Jaya Ekadashi: ఈరోజే భీష్మ ఏకాదశి.. ఈరోజు ఏం చేయాలి? మంచివాడైన భీష్ముడు ఎందుకు పాండవుల పక్షాన నిలబడలేదు?
Jaya Ekadashi: ఈసారి ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి పండుగను జరుపుకోవాలి. ఈరోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే భీష్ముడు ఎందుకు కౌరవ తరపున నిలబడ్డాడు అనేది కూడా తెలుసుకుందాము.

ప్రతీ సంవత్సరం మాఘ మాసం శుద్ధ ఏకాదశి నాడు భీష్మ ఏకాదశిని జరుపుకుంటాము. ఈసారి ఫిబ్రవరి 7న రాత్రి 9:26 గంటలకు మొదలవుతుంది. ఫిబ్రవరి 8న రాత్రి 8:15 తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం, ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి పండుగను జరుపుకోవాలి.
భీష్మ ఏకాదశి నాడు విష్ణు అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి
- భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాదిస్తే మంచిది.
- ఉపవాసం ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.
- శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఒక ఏకాదశిని భీష్ముడికి ఇచ్చారు. ఈ ఏకాదశి నాడు భీష్ముడుని తలుచుకున్నా, భీష్ముడికి తర్పణాలు వదిలినా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
- ఈరోజు శ్రీహరి విగ్రహానికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా విగ్రహానికి మీరు చక్కగా అభిషేకం చేసినట్లయితే ఎంతో మంచి ఫలితం దక్కుతుంది. అభిషేకానికి పాలు, నీళ్లు, పంచామృతాలలో ఏదైనా ఉపయోగించవచ్చు.
- భీష్మ ఏకాదశి నాడు వీలైతే పిండి దీపాలని కూడా పెట్టొచ్చు.
- ఈరోజు విష్ణుసహస్రనామాలను చదివినా, విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.
- భీష్మ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి దళాలని సమర్పిస్తే కూడా మంచిది.
- ఈరోజు 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తే మంచిది. లేదంటే 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు.
- పితృ దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండడానికి, సంతానం కలగడానికి భీష్మ పితామహున్ని తలుచుకుంటే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. సంతన భాగ్యం కలుగుతుంది.
భీష్ముడు కౌరవుల పక్షాన ఎందుకు యుద్ధం చేశాడు?
మంచివాడైన భీష్ముడు ఎందుకు పాండవులు తరపున పోరాడకుండా కౌరవుల వైపు యుద్ధం చేశాడు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అంపశయ్యపై ఉన్నప్పుడుఈ ప్రశ్నకు సమాధానం భీష్ముడు చెప్పాడు. తాను కౌరవులతో జీవించి.. వారి ఉప్పు తిన్నందున, రుణం తీర్చుకోవాలని ఇలా కౌరవుల పక్షాన నిలబడ్డానని వివరించాడు.
ఆ సమయంలో కొన్ని తప్పులు కనపడినా కూడా ఏమీ చేయలేకపోయానని, అందుకు పాప పరిహారం ఈ అంపశయ్య అని చెప్పాడు. దక్షిణాయణంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసి ఉత్తరాయణం వచ్చే దాకా భీష్ముడు కన్నుమూయలేదు. రథసప్తమి తర్వాత వచ్చే అష్టమి నాడు తుది శ్వాసని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.