Kanuma: కనుమ పండుగ గొప్ప పండుగ - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ-kanuma festival greatness and what to do on this festival and check other details to follow on this day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanuma: కనుమ పండుగ గొప్ప పండుగ - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Kanuma: కనుమ పండుగ గొప్ప పండుగ - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk HT Telugu
Jan 15, 2025 09:49 AM IST

Kanuma: కనుమ నాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నివేదించిన తర్వాత పొలంలో చల్లుతారు. దీన్నే 'పొలి చల్లటం' అంటారు. దీనివల్ల తమ పంటలకు చీడపీడల బెడద ఉండదని రైతులు విశ్వసిస్తారు.

కనుమ సంబరాలు
కనుమ సంబరాలు (freepik)

సంక్రాంతి మూడోరోజు కనుమ. సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపు కుంటారు. అయితే , ఈ రోజున గోమాతలకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు.దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

yearly horoscope entry point

ఈ రోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అందంగా అలంకరించి హారతులిచ్చి పూజిస్తారు. అనంతరం పశు గణాన్ని తోలుకొని వెళ్లి గ్రామ దేవత ఆలయం చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఈ రోజు వాటిచేత ఏ పనీ చేయించరు. వాటికి మేలైన ఆహారాన్ని అందిస్తారు. ఈ ప్రకృతిలో మనతో బాటు జీవించే పశు పక్ష్యాదుల ఉనికిని గుర్తించి గౌరవించటమే కనుమ పండుగ ఉద్దేశం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పశువుల పండుగ అంటారు. మనది వ్యవసాయిక దేశం గనుక మన జీవనంలో పశువులూ ఒక భాగం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా, పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగానూ, కనుమ రోజు మినప వంటకాలు తినాలని పెద్దలు చెబుతారు. అందుకే అందరూ ఈ రోజు గారెలు తింటారు. కనుమనాడు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాలు(పతంగులు) ఎగరవేస్తారు. ఆకాశంలో రివ్వున పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలూ సమున్నతంగా ఉండాలనే సందేశం ఇందులో ఉంది. గోవును మాతృ స్వరూపంగా, సర్వ దేవతా సమూహానికి చిహ్నంగానూ భావిస్తారు.

ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో సాయపడిన ఎడ్లు, ఇంటిల్లిపాదికీ కావాల్సిన పాడిని అందించి చక్కని ఆరోగ్యాన్ని సమకూర్చిన ఆవులకు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే కనుమ. ద్వాపరయుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను, గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి కృష్ణుడు చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉందని అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కనుమ నాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నివేదించిన తర్వాత పొలంలో చల్లుతారు. దీన్నే 'పొలి చల్లటం' అంటారు. దీనివల్ల తమ పంటలకు చీడపీడల బెడద ఉండదని రైతులు విశ్వసిస్తారు.

కనుమ నాడు పక్షులనూ రైతులు ఆదరిస్తారు. ఇందులో భాగంగా పక్షుల కోసం జొన్న కంకులూ, వరి కంకులూ తెచ్చి గుమ్మాలు, కిటికీలు, వసారాలో వేళ్ళాడగడతారు. ధనుర్మాసం అంతా వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేస్తారు. విష్ణువు చేత పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి సంక్రాంతి మూడురోజులూ భూలోకానికి వచ్చి, కనుమనాడు తిరిగి వెళతాడనీ, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ రథం ముగ్గు వేస్తారని పెద్దలు చెబుతారు.

అలాగే శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఆయన నివసించే వైకు౦ఠ వాకిలికి ఈ ముగ్గు ప్రతీక అనీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పండుగ రోజు పెట్టిన బొమ్మల కొలువును కనుమనాడు తీస్తారు. దీన్నే 'బొమ్మల కొలువు ఎత్తటం' అంటారు పేరంటాలను పిలించి బొమ్మలకు హారతి పట్టి, కొలువులో పెట్టిన ఏదైనా ఒక్క బొమ్మను ఉన్నచోటు నుంచి కదిలిస్తారు.

తర్వాత వీలును బట్టి ఎప్పుడైనా బొమ్మలను తీసుకుంటారు.కనుమ నాడు నువ్వులు, బెల్లం పంచి శని దేవుని శుభ దృష్టి, శనగ గుగ్గిళ్ళు లేదా నానబెట్టిన శనగలు పంచిపెడితే (దానము) ద్వారా గురు గ్రహం ఆశీస్సులు లభిస్తాయి. పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్ళు, ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ రోజు కాకి కూడ కదలదని చెబుతారు.

కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని... గోధుమపిండి , బెల్లం , ఓ చెంచా పాలతో 5 గాని , 7 గాని , 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే , ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి.

రొట్టెలను తయారు చేసిన తర్వాత...గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner