Pooja Saree colour: వరలక్ష్మీ పూజ ఏ రంగు చీర కట్టుకుని చేస్తే ఎక్కువ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోండి.. ఈ రంగులు అశుభం
Pooja Saree colour: వరలక్ష్మీ వ్రతం ఆచరించేటప్పుడు ఏ రంగు చీర కట్టుకుంటే శుభప్రదమో తెలుసా? ఈ పూజకు ప్రత్యేకంగా కొన్ని రంగుల చీర కట్టుకోవడం శుభం కలగడంతో పాటే.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అలాగే కొన్ని రంగుల చీరలు కట్టుకోకపోవడం మంచిది. ఆ నియమాలన్నీ వివరంగా తెల్సుకోండి.
వరమహాలక్ష్మి కటాక్షం కోసం శ్రావణ శుక్రవారం పూజ చేయడం సాంప్రదాయంగా వస్తోంది. సౌభాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ పూజా సమయంలో మహిళల వస్త్రధారణ విషయంలో అనేక సందేహాలుంటాయి. ఈ పూజా సమయంలో ఎలాంటి రంగు చీర కట్టుకోవాలో, ఏ రంగు చీరకు దూరంగా ఉండాలో తెల్సుకోండి.
వరలక్ష్మీ వ్రతాన్నిఈ రంగు చీరలో ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, సంతోషం.. ఆ రంగులు అశుభం
బంగారు వర్ణం:
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ ।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవః
ఈ శ్లోకం ప్రకారం.. ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు వెండి ఆభరణాలతో అలంకీకృతమైన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.
అమ్మవారు ఎలాగైతే బంగారు వర్ణ చాయలో, మేలిమి బంగారు నగలతో మెరిసిపోతారో.. మనమూ అమ్మవారి ఆశీస్సుల కోసం బంగారు రంగు చీర కట్టుకుంటే శుభ్రప్రదం అని చెబుతారు. ఆ అమ్మవారి కటాక్షం ఉంటుందని నమ్మకం.
ఆకుపచ్చ:
శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆకుపచ్చ రంగు గాజులు, చీర కట్టుకోవడం వల్ల కుటుంబంలో, జీవితంలో సంతోషం నెలకొంటుందని నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కూడా ఈ ఆకుపచ్చ చీరలో వ్రతమాచరిస్తే శ్రేయస్సు కలుగుతుందని, అమ్మవారి కటాక్షం పొందొచ్చని నమ్మకం.
వీటితో పాటే..
బంగారు, ఆకుపచ్చ రంగులతో పాటే.. అమ్మవారికి సూర్యుని రంగైన ఎరుపు, ఆ కలువ పువ్వు రంగైన గులాబీ రంగు, పసుపు, గోధుమ రంగులు కూడా ఇష్టమే. ఈ రంగు చీరల్లో పూజ ఆచరించవచ్చు. అలాగే మీ దగ్గరున్న బంగారు నగలు పూజ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఆకుపచ్చ, ఎరుపు రంగుల గాజులు ధరించడం మరింత మంచిది.
ఈ రంగులు అశుభం:
పూజా సమయంలో నలుపు, నలుపుకు దగ్గరగా ఉండే ముదురు నీలం, బూడిద రంగుల చీరలు ధరించకపోవడం మంచిది. వీటిని అశుభ రంగులుగా పరిగణిస్తారు.