Pradosha Vratam 2022 । నేడు కార్తీకమాసంలో చివరి సోమవారం.. ప్రదోష వ్రతం సమయం, ప్రాముఖ్యత ఇదే!
Pradosha Vratam 2022: ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం. అంతేకాకుండా ప్రదోష వ్రతం కూడా. సంధ్యా సమయంలోనే పూజ చేయాలి. అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Pradosha Vratam 2022: ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం. అలాగే సోమ ప్రదోషం కూడా. ఈ ప్రదోషం అనేది హిందూ క్యాలెండర్‌లో ప్రతి పక్షం రోజులలో పదమూడవ రోజున జరిగే ద్వైమాసిక సందర్భం. ప్రతి నెల 2 ప్రదోషాలు ఉంటాయి, ఒకటి శుక్ష పక్షం, మరొకటి కృష్ణ పక్షం. ఈ ఏడాది మార్గశిర మాసం మొదటి ప్రదోష వ్రతం నవంబర్ 21 సోమవారం నాడు వచ్చింది. పరమశివుని పూజించేందుకు ఇది ఎంతో ప్రాముఖ్యమైన రోజుగా పేర్కొనడమైనది. ఈ రోజున శివుని ఆరాధన చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుందని, బాధల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ ప్రదోష కాలంలో ఆచరించే ఉపపాసాన్ని 'ప్రదోష వ్రతం' అంటారు. భక్తులు రుద్రాక్ష, విభూతిని ధరించి, అభిషేకం, గంధం, బిల్వ ఆకులు, దీపం, నైవేద్యం సమర్పించి శివుని పూజిస్తారు.
ప్రదోష ఆరాధన సాయంత్రం సంధ్యా సమయంలో జరుగుతుంది. సూర్యాస్తమయానికి 1.5 గంటల ముందు, ఆ తరువాత 3 గంటల సమయం వరకు అత్యంత అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. వ్రత నిర్వహణలో ఉపవాసం, జాగరణ ఉంటుంది. ప్రదోష వ్రతం సంప్రదాయాన్ని అనుసరించి పవిత్రమైన ఆచార దశలతో ప్రదోష నాడు నిర్వహిస్తారు.
ప్రదోష ఆరాధనలో భాగంగా, సూర్యాస్తమయానికి ఒక గంట ముందు స్నానం చేసి, శివుడు, పార్వతి, వారి కుమారులు గణేశుడు, కార్తికేయుడు, నందిని పూజిస్తారు. ప్రదోష సమయంలోఅన్ని శివాలయాల్లో నందికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నందిపై కూర్చున్న భంగిమలో పార్వతీ సమేతంగా ఉన్న శివుడి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ సముదాయంలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. శివుడిని ఆవాహన చేస్తారు. ప్రధాన పూజ ముగిసిన తర్వాత ప్రదోష కథ చదువుతారు.
ప్రదోష వ్రత పూజా విధానం
- సంధ్యాసమయానికి ముందే తలస్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి.
- శివుపార్వతుల విగ్రహాలను ఒకచోట ఉంచండి.
- పాలు, గంగాజలం, నెయ్యి, పెరుగు, తేనెతో శివుడు, తల్లి పార్వతికి అభిషేకం చేయండి.
- ఆ తర్వాత షోడశోపచార పూజ చేయండి.
- శివునికి మందార, బిల్వపత్ర, భాంగు, పుష్పాలను సమర్పించండి.
ప్రదోష వ్రత సమయం
ప్రదోష సమయం - నవంబర్ 21 సాయంత్రం 05:24 నుండి రాత్రి 08:05 వరకు. అలాగే ఈ రోజున రాత్రి 09:06 వరకు ఆయుష్మాన్ యోగం ఉంది. ఈ యోగంలో పూజ చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి, పూజా ఫలం రెట్టింపు అవుతుంది.
ఈ విశిష్టమైన రోజున శివాలయాలను సందర్శించండి. శివునితో పాటు పార్వతీ దేవిని, వినాయకుడిని పూజించండి. నందికి పూజలు చేయండి. సాత్విక ఆహారాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించండి. శివునికి హారతి ఇవ్వండి.
పురాణాల ప్రకారం, వారంలోని ఏడు రోజులలోని ప్రదోష వ్రతం జరిగే రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రదోష వ్రతం జరుపుకోవడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుంది. పిల్లలకు పార్వతీపరమేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుంది.
సంబంధిత కథనం