Karthika Masam: క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి ప్రాధాన్యత, విశిష్టత ఏమిటి?-karthika masam festivals ksheerabdi dwadashi significance rituals puja vidhanam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Karthika Masam Festivals Ksheerabdi Dwadashi Significance Rituals Puja Vidhanam

Karthika Masam: క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి ప్రాధాన్యత, విశిష్టత ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Nov 21, 2023 10:35 AM IST

Karthika masam: కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు.

karthika masam: క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ
karthika masam: క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ (pixabay)

కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఆ రోజున అవు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి, ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇస్తే ఆ అవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సుఖములు పొందుతారు.

ట్రెండింగ్ వార్తలు

ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు. క్షీరాబ్ధి ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునకు దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈకార్తీక శుద్ధ ద్వాదశినే 'ఉత్ధాన ద్వాదశి” అని అంటారు.

కృతయుగంలో దేవతలు,రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనాన్ని కార్తిక శుద్ధ ద్వాదశినాడు చేసిన రోజు కనుకనే “క్షీరాబ్ధి ద్వాదశి” అని పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక “చిలుక ద్వాదశి” అని, అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు కనుక 'మధన ద్వాదశి” అని వాడుకలో ఉంది.

మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో కలసి ఈ రోజే బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజును “బృందావని ద్వాదశి” అని అంటారు. బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము) జరిగి బృంద తులసి చెట్టుగాను, విష్ణువు సాలగ్రామం (శిల)గా ఒకరిని ఒకరు శపించుకున్నరోజు కనుక “బృంద ద్వాదశి” అంటారు.

క్షీరసాగర మధనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవ, దానవుల సమక్షంలో వివాహమాడుతాడు. చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తోందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ ద్వాదశి రోజున దీపదానం చేస్తే...

ఒక దీపాన్ని దానం చేస్తే 'ఉప పాతకములు" నశిస్తాయి. పది దీపాల్ని దానం చేస్తే 'మహా పాతకములు” నశిస్తాయి. వంద దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. వందకు పైగా దానం చేస్తే “స్వర్గాధిపత్యం” లభిస్తుంది. ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి. ఈ రోజు స్నానసంధ్యలు చేశాక కల్పోక్త ప్రకారం నానావిధ వేదమంత్రాలతో గానీ, పురుషసూక్తం చేతగానీ శ్రద్ధగా మహావిష్ణువును అర్చించాలి.

మొదట పంచామృత స్నానం గావించి, ఆ తర్వాత శుద్ధోదకములతో అభిషేకం చేసి శ్రీ మహావిష్ణువును స్వరంతో, వస్త్రాలతో అలంకరించి, నానా విధమైన పుష్పములతో, ధూపదీపాలతో పూజించి నైవేద్యం పెట్టి దక్షిణతాంబూలాదులు సమర్పిస్తే వారి సకల పాపాలు పోయి, సమస్త సంపదలు సమకూరుతాయి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసిపూజ, విష్ణువుతో తులసీ కల్యాణం చేస్తారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బృంద ద్వాదశి గురించి ఒక పురాణ కథ ఉంది

పూర్వము కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది. అమె పేరు “బృంద”. ఆమెను జలంధరుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్దానికి వెళ్ళాడు. దేవతలు అతన్ని జయించలేకపోయారు. అందుకు కారణం పతివ్రత అయిన బృందయే అని గ్రహిస్తారు. ఆ విషయం విష్ణువుకు తెలియజేస్తారు.

బృంద పాతివ్రత్యం చెడితేనేగాని జలంధరుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరకు వెళతాడు. వచ్చింది భర్తే అని భమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది. దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు. అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును శిలవు (రాయి) కమ్మని శపిస్తుంది. అయితే విష్ణువు తన భక్తురాలైన బృందను శాంతింపజేసి, ఆమెను అనుగ్రహిస్తాడు. ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలందుకుంటుందని వరమిస్తాడు. ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలందుకుంటోందని చిలకమర్తి తెలిపారు.

చిలుకు ద్వాదశి- తులసిపూజ

కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. గృహిణులు ఈరోజు క్షీరాబ్ధి శయన వ్రతమును ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. క్షీరాబ్ధి శయన వ్రతంలో తులసినీ, విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీ విష్ణువు పటాన్ని గానీ, విగ్రహాన్ని గానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. భారతీయ సంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యం ఉంది. దేవతార్చనకు తులసిదళం అతి శ్రేష్టం. తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. నువ్వుల్లో నూనెలాగ, పెరుగులో వెన్నలా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసిమొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది. తులసి సాక్షాత్తు లక్షీ దేవి అవతారం.

ఆకాశ దీపం

చిలుకు ద్వాదశి రోజు తులసి కోట వద్ద కర్రపాతి ఆకాశదీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతోంది. కార్తీక శుద్ధ ద్వాదశి శివునికి ఇష్టమైన సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతోనైనా, శనివారం రేవతి నక్షత్రంతోనైనా కలిసిరావడం మంచిదని అంటారు. సోమవారం ఉత్తరాభాద్రతో వచ్చిన కార్తీక ద్వాదశిని హరవాసరమని, శనివారం రేవతీనక్షత్రయుక్తమైతే హరివాసరమని అంటారు.

పరమార్ధికంగానే కాక మనిషి విధి విధానాల్లోనూ తులసికి మహత్తు ఉన్నదని భావిస్తారు. ఆరోగ్య దృష్ట్యా తులసి అత్యంత హితమైనది. ఈ మొక్క అతిపెద్ద మానుగా ఎదగదు. మూడడుగులు ఎదిగే చిన్న పొద. పరిమళాలను వెదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలు తొలగి దోమలతోపాటు క్రిమికీటకాలు నశిస్తాయి.

తులసి ఆకులు, గింజలు, వేళ్ళు, కొమ్మలు వైద్యపరంగా ఉపయుక్తమైనవే. రెండు కన్నా ఎక్కువ అకులు చేరి ఉన్న వాటిని తులసి దళాలు అంటారు. వాటిని నీటిలో ఉంచి తీర్ధంగానైనా, నేరుగానైనా వినియోగిస్తే శరీరంలోని జలుబు కారక రుగ్మతలు తొలగి చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది. వివిధ సాంక్రమిక వ్యాధులను తులసి వినియోగంతో నివారించవచ్చు. తులసి మొక్కనుంచి వచ్చే తావి వల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి. అందుకే తులసి మొక్కను పవిత్రమైందిగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోను తులసికోట నిర్మించడం ఆచారంగా వస్తోంది.

చిలుక ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు. స్మృతి కౌస్తుభం ప్రకారం కార్తీక ద్వాదశి మొదలు పౌర్టమి వరకు తులసి కల్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీ కృష్ణునికీ కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం.

తులసి కల్యాణానికి దేవదీపావళి అని పేరు. దీపావళి నాటిలాగ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటినిండా ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే.

తులసి దళం బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన కథ మరిచిపోలేనిది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel