సరస్వతికి సప్తసారస్వతం అనే పేరు ఎందుకు వచ్చింది?, సరస్వతీ నది ప్రాశస్త్యంతో పాటు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో!-how saraswathi got saptasarasvatam name and check importance of this river ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సరస్వతికి సప్తసారస్వతం అనే పేరు ఎందుకు వచ్చింది?, సరస్వతీ నది ప్రాశస్త్యంతో పాటు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో!

సరస్వతికి సప్తసారస్వతం అనే పేరు ఎందుకు వచ్చింది?, సరస్వతీ నది ప్రాశస్త్యంతో పాటు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

హిమాలయాలలో పుట్టిన ఈ నదీ ప్రసక్తి వేదాలలోను, రామాయణ, భారత, భాగవతాలలోను కనిపిస్తుంది అని చిలకమర్తి తెలిపారు. బ్రహ్మాండ పురాణంలో సరస్వతీ నదీ ఆవిర్భావం గురించి ఉంది. సరస్వతికి సప్తసారస్వతం అనే పేరు ఎందుకు వచ్చింది?, సరస్వతీ నది ప్రాశస్త్యంతో పాటు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి.

సరస్వతికి సప్తసారస్వతం అనే పేరు ఎందుకు వచ్చింది? (pinterest)

సరస్వతీ అతిపురాతనమైన వేదకాలపు నది అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. హిమాలయాలలో పుట్టిన ఈ నదీ ప్రసక్తి వేదాలలోను, రామాయణ, భారత, భాగవతాలలోను కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో సరస్వతీ నదీ ఆవిర్భావం గురించి ఉంది.

పూర్వం పరమశివుని ఆద్యంతాలని కనుగొనదలచిన బ్రహ్మదేవుడు ఎంత వెదకినా కనుగొనలేకపోయాడు. చివరికి శివుని వద్దకు వచ్చాడు. బ్రహ్మను చూసిన శివుడు "నా ఆద్యంతాలు కనుగొన్నావా?" అని అడిగాడు. పరాభవం చెందుతానని భావించిన బ్రహ్మ, "నీ ఆద్యంతాలు చూసి వచ్చాను" అని అబద్దం చెప్పాడు.

ఈ విషయాన్ని గ్రహించిన శివుడు, అతడి వాక్కయైన సరస్వతిని నదిగా రమ్మని శపించాడు. అందువల్లనే విద్యాధిదేవతైన సరస్వతి, నదీ దేవతగా మారిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. బ్రహ్మవైవర్త, దేవీభాగవత పురాణాలలో గంగా, సరస్వతులు ఒకరినొకరు శపించుకొని భూలోకంలో నదులుగా జన్మించినట్లు పేర్కొనబడింది.

మహాభారతంలో సరస్వతీ నది

పూర్వం బ్రహ్మ చేసిన యాగానికి ‘సుభద్ర’ అనే పేరుతో, నైమిశారణ్యంలో మునులు చేసిన యాగానికి ‘కనకాక్షి’ అనే పేరుతో, గయుడు చేసిన క్రతువుకు ‘విశాల’ అనే పేరుతో, ఉద్దాలకుడు చేసిన అధ్వరానికి ‘సురతన్వి’ అనే పేరుతో, వశిష్టుడు చేసిన యాగానికి ‘ఓఘమాల’ అనే పేరుతో, బృహస్పతి చేసిన సత్రానికి ‘సువేణి’ అనే పేరుతో, బ్రహ్మ చేసిన సవనానికి ‘విమలోదక’ అనే పేరుతో వచ్చి నిరుపమానమైన గౌరవం పొందినట్లు చెప్పబడింది.

సప్తసారస్వతం

సరస్వతీ నది ఈ విధంగా ఏడు యాగాలకు, ఏడు రూపాలతోను, పేర్లతోను వచ్చి గౌరవాలు పొందడం వల్ల ఆమె ‘సప్తసారస్వతం’ అనే పేరును పొందిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సకల పాపాలు పోతాయి

సరస్వతీ నది ఎంతో పవిత్రమైనది. ఈ నదీ స్మరణ వల్లనే సకల పాపాలు శమిస్తాయి. ఈ నదీ తీరం వద్ద వందల కొద్దీ తీర్థాలు ఉన్నాయి. అవి ఎంతో పుణ్యప్రదమైనవి. చంద్రుడు ఈ నదీ స్నానఫలితంగా రాజయక్ష్మ వ్యాధిని పోగొట్టుకున్నాడు.

