అద్వైత వేదాంతాన్ని ఉపనిషత్తులలోని విషయాల ఆధారంగా నిరూపించడం జగద్గురు శంకరాచార్యుల వారి అన్ని రచనలలో ముఖ్యంగా కనబడుతుందని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు. స్వానుభవానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన రచనలలో తర్కానికి పెద్దపీట వేసినట్టు ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
శంకరాచార్యుల వారి రచనలను మూడు విధాలుగా.. ఎ)భాష్యాలు, బి) ప్రకరణ గ్రంథాలు, సి) స్తోత్రాలుగా ప్రధానంగా విభజించవచ్చన్నారు.
అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవిగా వేదాంత పురాణేతిహాసాలను వివరించే గ్రంథాలను శంకరాచార్యులవారు రచించారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
1. బ్రహ్మసూత్రాలకు శంకరులవారు వ్రాసినదే మనకు లభించే తొలి భాష్యమని ప్రభాకర చక్రవర్తిశర్మ అన్నారు. ఆయన దీనితోపాటు ద్రవిడ, భర్తృప్రపంచ వంటి భాష్యాలను పేర్కొన్నారన్నారు.
2. ఐతరేయోపనిషత్తు (ఋగ్వేదము)
3. బృహదారణ్యకోపనిషత్తు (శుక్ల యజుర్వేదము)
4. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావస్యోపనిషత్తు శుక్లయజుర్వేదము)
5.తైత్తరీయోపనిషత్తు (యజుర్వేదము)
6. ఛాందోగ్యోపనిషత్తు (అధర్వణవేదము) మాండూక్యోపనిషత్తు (అధర్వణవేదము)
7. గౌడపాదకారిక, ముండకోపనిషత్తు (అధర్వణవేదము)
8. ప్రశ్నోపనిషత్తు (అధర్వణవేదము)లకు భాష్యాలు రచించారని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అంతే కాకుండా భగవద్గీత, విష్ణుసహస్రనామ స్తోత్రం, గాయత్రి మంత్రము విరచించారన్నారు.
ప్రకరణ గ్రంథాలు అంటే తత్వ, వేదాంత వివరణలు అని ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఇవి గురువు శిష్యులకు వివరించి చెప్పేవిగా ఉంటాయన్నారు. ‘వివేక చూడామణి’, ‘ఉపదేశ సహస్రి’, ‘శత శ్లోకి’, ‘దశ శ్లోకి’, ‘పంచశ్లోకి’, ‘ఏక శ్లోకి’, ‘ఆత్మబోధ’, ‘అపరోక్షానుభూతి’, ‘సాధనాపంచకము’, ‘నిర్వాణ శతకము’, ‘మనీషా పంచకము’, ‘యతి పంచకము’, ‘వాక్యసుధ’, ‘తత్వబోధ’, ‘సిద్ధాంత తత్వవిందు’, ‘వాక్యవృత్తి’, ‘నిర్గుణ మానస పూజ’ శంకరాచార్యులవారు మనకు అందించిన ప్రకరణ గ్రంథాలని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భక్తి, లయ, కవితా సౌరభాలతో కూడుకున్నవి శంకరాచార్యుల వారి స్తోత్రాలని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శంకరాచార్యుల వారు ‘గురుస్తోత్రం’ ప్రారంభంలో చెప్పిన ‘గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ శ్లోకం విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. ‘
శివ పంచాక్షరీ స్తోత్రం’, ‘ప్రస్థానత్రయం’, ‘పాండురంగాష్టకం’, ‘వివేక చూడామణి’, ‘శివానందలహరి’, ‘మనీషా పంచకము’, ‘సౌందర్యలహరి’, ‘మీనాక్షీ పంచరరత్న స్తోత్రం’, ‘ఆనంద లహరి’, ‘గణేశ పంచరత్న స్తోత్రం’, ‘లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం’, ‘భజగోవిందం’, ‘కనకధారా స్తోత్రం’, ‘సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం’, ‘గంగా స్తోత్రం’, ‘శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం’ చాలా ప్రసిద్ధమైనవని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.