Ganga Dussehra: రేపే గంగా దసరా, ఈ నాలుగు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది
Ganga Dussehra: గంగా దసరా ఈరోజే, అంటే జూన్ 16వ తారీఖున. దీన్ని గంగానది పారే ప్రాంతాల్లో చాలా పవిత్రంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం వల్ల ఐశ్వర్యం కలిసివస్తుంది.
Ganga Dussehra: గంగానది జీవనది. ఆ నదిలో స్నానం చేయడం వల్ల ఎన్నో పాపాలు పోతాయని అంటారు. జూన్ 16న గంగా దసరా. ఈ రోజున గంగామాతను పూజించడంతోపాటు ఆ నదిలో స్నానం చేసి పునీతులుగా మారుతారు ఎంతోమంది. ప్రతీ ఏడాది జ్యేష్ట మాసంలోనే శుక్లపక్షం పదో రోజున ఈ గంగా దసరాను నిర్వహించుకుంటారు. గంగా దసరా రోజునే ఆ గంగాదేవి భూమిపైకి అడుగుపెట్టిందని నమ్ముతారు. గంగా దసరా రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చెబుతారు.
గంగా దసరా రోజున చీపురు కొనడం చాలా శుభప్రదం అని నమ్ముతారు. ఈరోజు చీపురు కొనడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది. సంపదలు చేకూరుతాయి. అలాగే కొత్త బట్టలు కొనడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కొత్త బట్టలు కొని వేసుకుంటే కొత్త శక్తి అందుతుందని చెబుతారు. వారి జీవితంలో ఆనందం వెల్లులివిరుస్తుందని అంటారు.
గంగా దసరా రోజున గంగాజలాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. లక్ష్మీదేవి నట్టింట్లో తాండవిస్తుందని చెబుతారు.
అలాగే గంగా దసరా రోజున ఆవులను పూజించడం ఎంతో మంచిది. అలాగే గవ్వలను కొని ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని మీ ఇంట్లో డబ్బు దాచే చోట పెట్టడం వల్ల సంతోషం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.
స్వర్గ లోకంలో మందాకినిగా ప్రవహించే ఈ గంగా నది భగీరథుని వల్ల భూమి పైకి వచ్చింది. అలా వస్తూ వస్తూ సగర కుమారులకు ముక్తి ప్రసాదించింది. భగీరధుడు వల్ల ఈ నేలపై అడుగు పెట్టింది. కాబట్టి భాగీరధిగా మారింది. భూమికి, ఆకాశానికి మధ్య శివుడు నిలవగా శివుడి జటాజూటం నుంచి నేల వైపుగా పరవళ్లు తొక్కుతూ అడుగు పెట్టింది గంగమ్మ.
మనదేశంలో కాశీ క్షేత్రంలో గంగానది పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. కాశీకి వెళ్లి గంగా నదిలో స్నానం చేయకుండా ఎవరూ రారు. అలాగే ఒక చెంబులో గంగా నీటిని తెచ్చుకుంటారు. గంగా నది వరకు వెళ్లి స్నానం చేయలేనివారు, ఇంట్లోనే ఆ గంగాదేవిని స్మరిస్తూ స్నానం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు.
గంగానదిని స్మరించేటప్పుడు...
నందిని నళిని సీతా మాలినీచ మహాపగా
విష్ణు పాదాబ్జ సంభూత గంగా
త్రిపదగామిని భాగీరధి
భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి
అని స్మరించుకోవాలి. స్వర్గంలోనే కాదు భూలోకం, పాతాళంలో కూడా ప్రవహిస్తున్న ఏకైక నదిగా గంగానది ప్రాచుర్యం పొందింది.