ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటాము. దీపావళి పండుగను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆనందిస్తారు. దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది? కార్తీక మాసం తేదీ, ప్రారంభ తేదీ, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు మొదలైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసం 30 రోజులు కూడా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ 30 రోజుల పాటు ఏం చేయాలి? కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. కుదిరితే నది, చెరువు లేదా నూతి నీటితో స్నానం చేయడం మంచిది. ఒకవేళ అనారోగ్య సమస్య ఉండి వీలు కుదరకపోయినా పర్వదినాలప్పుడు నది స్నానం చేస్తే మంచిది.
రోజూ చెయ్యలేని వారు కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు, వచ్చే రెండు ఏకాదశులు, పౌర్ణమి నాడు కచ్చితంగా నదీ స్నానం చేసేటట్టు చూసుకోండి. కార్తీక మాసం అంతటా పరమేశ్వరుడిని ఆరాధించి 30 రోజులు కూడా చేయాలనుకునేవారు 30 రోజుల పాటు తలస్నానం చేయాలి. అదే విధంగా నూనె రాసుకోకూడదు. రోజూ దీపారాధన చేయాలి, దేవతార్చన చేసుకోవాలి. పురాణ పఠనం లేదా శ్రవణం చేస్తే మంచిది.
కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు. మహావిష్ణువుకి సమానమైన దైవం లేదు. వేదాలకు సమానమైన శాస్త్రం లేదు. గంగకు సమానమైన తీర్థం లేదు అని చెప్తారు. కార్తీక మాసంలో శివుడిని పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వదళ పూజలు, రుద్ర పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివన్నీ జరుపుతారు.
కార్తీక మాసంలో లక్ష పత్రి పూజ చేస్తే కూడా మంచిది. బిల్వపత్రాలతో శివుని ఆరాధించడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. శివుని ఆరాధించాలి. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసే పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది.
సాయంత్రం ఐదు తర్వాత చీకటి పడకముందు ప్రదోషకాలంలో శివుడిని ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. శివాలయంలో ప్రదోషకాలంలో పూజలు చేయడం వలన సకల దోషాలు కూడా తొలగిపోతాయి.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పలేనంత గొప్పది. కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానం చేసి, 365 వత్తులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. పారే నీటిలో దీపాలను వదిలిపెడితే సకల సంతోషాలు కలుగుతాయి, శివుని అనుగ్రహం లభిస్తుంది.
కార్తీక మాసం ప్రారంభ తేదీ: అక్టోబర్ 22
కార్తీక మాసం ముగింపు: నవంబర్ 20
కార్తీక పౌర్ణమి: నవంబర్ 5
పోలి పాడ్యమి: నవంబర్ 21
మొదటి సోమవారం: అక్టోబర్ 27
రెండవ సోమవారం: నవంబర్ 3
మూడవ సోమవారం: నవంబర్ 10
నాల్గవ సోమవారం: నవంబర్ 17