వైభవలక్ష్మీ వ్రతం గురించి విన్నారా? ఈ వ్రతం చేయాలనుకునే స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలి. అలాగే ఈ వ్రతం చేయడం వలన ఎలాంటి లాభాలను పొందవచ్చు, ఏ విధంగా వ్రతం ఆచరిస్తే పుణ్య ఫలితం వస్తుంది, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటివి తెలుసుకుందాం.
1. శ్రీమదైశ్వర్యలక్ష్మి, ధన లక్ష్మి, స్వర్ణలక్ష్మి, భాగ్యలక్ష్మిగా పిలవబడే ఈ విశ్వవిఖ్యాత వైభవలక్ష్మీవ్రతాన్ని వయస్సుతోగాని, కులమతాలతో గాని సంబంధం లేకుండా అన్నివర్గాల స్త్రీ-పురుషులు దీన్ని ఆచరించవచ్చును అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
2. ఈ వ్రతాన్ని గురువారంగాని, శుక్రవారంగాని సూర్యాస్తమయం జరిగింది మొదలు మూడుగంటలలోపు అంటే సుమారుగా సాయంత్రం 6-30 లగాయితు 9-30 లోపు చేయాలి.
3. ఈ వ్రతాన్ని సొంత ఇంట్లో లేదా, అద్దె యిళ్ళల్లోగాని, నివసిస్తున్న ఇళ్ళల్లోగాని, వ్యాపారస్థలాల్లోగాని, లక్ష్మీదేవి గుళ్ళో కానీ, నదుల దగ్గర, సముద్రతీరాల్లో, పువ్వుల, పండ్ల తోటల్లో కానీ ఆచరించాలి. అరుగుల మీద, ఆరుబయట చాందినీలు వేసి వాటి క్రింద, దుర్వాసనలు వేసేచోట చేయకూడదు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
4. ఏ విధమైన కోరికలు లేకుండా దేశ, కాలమాన ధర్మాల రీత్యా, కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు వైభవలక్ష్మిని ఉత్తరదిక్కులో ప్రతిష్ఠించి పూజించాలి. శుచిశుభ్రతలు పాటించడమే తప్ప వీళ్ళకి ఎటువంటి నియమాలు లేవు.
5. ఉపాసనగా అంటే ప్రతి గురువారం లేదా శుక్రవారం దినాల్లో ఖచ్చితంగా పూజ చేసేవాళ్ళు శిరఃస్నానం చేయాలి. అమ్మవారిని ఈశాన్యమూలలో ప్రతిష్ఠించి పూజించాలి. ఇంతకిమించి వీళ్ళకి కూడా నియమాలేమీ లేవు.
6. సాంసారిక వ్యవహార విజయం, కోరికలు నెరవేరడం కోసం ఈ వ్రతం చేసేవాళ్ళు అమ్మవారిని తూర్పుదిక్కులో ప్రతిష్ఠించి పూజించి ఆరోజు ఉదయమే అభ్యంగస్నానం చేయాలి. పగలు ఉపవాసముండాలి. సాయంత్రం మళ్ళీ తలారా సాధారణ స్నానం చేసాకే పూజ మొదలెట్టాలి. ఆరోజు మధు, మాంస, మైధునాలకి దూరంగా వుండాలి. పూజానంతరం ప్రసాదం నలుగురికీ పంచిపెట్టి, తాము కూడా తిని, ఆ తర్వాతే బంధుమిత్రులతో కలిసి భుజించాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
7. ఆరోజు పులుపు తినకూడదు.
8. కేవలం ధనాభిలాషులై ఈవ్రతం చేసేవాళ్ళు కూడా పై నియమాలనే పాటించాలి.
9. ఏ కారణంచేతైనా ఉపవాసానికి అశక్తులైనవాళ్ళు ఉదయం 11 గం॥ల్లోపు పండ్లుగాని, పులుపు తగలకుండా తక్కువ ఉప్పుకారాలు గల ఉపాహారం గాని తీసుకోవచ్చును.
10. కులాచారాల రీత్యాగాని, పితృకార్యాదుల వల్లగాని ఉపవాసానికి అంతరాయమైతే అది దోషం కాదు. వారు ఉపవసించక్కర్లేదు.
11. పూజచేసే రోజున పగటినిద్ర పనికిరాదు. సూర్యోదయం మొదలు రాత్రి భోజనాలయ్యే దాకా నిద్రపోకూడదు.