ఇంద్రుడు తన బ్రహ్మహత్యాదోషాన్ని పోగొట్టుకున్నాడు. వరుణునికి జలాధిపత్యం, కుబేరునికి ధనాధిపత్యం ఈ నదీ సేవనం వల్లనే వచ్చాయి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారేందుకు కూడా ఈ నదే కారణం. వ్యాసభగవానుడు ఈ నదీ తీరం వద్దే విజ్ఞానరాశి అయిన వేద విభజన చేశాడు. భాగవత రచన కూడా అక్కడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ సరస్వతీ నదీ తీరం వద్దనే తొలిమానవుడు నడిచాడు. ఆర్య నాగరికత, ఆర్యుల జీవితం, వేద విజ్ఞాన సముపార్జన & విస్తరణ ఈ నదీ తీరం నుంచే సాగింది. అందుకనే వారిచే వేదాలలో తమ జీవనానికి కారణమవడం వల్ల ఆమెను తల్లిగా, జ్ఞాన సముపార్జన ఈ నదీ తీరం వద్దనే జరగడం వల్ల జ్ఞానదాయినిగా అభివర్ణించారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఋగ్వేదంలో గంగా, యమునా, సింధు మొదలైన 21 నదులకన్నా సరస్వతీ నది ఎక్కువగా కీర్తించబడింది. వేదాలలో ఈ నదీ తీరం వద్ద నివసించే రాజులు, ఋషులు, ప్రజలు, మరియు ఈ నదీ ప్రవాహం గురించి అనేక వర్ణనలు ఉన్నాయి.

హిమాలయంలో పుట్టే ఈ నది – వితస్తా (జీలం), అసిక్నీ (చీనాబ్), పరుష్ణి (రావీ), శతద్రు (సట్లేజ్), విపాశ (బీయాస్), సింధు నదులతో కలిసి పంజాబ్, పాకిస్తాన్ మీదుగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో సంగమించేది. ఈ ఏడు నదులు కలిసి ప్రవహించే ప్రదేశమే ‘సప్తసింధు ప్రదేశం’గా (ఆర్యావర్తం) ప్రసిద్ధి చెందింది.

సరస్వతీ నది ప్రవాహం

సరస్వతీ నది ప్రవాహం కొన్నిచోట్ల వేగంగా, కొన్నిచోట్ల మందంగా సాగేది. ఈ నది వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉండేది. కొన్నిచోట్ల సరోవరం లాగా, చెరువులాగా ఈ నదీ ప్రవాహం ఉండేది. ఆర్యావర్తం నుంచే ఈ నది గంగ, యమునల వద్దకు ప్రవహించి, ప్రయాగ అనే పవిత్ర పుణ్యస్థలంలో వాటితో అంతర్వాహినిగా కలుస్తుంది. ఇదే ప్రసిద్ధి చెందిన త్రివేణీ సంగమం.

ఈ సరస్వతీ నదీ తీరం ప్రాంతంలోనే ఉన్నది కురుక్షేత్రం. కురుక్షేత్రానికి దగ్గరలోనే ఉన్నది ‘వినాశన’ అనే ప్రదేశం. ఇక్కడే సరస్వతీ నది అంతర్ధానమైంది. ఒక పవిత్ర నది అంతర్ధానం చెందిన స్థలం కావడం వల్ల ఆ ప్రదేశానికి ‘వినాశన’ అనే పేరు వచ్చింది. ఇప్పుడీ ప్రాంతంలో "గగ్గర్" అనే నది ఉంది. ఇది కేవలం వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది.

32 చిన్నా, పెద్ద నదులు సరస్వతీ నదిగా పిలువబడి, సరస్వతీ నదికి చెరగని ముద్రను వేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి శ్రీకృష్ణుడు నిర్యాణం పొందిన 'ప్రభాస' పట్టణంలో ఉంది. లవణానదిలో కలుస్తున్న మరో సరస్వతీ నది పుష్కర సరస్వతి అని పిలవబడుతుంది. ఇది పుష్కర సరోవరంలో పుట్టి, లవణానదిలో కలుస్తుంది. ఈ లవణానదియే ప్రస్తుతం కచ్ సింధు శాఖలో కలిసే “లూనీ నది”.

వైదిక కార్య విజ్ఞానానికి, ఆర్ష సంప్రదాయానికి పురుడు పోసిన ఈ సరస్వతీ నదిని గుర్తించాలి. దీని పునరుజ్జీవనానికి 1819 సంవత్సరం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. 1985లో వైదిక సరస్వతీ నదీ పరిశోధన ఉద్యమం ప్రారంభమై, 18 మంది సభ్యులతో కూడిన ఒక సమితి నిరంతరం శ్రమించి సరస్వతీ నదిని పునరుజ్జీవింపచేసి కృతకృత్యమైంది.

పుష్కరాలు

పుష్కరాలు వచ్చే నదుల్లో ఇది మూడవది. గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినపుడు ఈ నదికి పుష్కరాలు వస్తాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.