Lotus flower: దీపావళి లక్ష్మీపూజలో తామర పువ్వు సమర్పించడం వల్ల మీ ఇంట ఐశ్వర్యం నిలుస్తుంది
Lotus flower: దీపావళి రోజు లక్ష్మీపూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం ప్రదోష కాలంలో పూజ నిర్వహిస్తారు. పూజలో అమ్మవారికి ప్రీతికరమైన తామర పువ్వు సమర్పించడం వల్ల భక్తుల కోరికలు తీరి ఇంట ఐశ్వర్యం నిలుస్తుందని నమ్మకం.
దీపావళి పండుగ సంబరాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. చిన్నారులు టపాసులు కాల్చుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. అందరూ ఎంతగానో ఎదురుచూసే అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. అక్టోబర్ 31 ఈ పండుగ జరుపుకోబోతున్నారు.

దీపావళి సందర్భంగా తమ సన్నిహితులకు, ప్రియమైన వారికి బహుమతులు ఇస్తారు. దీపాలతో ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. దీపావళి నాడు చేసే లక్ష్మీపూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పూజలో మీరు తప్పనిసరిగా సమర్పించాల్సిన వస్తువు ఒకటి ఉంది. అది మరేదో కాదు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వు. అష్టకమలంగా పేరు పొందిన తామర పువ్వు పూజలో ఉంచితే మీ కోరికలన్నీ నెరవేరతాయి.
హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తామర పువ్వులో నుంచి ఉద్భవించింది. అందుకే అమ్మవారికి లక్ష్మీపూజ సమయంలో ఎనిమిది తామర పువ్వులు సమర్పిస్తారు. ఒకవేళ ఇవి అందుబాటులో లేని పక్షంలో భక్తులు బెల్లం సమర్పించవచ్చు. పూజ సమయంలో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు లక్ష్మీదేవికి సంబంధించిన ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి.
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్
ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమః॥
లక్ష్మీ బీజ్ మంత్రం ప్రాముఖ్యత
లక్ష్మీ బీజ్ మంత్రం సంపద కొరతను తొలగించగలిగే అత్యంత శక్తివంతమైన మంత్రం. ఎనిమిది తామర పూలను సమర్పించి మహాలక్ష్మీ దేవి ముందు కూర్చుని ఈ లక్ష్మీ బీజ్ మంత్రాన్ని జపించండి. మీ అప్పుల బాధల నుంచి విముక్తి పొందగలుగుతారు. అలాగే ఈ మంత్రం పఠించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును స్వాగతించడంలో కూడా సహాయపడుతుంది.
తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారు?
తామర ఆధ్యాత్మిక ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. సంపద, శ్రేయస్సును అందించే దేవతకు ఈ పూలు సమర్పించడం వల్ల అమ్మవారు అనుగ్రహించి భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తారు. ఈ పువ్వు స్వచ్చతను సూచిస్తుంది. బురదలో పెరిగినప్పటికీ దాని మురికి మాత్రం దీనికి అంటుకోదు. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు నిజమైన భక్తులకు ప్రాపంచిక మలినాలు ఎలాంటి ప్రభావితం చూపించలేవని ఇది సూచిస్తుంది.
తామర పువ్వు పవిత్రత, స్వచ్చత, దైవత్వం, ప్రేరణకు చిహ్నంగా భావిస్తారు. ఈ పూలతో అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఆ ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది. ఇవి మాత్రమే కాకుండా పూజలో దక్షిణావర్తి శంఖం కూడా పెట్టవచ్చు. దీన్ని పూజించడం వల్ల సిరిసంపదలు, అష్టైశ్వర్యాలకు లోటు ఉండదు. అలాగే అమ్మవారికి కొత్తిమీర సమర్పించడం లేదా కొత్తిమీర గింజలను చాలా మంది పూజలో ఉంచుతారు. ఇవి ఇంటికి ఆనందాన్ని ఇస్తాయి. ఇవి మాత్రమే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ వంటి ఎరుపు రంగు పువ్వులు సమర్పించి పూజ చేయవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.