Karthika masam festivals: నేటి నుంచి కార్తీకమాసం ఆరంభం- ఈ నెలలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత ఏంటి?
Karthika masam festivals: నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది. ఈ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో వచ్చే పండుగలు ఏంటి? ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.
కార్తీక మాసం పాపాలు నశింప చేసుకోడానికి, పుణ్యాన్నిసంపాదించడానికి , భక్తిని పెంపొందిచుకోడానికి ఉత్తమైనదని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.
ఈ నెలలో ప్రతి రోజూ దేవుడిని పూజించడం, స్నానాలు చేయడం, దీపారాధనలు చేయడం ముఖ్యమైన కర్మలుగా ఉంటాయి. కార్తీక మాసం మొత్తం భక్తి, పూజలతో నిండిన మాసంగా ఉంటుంది. అనేక తెలుగు పండగలను కూడా జరుపుకుంటారు. ఈ పండగలు హిందూ ధార్మిక సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. కార్తీకమాసం పరమశివుడికి, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన కాలమని ఈ నెలలో పూజలు చేయడం భక్తులకు ఎంతో శ్రేయస్కరంగా చెప్తారు.
భగినీ హస్త భోజనం
భాతృ ద్వితీయ దీనినే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని అంటారు. ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరక లోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటుందని శాస్త్రవచనం చెబుతోందని చిలకమర్తి తెలిపారు.
నాగుల చవితి
కార్తీక మాసంలో వచ్చే ప్రధాన పండగల్లో నాగుల చవితి ఒకటి. ఈ పండుగను కార్తీక శుద్ధ చవితి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నాగ దేవతలను పూజించడం ద్వారా సర్ప భయాలు తొలగుతాయని, సుఖ సంతోషాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రైతులు తమ పంటలను రక్షించేందుకు నాగ దేవతలను పూజిస్తారు. ఈ పండగను ఎంతో భక్తితో జరుపుకుంటారు, పాలు, పళ్ళు, పూజ సామగ్రిని నాగ దేవతలకు సమర్పిస్తారని చిలకమర్తి తెలియజేశారు.
ఏకాదశి వ్రతం
కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి “ఉత్తాన ఏకాదశి” చాలా విశిష్టమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణు పూజ చేస్తారు. ఈ ఏకాదశి రోజు సాయంకాలం దీపాలను వెలిగించి విష్ణు పూజ చేస్తే అనేక పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తాన ఏకాదశి ద్వారా చిత్తశుద్ధి కలుగుతుందని, శ్రీవిష్ణువు కృపతో మంచి ఫలితాలు పొందవచ్చని భక్తుల నమ్మకం.
తులసి వివాహం
కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండగల్లో తులసి వివాహం ఒకటి. ఈ పండుగను కార్తీక శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున తులసి మొక్కకు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న శాలగ్రాముడికి వివాహం చేస్తారు. ఈ వివాహం ద్వారా సంతాన భాగ్యం కలుగుతుందని, కుటుంబ సౌభాగ్యం ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్కను ఆరాధించడం వలన ఆరోగ్యం, క్షేమం, సంపద లభిస్తాయని నమ్ముతారు.
క్షీరాబ్ది ద్వాదశి వ్రతం
క్షీరాబ్ది ద్వాదశి అంటే పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రీమహా విష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈరోజే. ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీకి సమానురాలైన తులసిని పూజించవలెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.
కార్తీక పౌర్ణమి
కార్తీక పౌర్ణమి ఈ మాసంలో ముఖ్యమైన పౌర్ణమి. ఈ రోజున శివుని మరియు విష్ణువు పూజ చేయడం విశేషం. కార్తీక పౌర్ణమి రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి, పూజలు చేయడం ద్వారా అనేక పుణ్యాలు పొందవచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున దీపారాధన చేయడం ద్వారా పూర్వ జన్మ స్మృతుల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. గంగానదిలో స్నానం చేయలేని వారు ఈ రోజున తమ ప్రాంతంలోని ఏదైనా నదిలో స్నానం చేస్తే పవిత్రత పొందుతారని విశ్వసిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.