కామిక ఏకాదశి తేదీ, పూజా విధానం.. వ్రత ఆచరణ వల్ల ఫలితం తెలుసుకోండి-kamika ekadashi 2023 know the date puja vidhi significance and results of vratam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కామిక ఏకాదశి తేదీ, పూజా విధానం.. వ్రత ఆచరణ వల్ల ఫలితం తెలుసుకోండి

కామిక ఏకాదశి తేదీ, పూజా విధానం.. వ్రత ఆచరణ వల్ల ఫలితం తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Jul 12, 2023 05:51 PM IST

కామిక ఏకాదశి తేదీ, పూజా విధానం.. వ్రత ఆచరణ వల్ల ఫలితం ఇక్కడ తెలుసుకోండి. ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇక్కడ చదవండి.

మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన తరువాత వచ్చిన మొదటి ఏకాదశి కామిక ఏకాదశి
మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన తరువాత వచ్చిన మొదటి ఏకాదశి కామిక ఏకాదశి (pixahive)

కామిక ఏకాదశి 2023: హిందూమతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి. ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రద్ధగా పూజ చేస్తే పోయిన స్థితి తిరిగి మిమ్మల్ని వరిస్తుంది. అంతకుమించిన ఉన్నతమైన స్థితికి మీరు చేరుతారు.

చాతుర్మాసాలలో వచ్చే ఈ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి అని ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. కామిక ఏకాదశి విశిష్టత గురించి మహా భారతంలో శ్రీకృష్ణుడు ధర్మ రాజుకు స్వయంగా చెప్పిన విషయాలను ఆయన వివరించారు. కామిక ఏకాదశి కోరికలు నెరవేరే ఏకాదశి అని, చాతుర్మాసాలలో వచ్చిన ఈ కామిక ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే పితృదేవతలు, పూర్వీకులు ఆనందిస్తారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మానవులు దేవతల అనుగ్రహం పొందడం ఎంత ముఖ్యమో పూర్వీకులు, పితృదేవతల అనుగ్రహం పొందడం కూడా అంతే అవసరమని చిలకమర్తి తెలిపారు.

కామిక ఏకాదశి రోజున మహావిష్ణువును ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల పితృదేవతలు, పూర్వీకులు ఆనందించి ధర్మబద్ధమైన మన కోరికలు తీర్చి మనల్ని అనుగ్రహిస్తారని ఏకాదశి వ్రతమహత్యం తెలిపింది.

ఏకాదశి తిధి ప్రతి నెలా రెండుసార్లు వస్తుంది.ఒకసారి కృష్ణపక్షంలో, మరోసారి శుక్లపక్షంలో వస్తుంది. ఇలా సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. రేపు జులై 13న వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ కామిక ఏకాదశి పూజా విధానం శుభ ముహూర్తం, కావాల్సిన పదార్థాల జాబితా తెలుసుకుందాం.

కామిక ఏకాదశి శుభ ముహూర్తం

ఏకాదశి జులై 12, 2023 సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏకాదశి తిధి జూలై 13, 2023 సాయంత్రం 6:24 గంటలకు పూర్తవుతుంది. జూలై 14 ఉదయం 5:32 నుంచి ఉదయం 8:10 మధ్యలో ఉపవాస దీక్ష విరమించాల్సి ఉంటుంది.

కామిక ఏకాదశి పూజా విధానం

కామిక ఏకాదశి ముందు రోజు రాత్రి కేవలం అల్పాహారాన్ని స్వీకరించాలి. ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటిని శుభ్రపరచుకొని మావిడి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. తలస్నానం ఆచరించాలి. ఇంటియందు తూర్పు ఉత్తర లేదా ఈశాన్య భాగంలో మహా విష్ణువును స్థాపన చేసి ఆరోజు విష్ణుమూర్తిని షోడసోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. గంగాజలాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తికి పుష్పాలు, తులసిదళాల సమర్పించాలి. శ్రీ మహావిష్ణువుకు అర్చించే నైవేద్యంలో తులసీ దళాలను చేర్చాలి. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఉపవాసం చేయాలి. ఉపవాస నియమాలు పాటిస్తూ భగవంతుడిని ఆరాధించాలి. కామిక ఏకాదశి రోజు గంధం, పసుపు, సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వాలి. ఇలాంటి వస్తువులను దానం ఇవ్వడం వల్ల విశేషమైన పుణ్య ఫలం కలుగుతుంది.

ఈరోజు అష్టాదశ పురాణాలు గానీ, రామాయణ, మహాభారతాలు గానీ చదువడం, వినడం చాలా విశేషం. ఇది కుదరని పక్షంలో విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం, భగవద్గీత చదవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.

ఏకాదశి రోజున చేయకూడనివి

ఏకాదశి రోజున వెల్లుల్లి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం పాటిస్తూ ఆహారం గురించి ఆలోచన చేయకూడదు. దానధర్మాలు చేయాలి. చెడు వినరాదు. చెడుచూడరాదు. చెడు మాట్లాడరాదు.

ఏకాదశి పూజ సామగ్రి

పుష్పాలు, పండ్లు, లవంగము, వక్కలు, టెంకాయ, ధూపము, దీపము, నెయ్యి, వత్తులు, నైవేద్యం, తులసీ దళాలు.