శివుడు లింగరూపధారిగా ఆవిర్భవించడానికి సంబంధించిన కథను శివపురాణం పేర్కొన్నది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంభాషించుకుంటున్నారు. శివుని మాయకు ప్రభావితులైన బ్రహ్మ విష్ణువులు తమలో అధికులు ఎవరు? అన్న విషయం మీద చర్చకు దిగారు. ఎవరికి వారు తామే అధికులమని వాదించుకోసాగారు తుదకు అది యుద్ధానికి దారి తీసింది.
బ్రహ్మ పాశుపతంతోను, విష్ణువు మహేశ్వరం తోను తలపడసాగారు. ఆ ఆయుధాల తేజస్సు చేత సమస్త దిక్కులు జ్వలితమవసాగాయి. మహర్షులు, దేవతలు భయపడి శివుడిని ప్రార్థించారు. శివుడు వారికి అభయ మిచ్చి, జ్యోతిర్లింగ స్వరూపమున ఓంకార నాదం సలుపుచు బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించాడు.
ఆ జ్యోతిర్లింగమును చూచి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జ్యోతిర్లింగ మునకు ఆది ఏదో, అంతము ఏదో వారికి అర్థంగాలేదు. జ్యోతిర్లింగము ఆది, అంతము కనుగొన్న వారే అధికులు అని ఒక ఒడంబడికకు వచ్చారు. బ్రహ్మదేవుడు లింగము ఉపరి భాగాన్ని, విష్ణువు లింగము అడుగు భాగాన్ని కనుగొనునట్లు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా బ్రహ్మ హంస రూపం దాల్చి మింటికెగసి రివ్వున పయనించ సాగాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని బలంగా తొలుచుకుంటూ
అధోముఖంగా వెళ్లసాగాడు. ఇలా నూర దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా వారు ఆద్యంతాలను కనుగొనలేక పోయారు. ఇద్దరూ కలిసి జ్యోతిర్లింగ మూర్తిని ప్రార్ధించసాగారు. పరమేశ్వరా! వందనములు. రూపమేలేని నిన్ను ఏ రూపమున మనసారా ధ్యానించాలి. ఏమని స్తుతించాలి. దేవా! మీ నిజ స్వరూపాన్ని వెంటనే ప్రదర్శించండి. శివుడు వారి ప్రార్థనలకు ప్రసన్నుడై ప్రత్యక్షమై దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు. బ్రహ్మ విష్ణువులు జ్యోతిర్లింగమునకు షోడశోపచార పూజలు చేశారు.
అధర్వ శీర్షిపనిషన్మంత్రముల చేత అభిషేకించారు. రుద్రాధ్యా యనము పఠించారు. ధూపదీప నైవేద్యాలను, ఆనంద నీరాజ నాలను ఆర్పించి, ఆత్మప్రదక్షిణ నమస్కారాలను ఆచరించారు. శివుడు అల్పసంతోషి, తెలిసిగాని, తెలియకగాని తనక పూజలు, అభిషేకాలు స్వల్పమామ్రుగానైనా చేస్తే ప్రసన్నుడై కరుణిస్తాడు.
గుణనిధి లాంటి వాళ్లు కావాలని ఉపవాసం ఉండకపోయినా, ఆహారం దొరకక ఉపవాసం చేసినా, శివాలయంలో భక్తితో కాకపోయినా వెలుతురు కోసం దీపాన్ని వెలిగించినా, దక్కిన ఆ పుణ్యఫలంతోనే శివుడి అనుగ్రహానికి పాత్రుడైనాడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.