Kartika masam 2024: పరమ పవిత్రం కార్తీకమాసం- దీని విశిష్టత, ఈ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి?
Kartika masam 2024: హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం కార్తీకం. నవంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ మాసం విశిష్టత ఏంటి? ఇది ఎందుకు అంత పవిత్రమైనదిగా భావిస్తారు? ఈ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి అనే దాని గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసం విష్ణువు, శివుని ఆరాధనకు ప్రత్యేకమైనది. ఈ మాసంలో పవిత్ర స్నానాలు, దీపారాధనలు, ఉపవాసాలు, వ్రతాలు, సత్యనిష్ఠతో గడపడం అనేక పుణ్యాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలకు అనేక గుణాలు ఉంటాయని మన సనాతన సాంప్రదాయం చెబుతోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
కార్తీక మాస విశిష్టత
కార్తీకమాసంలో భగవంతుడిని పూజించడం ద్వారా, మానసిక ప్రశాంతతను పొందడం, ఆధ్యాత్మిక ఉద్దీపనను పొందడం అనేక మంది అనుభవిస్తున్నారు. శివునికి, విష్ణువుకు సంబంధించిన పురాణాల ప్రకారం ఈ మాసం శివుని దైవత్వానికి పునరుజ్జీవితమని భావిస్తారు. అందుకే ఈ మాసంలో శివుణ్ణి ఆరాధించడం ద్వారా పాప విమోచనమని విశ్వసిస్తారు. దీపారాధన ద్వారా చేసే కర్మలతో మన లోకంలోనే కాదు, పితృలోకానికి కూడా పవిత్రత అందుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.
కార్తీక మాసంలో ప్రతిరోజూ గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం అనేక పుణ్యాలను ఇస్తుంది. అలాగే దీపారాధన ద్వారా వ్రతాలు చేయడం వలన పాప విముక్తి పొందవచ్చు. ఉదయాన్నే నదుల్లో స్నానం చేసి, దేవాలయాలలో శివుని, విష్ణువుని పూజించడం ద్వారా కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో దీపం వెలిగించడం అనేది భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు సాధించడానికి పూర్వీకులు చేసిన ముఖ్య పద్ధతి అని చిలకమర్తి తెలియజేశారు.
కార్తీక మాసం పుణ్య కాలముగా పరిగణించబడుతుంది. అందుకే ఈ మాసం రోజుల్లో ఉదయాన్నే నదుల్లో లేదా శుద్ధ జలంతో స్నానం చేయడం ముఖ్యమైన ఆచారంగా ఉంది. ఈ కార్తీక స్నానం ద్వారా పాప విముక్తి పొందవచ్చని పురాణాలు చెబుతాయి. స్నానం చేసిన తరువాత దానం చేయడం ఈ మాసం లో విశేష ఫలితాన్ని ఇస్తుంది.
కార్తీక స్నానం
ఈ మాసంలో ప్రత్యేకంగా గోదావరి, కృష్ణ, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ స్నానాలు పాపాలను తొలగిస్తాయని, మనస్సును పవిత్రతో నింపుతాయని పురాణాలు చెబుతున్నాయి. కనుక కార్తీక మాసంలో చేసే స్నానం శరీరం, మనస్సు, ఆత్మలు పవిత్రమవుతాయని పెద్దలు చెబుతారు.
దానం
కార్తీక మాసంలో చేసిన దానాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా అన్నదానం, వస్త్ర దానం, దీప దానం చేయడం వల్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. ఈ మాసంలో గో దానం, గాజుల పంపిణి చేయడం, బ్రాహ్మణులకు దానం చేయడం విశేష పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి.
కార్తీక సోమవారం విశిష్టత
కార్తీక సోమవారాలలో ఉపవాసం చేయడం చాలా గొప్ప పద్ధతి. శివుడికి ప్రీతికరమైన ఈ వ్రతం ద్వారా శివ కృపను పొందవచ్చు. ఉపవాసం వ్రతం శరీర శుద్ధికి, మనస్సు శుద్ధికి తోడ్పడుతుంది. సోమవారంలో ఉపవాసం చేసి, సాయంత్రం శివాలయంలో పూజ చేయడం శివుని అనుగ్రహాన్ని పొందేందుకు మంచి పద్ధతిగా పరిగణించబడింది.
కార్తీక సోమవారాలలో శివలింగానికి అభిషేకాలు చేయడం, బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా శివుడి అనుగ్రహం పొందవచ్చు. సోమవారపు రోజు సాయంకాలం దీపారాధన చేయడం ద్వారా శివుని కృప సులభంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి చిలకమర్తి తెలియజేశారు. కార్తీక మాసం పాపాలు నశింప చేసుకోడానికి, పుణ్యాన్ని సంపాదించడానికి , భక్తిని పెంపొందిచుకోడానికి, భక్తి ద్వార ముక్తి మార్గాన్ని పొందుటకు ఉత్తమమైన మాసము అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.