Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి రోజున ఈ రుద్రాక్షను ధరిస్తే, మీ సంతాన కోరిక నెరవేరుతుంది
Garbha Gauri Rudraksha: పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఈ కృష్ణ జన్మాష్టమి రోజున నిష్టతో పూజలు చేసి సంతానం కోరుకుంటే ఆ గోపాలుడు పుత్రుడిని ప్రసాదిస్తారని నమ్మకం.
Krishna Janmashtami 2024: దేశ వ్యాప్తంగా సోమవారం (ఆగస్టు 26)న కృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోబోతున్నారు. కొడుకు పుట్టాలని కోరుకునే దంపతులకు శ్రీకృష్ణ జన్మాష్టమి కంటే గొప్ప పండుగ మరొకటి ఉండదు. ఇది శ్రీకృష్ణుని జన్మదినోత్సవం కాబట్టి సంతానం కోరుకునే వారు.. మరీ ముఖ్యంగా పున్నామ నరకం నుంచి కాపాడే పుత్రుడు కావాలనుకునే వారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించి తమ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు.
వాస్తవానికి ఈరోజుల్లో తల్లిదండ్రుల దృష్టిలో కొడుకు, కూతురు అని ప్రత్యేకమైన తేడా ఏమీ లేదు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు కూడా గట్టి పోటీనిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే ప్రతి దంపతులు తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లి, కుటుంబానికి కీర్తి, ప్రతిష్టలు తెచ్చే కొడుకు కావాలని ఆశిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు జన్మనిచ్చినా కొడుకు లేరని బాధపడుతుంటారు.
పురాణాల ప్రకారం మోక్షాన్ని పొందడానికి, ఇతర సామాజిక బాధ్యతలను నెరవేర్చడం కోసం హిందూ మతంలో కొడుకు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కొంత మందికి తమ పూర్వ జన్మల కర్మ ఫలితాల కారణంగా పుత్ర సంతానం లేకపోవడం లేదా ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాంటి వారు ఈ జన్మాష్టమి పండుగ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణుడిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటే తమ కోరిక నెరవేరుతుందని భావిస్తుంటారు.
జన్మాష్టమి రోజున దంపతులు పూర్తి భక్తి, విశ్వాసంతో ఉపవాసం ఉండి శ్రీ కృష్ణ భగవానుడి 'లడ్డూ గోపాల్'ని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. ఆ గోపాలుడు అన్ని చింతలను తొలగించి పుత్రుడిని ప్రసాదిస్తాడని చాలా మంది దంపతులు విశ్వసిస్తుంటారు.
గర్భ గౌరీ రుద్రాక్ష
ప్రకృతి ప్రసాదించిన గర్భ గౌరీ రుద్రాక్షను ధరించి శ్రీ కృష్ణ భగవానుడిని ఆరాధిస్తే తప్పక సంతానం కలుగుతుంది. గర్భ గౌరీ రుద్రాక్ష సాధారణ రుద్రాక్ష కాదు. ఇది ప్రకృతి ప్రసాదితం, సంతాన ప్రాప్తిలో చాలా ప్రాముఖ్యత కలిగింది. జన్మాష్టమి రోజున ఈ రుద్రాక్షను ధరించి దంపతులు పూజ చేస్తే.. తాము కోరుకున్న బిడ్డకు జన్మనివ్వడం ఖాయం.