దీపావళికి ముందు ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈరోజు బంగారం, వెండి, ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. కొత్త వస్తువులు ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని నమ్ముతారు.
అసలు ధన త్రయోదశి అంటే ఏంటి? దీని వెనుక ఉన్న కథ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ పండుగ జరుపుకోవడం వెనుక అనేక ఆసక్తికరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం జరిగిన సమయంలో ధన్వంతరి దేవుడు, లక్ష్మీదేవి ఉద్భవించారని అంటారు. ధన్వంతరి దేవుడు చేతిలో కలశంతో ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా అమృతం కుండను తీసుకువచ్చాడని దేవతలు అందరూ ధన్వంతరిని గౌరవించారు. ధన త్రయోదశి జరుపుకోవడం వెనుక మరొక కథ కూడా ఉంది.
రాజు హిమవంతుడికి పదహారేళ్ల కుమారుడు ఉన్నాడు. జాతకం ప్రకారం అతడికి వివాహం జరిగిన నాలుగో రోజు పాముకాటుతో చనిపోతాడు. విషయం తెలుసుకున్న వధువు భర్తను రక్షించుకోవడం కోసం తెలివైన ప్రణాళిక ఒకటి వేసింది. వాళ్ళు పడుకునే పడకగది ప్రవేశ ద్వారం వద్ద బంగారం, వెండి నాణేలు ఉంచింది. దీపాలు వెలిగించింది. రాత్రి వేళ ఆమె భర్త నిద్రపోకుండా చేసేందుకు, యముడిని రాకుండా చేసేందుకు పాటలు పాడుతూ కథలు చెప్పింది. యముడు సర్ప వేషంలో వచ్చినప్పుడు దీపాలు, నగల తేజస్సు అతడి కళ్లలో పడింది.
యముడు నాణేల కుప్ప మీదకు ఎక్కి వధువు చెప్తున్న కథలకు, పాటలకు మంత్రముగ్ధుడు అవుతాడు. తెల్లవారే వరకు అక్కడే ఉండిపోయాడు. సూర్యుడు ఉదయించగానే యముడు అతడి ప్రాణాలు తీసుకోకుండానే వెనుదిరిగాడు. అలా యముడిని మాయ చేసి ఆమె తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. అందుకే ధన త్రయోదశి రోజు యముడికి దీపం కూడా వెలిగించే సంప్రదాయం వచ్చింది. ఈరోజు సాయంత్రం వేళ ప్రతి ఒక్కరూ యముడి కోసం దీపం వెలిగిస్తారు. తమ ప్రాణాలు తీసుకెళ్లవద్దని సంకేతంగా ఇలా చేస్తారు.
ఈరోజు చేసే ధన్వంతరి, యమ పూజ రెండూ మనిషిని దీర్ఘాయుష్హుతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పూజించే సంప్రదాయం ఉంది. అక్టోబర్ 29న త్రయోదశి తిథి ఉదయం 10. 59 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1.04 గంటలకు ముగుస్తుంది.
ధన త్రయోదశి రోజు ధన్వంతరి దేవుడిని కూడా పూజిస్తారు. ఆయుర్వేద పితామహుడు, దేవతల వైద్యుడిగా పూజిస్తారు. సముద్ర మథనం సమయంలో ఉద్భవించాడు. నాలుగు చేతులతో కలిపించాడు. అమృతం, వైద్య చికిత్స కోసం దైవిక మూలికలు, పవిత్ర గ్రంథాలు పట్టుకుని కనిపించాడు. దీపావళికి రెండు రోజుల ముందు ధన్వంతరి దేవుడిని పూజిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్