ఎల్లుండి జూన్ 19న ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూలై 17 వరకు ఈమాసం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సంవత్సంలో రెండు ఆయనములు. ఉత్తరాయనము దక్షిణాయనము. సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించే సమయం ఉత్తరాయనం. మిధున రాశి నుండి కర్కాటక రాశిలోని ప్రవేశించే సమయం దక్షిణాయనంగా చెప్పబడనది. ఇలాంటి ఆయనములు ప్రారంభమయినటువంటి మాసములు అనగా ఉత్తరాయనం ప్రారంభమైనటువంటి మాసము పుష్యమాసము. దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మాసం ఆషాఢ మాసము.
ఈ రెండు మాసములు కూడా శూన్యమాసములు అని శాస్త్రాలు సూచించాయి. ఇలా శూన్యమాసములయందు గృహారంభం, వివాహాది శుభకార్యములు ఆచరించకూడదని శాస్త్రములు తెలిపినవి. శూన్యమాసం దేవతారాధనలకు. శక్తి ఆరాధనలకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆషాఢ.. ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ అషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాడ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆషాఢంలో ఆలయాలు పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై ఉంటారు. తొలి ఏకాదశి పండగ కూడా ఆషాఢ మాసంలోనే రానుంది.
ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం ఆషాడంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీని వల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు. ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది. దీంతో తల్లీ బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.
వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి... ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.