Kanwar yatra 2024: కన్వర్ యాత్ర అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఇందుకోసం పాటించాల్సిన నియమాలు ఏంటి?-kanwar yatra date and rules what is the significance of this yatra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanwar Yatra 2024: కన్వర్ యాత్ర అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఇందుకోసం పాటించాల్సిన నియమాలు ఏంటి?

Kanwar yatra 2024: కన్వర్ యాత్ర అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఇందుకోసం పాటించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jul 11, 2024 02:41 PM IST

Kanwar yatra 2024: మరికొద్ది రోజుల్లో కన్వర్ యాత్ర ప్రారంభం కాబోతుంది. అసలు ఈ కన్వర్ యాత్ర అంటే ఏంటి? ఎందుకు చేస్తారు. ఈ యాత్ర చేపట్టడం వల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం.

కన్వర్ యాత్ర అంటే ఏంటి?
కన్వర్ యాత్ర అంటే ఏంటి? (Unsplash)

Kanwar yatra 2024: పరమేశ్వరుడి భక్తులు సాగించే కన్వర్ యాత్ర త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 22 సోమవారం నుంచి ప్రారంభంఅవుతుంది. ఇదే రోజు కన్వర్ యాత్ర కూడా మొదలవుతుంది. దక్షిణాది వారితో పోలిస్తే తిథుల విషయంలో ఉత్తరాది వారికి తేడా ఉంటుంది.

ఉత్తరాది వైపు వారికి మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది. శివుడికి ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ మాసంలో శివుడికి గంగాజలాన్ని సమర్పించడం వల్ల ప్రసన్నుడు అవుతాడని నమ్ముతారు. శివ భక్తులు భగవంతుడి అనుగ్రహం పొందటం కోసం ఈ మాసంలో కన్వర్ యాత్రను నిర్వహిస్తారు. రాముడు, పరశురాముడు, రావణుడితో సహ ఎంతో మంది కన్వర్ యాత్ర చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

కన్వర్ యాత్ర అంటే ఏంటి?

ఈ యాత్రలో భక్తులు కావిడితో పుణ్యక్షేత్రాల నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తారు. కన్వర్ అనేది వెదురుతో చేసే ఒక కర్ర. దీనికి రెండు వైపులా కాడలు కడతారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులను కన్వరియాలు అంటారు. కన్వర్లను గంగా జలంతో నింపు తీసుకెళ్తారు.

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, గౌముఖ, గంగోత్రి వంటి ప్రాంతాల నుంచి గంగా జలాన్ని తీసుకువస్తారు. శివనామ స్మరణ చేసుకుంటూ కాలినడకన ఈ యాత్ర సాగిస్తారు. ఇలా కన్వర్ యాత్ర చేస్తే అన్ని కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. ఈ ఏడాది జులై 22 న ప్రారంభమై ఆగస్ట్ 3న ముగుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కన్వర్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు విధించారు.

కన్వర్ యాత్ర చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. కన్వర్ యాత్ర నాలుగు రకాలుగా ఉంటుంది. సాధారణ కన్వర్ యాత్రలో భక్తులు గమ్యస్థానానికి నడిచేటప్పుడు మార్గంలో విశ్రాంతి తీసుకోవచ్చు. డక్ కన్వర్ యాత్ర చేసే భక్తులు మాత్రం నది నుంచి నీటిని సేకరించి శివుడికి అభిషేకం చేసే వరకు నిరంతరం నడవాలి. యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి శివుడికి జలాభిషేకం చేసిన తర్వాతే ఈ యాత్ర ముగుస్తుంది.

దండి కన్వర్ యాత్ర మరొకటి. వీళ్ళు బం బం భోలే అనే నినాదం చేస్తూ భక్తుడు నమస్కరిస్తూ ప్రయాణించాలి. స్టాండింగ్ కన్వర్ లో అనేక మంది భక్తులు ఒకరికొకరు మద్దతుగా ఒక కన్వర్ ని తీసుకుని వెళతారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తారు. కావిడితో తీసుకొచ్చిన గంగా జలాన్ని శివలింగానికి సమర్పించడం వల్ల తమ కోరికలు తప్పకుండా నెరవేరతాయని భక్తుల విశ్వాసం.

కన్వర్ యాత్ర నియమాలు

కన్వర్ యాత్రలో పాల్గొనే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ సమయంలో మద్యం, గుట్కా, పొగాకు, సిగరెట్లు వంటివి తీసుకోకూడదు. భక్తి, విశ్వాసంతో దేవుడి మీద మనసు పెట్టి ఈ యాత్ర చేపట్టాలి. మనసులో కేవలం భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దాని నుంచి దృష్టి మరల్చకూడదు.

ఒకసారి కన్వర్ ను ఎత్తుకున్నప్పుడు దాన్ని పొరపాటున కూడా నేలపై ఉంచకూడదు. మీరు అలిసిపోయినప్పుడు కన్వర్ ను చెట్టు లేదా ఎత్తైన స్టాండ్ కి తగిలించుకోవాలి. కన్వర్ నేల తాకితే ఆ గంగాజలం వృధా అయిపోతుంది. మళ్ళీ మీరు గంగా జలాన్ని తీసుకురావాల్సి వస్తుంది. స్నానం చేసిన తర్వాత మాత్రమే కన్వర్ ను ముట్టుకోవాలి. ఈ యాత్రలో చెప్పులు లేకుండానే భక్తులు నడవాల్సి ఉంటుంది.

అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు గుండె జబ్బులు మొదలైనవి ఉన్న వాళ్ళు ఈ కన్వర్ యాత్రకు దూరంగా ఉండటం మంచిది. శారీరకంగా ధృడంగా ఉన్నవారు ఈ యాత్ర చేయగలుగుతారు. చెడు, ప్రతికూల ఆలోచనలు పొరపాటున కూడా మనసులోకి రాకూడదు. నిత్యం శివనామ స్మరణ చేస్తూ యాత్ర చేపట్టాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel