు చాలా క్లిష్టంగా ఉ౦డును.
జూలై: ఈ మాసం కుంభ రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. వ్యవసాయదారులకు కొంత అనుకూలం. కుటుంబములో మాట పట్టింపులతో భేదాభిప్రాయములు. ప్రయాణముల యందు అపశృతులు. ఖర్చులధికమగును. అధికారుల మూలక ఒత్తిడి. దూరప్రయాణము వలన అలసట. తలత్రిప్పుట మొదలగు సమస్యలు.
ఆగస్టు: ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉంది. అనవసర ఖర్చులు. శత్రుపీడ. గ్రహస్థితి వల్ల శ్రమ, ఒత్తిడులు. ఇంట శుభకార్య ప్రయత్నాలు. బంధుమిత్ర సమాగమము. కృషిలో పట్టుదల లోపించుట. స్త్రీ సౌఖ్యం.
సెఫ్టెంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. బంధువుల, పూర్వపు మిత్రుల కలయిక. శుభవార్తలు వింటారు.
అక్టోబర్: ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉంది. కీర్తి ప్రతిష్టలు కలుగును. మానసిక ఒత్తిడి. వివాహాది పనుల యందు అభివృద్ధి. అనుకోకుండా కొన్ని విషయములయందు చిక్కుకొనుట. అనుకున్న దానికన్నా ఖర్చు చాలా అధికమగుట.
నవంబర్: ఈ మాసం మీకు మధ్యస్థం. వ్యాపారమునందు కొద్దిపాటి వృద్ధి. దైవపర శుభ కార్యక్రమాల యందు ఆసక్తి. స్త్రీపర లాభము. వ్యవసాయదారులకు కొంత అనుకూలం. మృష్టాన్న భోజనములు. ప్రశాంతతకు భంగము కలుగును. ఓర్పుచే కార్యసిద్ధి.
డిసెంబర్: ఈ మాసం కుంభ రాశి జాతకులకు మధ్యస్థ సమయం. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ ప్రయత్నము సిద్ధిస్తుంది. బంధుమిత్రుల సమాగమము. నిరుద్యోగులకు కొంత ఊరట. శ్రమ అధికమైనప్పటికి అదాయం వృద్ధి చెందును. మాసాంతము శుభము.
జనవరి: ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు. కోర్టుకు సంబంధించిన వ్యవహారములు వాయిదా వేయుట మంచిది. నూతన గృహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. రాబడి పెరుగుతుంది. శత్రు జయము. కొన్ని సమస్యలకు పరిష్కారం.
ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారం నందు అభివృద్ధి. పెద్దల ఆదరాభిమానాలు కలుగుట. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. ప్రతికూలతలు లేకుండుట మంచిది. సంఘములో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుందురు. బంధువులు ఆగమనం.
మార్చి: ఈ మాసం కుంభరాశి వారికి మధ్యస్థముగా ఉన్నది. స్వంత పనుల యందు అసక్తి పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి. ఇంట శుభకార్యాలు సిద్ధించును. భార్య ఆరోగ్యం కుదుటపడును. స్త్రీ పర సమస్యలు తొలగుతాయి.