పాత దుస్తులు ఎవరికైనా దానం చేస్తున్నారా? అలా చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
అవసరంలో ఉన్న వారికి, పేదవారికి దుస్తులు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇది మంచి అలవాటు. అయితే పాత దుస్తులు ఎవరికైనా ఇచ్చే ముందు వాస్తు ప్రకారం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వాటిని అనుసరించి దుస్తులు దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
తరచూ ట్రెండ్ కు అనుగుణంగా షాపింగ్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల గతంలో ఉన్న దుస్తులు పాతగా మారిపోయాయని పక్కన పడేస్తారు. ప్రతి ఇంట్లో ఇది జరుగుతూనే ఉంటుంది. కొందరు పాత దుస్తులు ఇల్లు శుభ్రం చేసుకునేందుకు, కిచెన్ క్లీన్ చేసుకునేందుకు ఉపయోగిస్తారు.
కాస్త బాగున్నాయి అనుకున్న దుస్తులు మాత్రం పేదవారికి దానం చేస్తారు. మనకు అవి పాతగా అనిపించినా అసలు దుస్తులు లేని వారికి మాత్రం అవి చాలా గొప్పగా అనిపిస్తాయి. వాటిని వేసుకున్నప్పుడు చాలా సంతోషపడతారు. వారి ఆనందం చూస్తే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే పాత బట్టలు ఇతరులకు ఇచ్చే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎలాంటి బట్టలు దానం చేయాలి, ఎలాంటివి ఎవరికి ఇవ్వకూడదు అనేది తెలుసుకుని ఉండాలి.
ఎలాంటివి దానం చేయాలి?
చాలాసార్లు ప్రజలు తమ పాత దుస్తులను పరిచయస్థులకు ఇస్తారు లేదా దానం చేస్తారు. దుస్తులు ధరించిన వారి శక్తిని గ్రహిస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం దుస్తులను దానం చేసిన తర్వాత పాత యజమాని శక్తి, భావోద్వేగాలు లేదా అనుభవాలు కొత్తగా ధరించిన వ్యక్తికి బదిలీ చేయబడతాయి. ఇది దానం చేసే వ్యక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతికూల ప్రభావాలను నివారించడానికి పాత బట్టలను దానం చేయడానికి ముందు వాస్తుకు సంబంధించి ముఖ్యమైన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాత బట్టలను దానం చేయడానికి ఉన్న వాస్తు నియమాల గురించి పండితులు ఈ విధంగా తెలియజేశారు.
ఏ రోజు దానం చేయకూడదు?
చిరిగిన, వేసుకోవడానికి అసలు పనికి రాని విధంగా ఉన్న దుస్తులు ఇవ్వడం వల్ల మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కాస్త చూసేందుకు మంచిగా ఉన్న దుస్తులు, మీరు వేసుకునేవి తీసి ఇవ్వాలి. దుస్తులను దానం చేయడానికి లేదా ఎవరికైనా ఇచ్చే ముందు మురికిగా ఉన్నవి ఇవ్వకూడదు. వాటిని ఇచ్చే ముందు తప్పనిసరిగా ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేసి ఇవ్వాలి. మీరు ఎవరికైనా పాత బట్టలు దానం చేస్తుంటే వీలైతే వారి దగ్గర నుంచి కనీసం ఒక రూపాయి అయినా తిరిగి తీసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం బట్టలు దానం చేయకూడదు.
మీకు సహాయం చేయాలి అనుకుంటే పాత దుస్తులు కాకుండా మంచి దుస్తులు కొని వారికి ఇవ్వవచ్చు. ముఖ్యంగా చలికాలం సమయంలో దుప్పట్లు, రగ్గులు, స్వెటర్లు వంటి వాటిని దానం చేయడం చాలా మంచిది. వస్త్ర దానం వల్ల జాతకంలోని అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు. కుజ దోషంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఇది ఒక చక్కటి పరిహారం. దానం అన్నింటిలోనూ పుణ్యాన్ని ఇచ్చేదిగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్