శివాలయాలను ఎలా దర్శించుకోవాలి? శివాలయాల్లో ఉండే శివలింగ ముఖాల పేర్లు ఏమిటి?
శివాలయాలను ఎలా దర్శించుకోవాలి? శివాలయాల్లో ఉండే శివలింగ ముఖాల పేర్లు ఏమిటో ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

శివాలయ దర్శనంలో తెలుసుకోవాల్సిన నియమాలు
ఆలయాలలో దర్శనాలకు విధి విధానము ఉన్నది. మానవుడు ఆలయాలను మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం, భక్తి మార్గం కోసం, భగవత్ అనుగ్రహం కోసం దర్శించాలని చెప్పింది శాస్త్రము. ఆలయాలు శక్తి స్వరూపాలు. ఆలయ దర్శనం విధి విధానంగా ఆచరించినటువంటి వారికి ఆరోగ్యము, తేజస్సు, శాంతి, కోరిక సిద్ది కలుగును అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆలయ దర్శన నిబంధనలు
- ఆలయ దర్శనం చేసే వ్యక్తి స్నానమాచరించి, శుచియై, శుభ్రమైన వస్త్రములు ధరించి, తిలకము కుంకుమ లేదా విభూది వంటివి ధరించి భక్తి శ్రద్దలతో దర్శనానికి వెళ్ళాలి.
- ఆలయ దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు.
- ఆలయంలోకి ప్రవేశించే పూర్వమే ప్రదక్షిణాలు ధ్వజ స్తంభ దర్శనము వంటివి చేయాలి.
- ఏ ఆలయమైతే దర్శిస్తున్నామో ఆ ఆలయ దర్శన విధి విధానం ప్రకారం అక్కడ ముఖ్య ఆలయాలను, ద్వారపాలకులను, సాక్షి దేవతలను, గ్రామ దేవతలను దర్శించాలి
- శివాలయాలను దర్శించుకునేటప్పుడు ముందుగా ఆలయంలో ఉన్న విఘ్నేశ్వరుని దర్శించుకోవాలి.
- ఆలయాల్లోకి ప్రవేశించే పూర్వము ఆలయానికి కనీసం మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.
- శివుని దర్శనం ఎదురుగా నిలబడి చేయకూడదు. అభిషేకం వంటివి పక్కనుండే చేయాలి. శివాలయ దర్శనంలో శ్రద్ధ, శుభ్రత మరియు నామ లేదా మంత్ర జపము ప్రాధాన్యము.
- శివదర్శనము నందియొక్క వెనుక భాగాన్ని పట్టుకొని నంది యొక్క కొమ్ముల మధ్యలోనుండి చూపుడు మరియు బొటనవ్రేలు మధ్యలోనుంచి చూడాలి.
- దర్శనము అయిన తరువాత ఆలయంలో కాసేపు కూర్చొని శివనామస్మరణ చేస్తూ కోరిక చెప్పి ప్రసాదాన్ని స్వీకరించాలి.
- శివాలయంలో ఇచ్చే ఎటువంటి ప్రసాదాన్నైనా పువ్వులనైనా నిస్సందేహంగా భక్తితో స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాలి.
- శివాలయంలో ఉండే శివ లింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్జ్వముఖమై (ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
- ఐదు ముఖాలకి, 5 పేర్లు ఉన్నాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా పూజ చేయొచ్చు.
- పశ్చిమాభి ముఖమైన శివలింగాన్ని చూసినప్పుడు ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.
- తూర్పుని చూస్తూ ఉండే శివలింగం గాలి మీద అదిష్టానం కలిగి ఉంటాడు.
- శివలింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటే అది దక్షిణామూర్తి స్వరూపం.
- ఉత్తరం వైపు చూసే ముఖాన్ని వామదేవ ముఖం అని అంటారు.
- ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖాన్ని ఈశాన ముఖం అంటారు. మనం లింగం పైన చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఇంకా జ్యోతిషంగ్రహ సంచారం, దేవాలయాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష పరిహారాలు, ఆధ్యాత్మిక సమాచారం, పండగలు, పూజా విధానం, వ్రత విధానం, రాశి ఫలాలు వంటి కథనాలు చదవండి.