12. ముందుగా ఎన్ని వారాలు పూజ చేస్తామో మ్రొక్కుకోవాలి. అంటే 4,6, 8, 9,11,21 వారాలుగా, 4 నుంచి 21 వారాలదాకా ప్రస్తుతం ప్రాచుర్యంలో వుంది. తర్వాత ఎవరి ఇష్టం, శక్తి వారివి.
13. పూజించిన ప్రతి వారం కూడా కనీసం 8 మంది ముత్తయిదువలకు ప్రసాదంతో పాటే “శ్రీవైభవలక్ష్మీ పూజా వైభవం” పుస్తకాలను కూడా ఇవ్వాలి.
14. మధ్యలో ఒకటి, రెండువారాలు ప్రయాణాల వల్ల కానీ, ప్రకృతి వల్ల కానీ, సూతకాదుల వల్ల కానీ లేదా ఇతరేతరమైన ఏ అపవిత్రతల వల్లగాని ఆటంకం కలిగితే బాధపడక్కర్లేదు. ఇబ్బంది గడిచిన తర్వాతే తిరిగి పూజ చేసుకోవచ్చును.
15. సాధ్యమైనంత వరకూ మొదటి మూడు వారాలు మాత్రం ఆపకూడదు. అలా ఆటంకం కలిగితే మాత్రం మళ్ళీ మొదటివారంగా భావించి పూజ ప్రారంభించాలి.
16. మ్రొక్కుకున్న వారాల తర్వాత వచ్చేవారం అంటే 3 గురువారాలు మ్రొక్కుకుంటే ఆ మర్నాడు వచ్చే శుక్రవారంనాడు, మూడు శుక్ర వారాలైతే ఆఖరి శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
17. ఉద్యాపనలో ముత్తయిదువ పూజ చేయాలి. అంటే ఎన్ని వారాలు పూజచేసామో అంత మంది ముత్తయిదువలకు తలంటి, పసుపు, కుంకుమ, పూలు, కాటుక, గంధం వంటి మంగళద్రవ్యాలతో అలంకరించి పూజించాలి. పూజ తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్క వైభవలక్ష్మీ పూజా వైభవమనే పుస్తకాన్ని, పసుపు, కుంకుమ పొట్లాలు, వడపప్పు, కొద్దిగా పానకాన్ని వాయినంగా ఇవ్వాలి. వాయినదాన మంత్రం పూజాకల్పం చివరలో ఈయబడినది.
18 . ఈవ్రతంలో ఎన్నివారాలు పూజించినా ప్రతివారం క్రొత్త ముత్తయిదువలను ఆహ్వానించడం శ్రేష్టం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
19. తమతమ ఇళ్ళల్లో ముత్తయిదువలకు తలంటే సౌకర్యం లేనివాళ్ళు ఉద్యాపనకు ముందురోజు సాయంత్రమే పిలవదలచిన ముత్తయిదువల ఇళ్ళలకు వెళ్ళి వాళ్ళకి బొట్టు పెట్టి కొంచెం సున్నిపిండి, 1 పసుపుకొమ్ము, కుంకుడుకాయలు, ఉగ్గుగిన్నెడు నూనె ఇచ్చి మర్నాటి సాయంత్రం పూజకి తలంటుకుని రమ్మని పిలవాలి.
20. ఈ వ్రతాన్ని ఎన్ని వారాలు చేసినా కూడా ఉద్యాపన తర్వాత వచ్చే ఆశ్వీయుజ బహుళ అమావాస్య (దీపావళి అమావాస్య) నాటి రాత్రి మాత్రం వైభవలక్ష్మి పూజ ఖచ్చితంగా చేయాలి.
21. ఈవ్రతాన్ని ఎవరికి వారు విడిగానే కాకుండా సామూహికంగా అంటే కూడా చేసుకోవచ్చును. కాని మ్రొక్కుకున్న వారాలయ్యే వరకు అందరూ కలిసే పూజించాలి. ఏ ఒక్కరు పాల్గొనకపోయినా విఘ్నంగానే జమ చేయాలి.
22. అన్నిటికన్నా ఈ వ్రతాచరణకి భక్తిశ్రద్ధలు, విశ్వాసము ప్రధానంగా వుండాలి. ఎంత నమ్మకంగా, శ్రద్ధాభక్తులతోను చేస్తే ఫలితం ఉంటుంది. అవి ఎంత తగ్గితే ఫలితంకూడా అంతే తగ్గుతుంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.