తొలి ఏకాదశి నుండే పండగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ప్రతి పండుగ వస్తుంది. తొలి ఏకాదశి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
ప్రతి నెలలో ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. తొలి ఏకాదశి నుంచి తెలుగు పండుగలు అన్నీ మొదలవుతాయి కనుక ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, జాగరణ చేయడం కూడా మంచిదే. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు.
ఈసారి తొలి ఏకాదశి జూలై 6న వచ్చింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రిస్తారు. ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు తిరిగి మేలుకొంటారు. విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు నిద్రిస్తారు.
ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలు అని అంటారు. తొలి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షను మొదలుపెడతారు.ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి నుండి దక్షిణం వైపుకు వాలుతున్నట్లు కనబడతాడు. ఆ తర్వాత సూర్యుడు దక్షిణం వైపుకు వెళ్ళినట్లు కనబడడం మనకు దక్షిణాయనాన్ని సూచిస్తుంది.
ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఉపవాసం తర్వాత తినే ఆహారం సాత్వికంగా, సులభంగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి. అందుకే పేలాల పిండిని తింటారు. పైగా పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టం. పేలాల పిండిని తినడం వలన పూర్వికులను స్మరించుకున్నట్లు అవుతుందని కూడా అంటారు. అంతేకాకుండా పేలాల పిండిని పితృదేవతల పేరు చెప్పి దానం కూడా ఇస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.