రేపు యోగిని ఏకాదశి.. పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి
రేపు బుధవారం యోగిని ఏకాదశి. పూజా విధానం, పూజా సమయం, ఉపవాస సమయం, ఉపవాస విధానం, ఉపవాస ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి
యోగిని ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. యోగిని ఏకాదశి వ్రతం గురించి, ఉపవాసం, దాని నియమాలు ఇక్కడ తెలుసుకోండి.
ట్రెండింగ్ వార్తలు
హిందూ ధర్మంలో విష్ణువుకు ఏకాదశి తిథి అంకితం. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. అంటే నెలకు రెండుసార్లు ఏకాదశి వస్తుంది. జ్యేష్ట మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. అంటే జూన్ 14, 2023 బుధవారం రోజున యోగిని ఏకాదశి వస్తుంది.
యోగిని ఏకాదశి వ్రత ప్రాముఖ్యత
నిర్జల ఏకాదశి తరువాత, దేవశయని ఏకాదశికి ముందు వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. హిందూమతం విశ్వాసాల ప్రకారం యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న భక్తుడు స్వర్గలోక ప్రాప్తి పొందుతాడు. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయడంతో సమానమని విశ్వాసం.
యోగిని ఏకాదశి శుభ ముహూర్తం
ఏకాదశి తిథి ప్రారంభం: జూన్ 13, 2023 ఉదయం 9.28 గంటలకు
ఏకాదశి తిథి సమాప్తం: జూన్ 14, 2023 ఉదయం 8.48 గంటలకు.
అయితే సాాధారణంగా సూర్యోదయాన ఏ తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన యోగిని ఏకాదశి జూన్ 14, బుధవారం రోజు జరుపుకుంటారు.
యోగిని ఏకాదశి పూజ
ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు పూర్తిచేసుకోవాలి. పూజామందిరంలో దీపం వెలిగించాలి. గంగా జలాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. పూలు, తులసీ దళాలు సమర్పించాలి. నైవేద్యంలో తప్పనిసరిగా తులసీ దళాలను ఉంచాలి. ఆ తరువాత ఉపవాస దీక్ష ప్రారంభించాలి. మరుసటి రోజు సూర్యోదయం వరకు ఈ దీక్షను కొనసాగించాలి.
డయాబెటిస్ ఉన్న వారు, 12 ఏళ్లలోపు, 65 ఏళ్ల పైబడిన వయస్సు కలిగిన వారికి ఉపవాస దీక్ష నిషేధం.