Karthika Purnima: కార్తీక పౌర్ణమి పూజా విధానం, విశిష్టత వివరంగా మీకోసం..
Karthika Purnima: కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ రోజు పూజ ఎలా చేసుకోవాలి. ఎలాంటి నియమాలు, విశిష్టత ఉంటుందనే విషయాలన్నీ పూర్తిగా వివరంగా ఇక్కడ తెల్సుకోండి.
కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ పరమపవిత్రమైంది. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసమంతా చేసే పూజలు ఒకెత్తయితే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తు. చాలా పూజలు చేస్తూ భక్తిలో నిమగ్నమై ఉంటారు. దైవ సన్నిధిలో ఎక్కువ సేపు గడపడానికి ప్రయత్నిస్తారు. తులసి పూజ చేస్తారు. కార్తీక పూర్ణిమ రోజు వత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజు చేసే పూజలు నిష్టగా, భక్తితో పూర్తిచేస్తారు.

ఎన్ని వత్తులు వెలిగిస్తారు:
కార్తీక పౌర్ణమి రోజున చాలా ప్రాంతాల్లో 365 వత్తులు వెలిగించుకునే ఆనవాయితీ ఉంటుంది. ఈ వత్తులు సంవత్సరంలో ఒక్కో రోజును సూచిస్తాయి. ఏ కారణం చేత అయినా సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయలేకపోయినా.. ఈ ఒక్క రోజు అన్ని వత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతారు.
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం:
పౌర్ణమి గడియలు 26వ తేదీన మధ్యాహ్నం నుంచి మొదలై 27 వ తేదీ మధ్యాహ్నం వరకూ ఉన్నాయి. 26 వతేదీన పూజ చేయాలనుకునే వారు ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సూర్యాస్తమయం వేళ పూజ చేసుకోవచ్చు. 27 వతేదీన చేయాలనుకునే వారు ఉదయాన్నే ఉపవాసం ఉండి ఈ పూజ చేసుకోవాలి.
కార్తీక పౌర్ణమి పూజా నియమాలు, విధానం:
పూజ రోజు ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వెలిగించాల్సిన 365 వత్తులను ముందుగానే నూనెలో కానీ, నెయ్యిలో కానీ నానబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. రోజంతా పాలూ, పండ్లతో ఉపవాసం ఆచరించాలి. పూజ తర్వాత భోజనం చేయొచ్చు. పూజ చేసేటప్పుడు తులసితో పాటూ ఉసిరి చెట్టును కూడా పెట్టుకుని పూజ చేయడం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు. అలా పెట్టుకున్న తర్వాత తులసికోట శుభ్రం చేసుకుని ముందు బియ్యంపిండితో ముగ్గు వేసుకోవాలి. కోటని పూలతో ముస్తాబు చేసుకోవాలి. తర్వాత తులసికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి. పసుపు, కుంకుమలతో దీపారాధన చేయాలి. మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి. తర్వాత కలశ పూజ చేయాలి. గణపతి అష్టోత్తరకాలు చదువుతూ పూలు, దూపం, దీపం సమర్పించుకోవచ్చు. తర్వాత మంగళ హారతులు పాడుతూ హారతివ్వాలి. ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక పక్కన ఆకులు పెట్టుకుని మీద ప్రమిద పెట్టుకుని పసుపు, కుంకుమలతో అలంకరించాలి. అందులో ముందుగా తడిపి సిద్ధం చేసుకున్న 365 వత్తులను ఉంచి వెలిగించాలి. ఉసిరి దీపం, పిండి దీపం కూడా సాంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించుకోవాలి. తర్వాత నైవేధ్యం సమర్పించాలి.