శాకంభరి దేవి ఎలా అవతరించింది? అమ్మవారి విశిష్టత ఏంటి?-how did shakambhari devi incarnate what is special about goddess ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శాకంభరి దేవి ఎలా అవతరించింది? అమ్మవారి విశిష్టత ఏంటి?

శాకంభరి దేవి ఎలా అవతరించింది? అమ్మవారి విశిష్టత ఏంటి?

HT Telugu Desk HT Telugu
Jun 21, 2024 10:50 AM IST

శాకంభరి దేవి ఎలా అవతరించింది? అమ్మవారి విశిష్టత ఏంటి? అనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

శాకంభరి దేవి ఎలా అవతరించింది?
శాకంభరి దేవి ఎలా అవతరించింది?

జ‌గన్మాత అయిన అమ్మవారు శాకంభరిగా ఆవిర్భవించిన నేపథ్యాన్ని దేవీభాగవతం, చండీ స‌ప్త‌శ‌తి గ్రంథాలు తెలియ‌జేస్తున్నాయ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఒకానొక స‌మ‌యంలో దుర్గముడు అనే రాక్షసుడి వల్ల వేదవిహిత కర్మలన్నీ ఆగిపోయాయి. యజ్ఞయాగాదుల ఊసేలేదు. దేవతలకు యజ్ఞహ‌విర్భాగాలు అంద‌టంలేదు. ఫలితంగా దేవతలు నిర్వీర్యులయ్యారు. దేవతలతో పాటు మానవులు కూడా కష్టాల పాలయ్యారు. యజ్ఞాలు లేక‌పోవ‌డంతో వాన‌లు కుర‌వ‌లేదు. పంట‌లు పండ‌లేదు. లోకమంతా దుర్భిక్షం తాండవించటం మొదలైంది. తినటానికి కనీసం తిండిలేని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాక్షసుడి బాధలు తట్టుకోలేని మునులు, దేవతలు జగన్మాతను ప్రార్థించారు. తమ దీనస్థితిని విన్నవించుకుంటూ, తమను ఉద్ధరించమని ప్రార్థించారు. ఈ విధంగా మునులు, దేవతలు చేసిన స్తోత్రాలను విని దేవి ప్రసన్నురాలైంద‌ని ఆధ్యాత్మిక వేత్త‌ చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

ఒక చేతితో బాణం, మరొక చేతిలో కమలం, మూడో చేతిలో సారవంతమైన, తినగానే పుష్టినిచ్చే కందమూల ఫలాలు, ఆకుకూరలు, పండ్లు, నాలుగో చేతిలో మహాధనుస్సు ధరించి జగన్మాత ప్రత్యక్షమైందని సర్వాతీతురాలైనప్పటికీ తన బిడ్డల వంటి భక్తుల దయనీయ స్థితి చూసి ఆమె చలించింద‌ని ఆధ్యాత్మిక వేత్త‌ చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

ఆమె కన్నులు మరుక్షణంలో చెమర్చాయి. ఈ కన్నీటి బిందువులు అమ్మ చెక్కిళ్ల మీదుగా భూమిని చేరాయి. ఆ కన్నీటి బిందువుల పరంపర నదులు, సరస్సుల్లోకి చేరింది. ఫలితంగా నదులన్నీ తిరిగి పూర్వకళను సంతరించుకున్నాయి. ఆ నీటిని తాగిన ప్రజల్లో నూతన చైతన్యం కలిగింది. తల్లీ! నీకు మా నమస్కారం. అనంతమైన కన్నులు కలిగిన రూపంతో శతాక్షిగా అవతరించి మమ్మల్ని అనుగ్రహించావమ్మా. అమ్మా.. మా మీద దయ ఉంచి వేదాల్ని మాకు తిరిగి ప్రసాదించు అంటూ ప్రజలు, దేవతలు ఏకకంఠంతో అమ్మ‌వారిని వేడుకున్నారు.

భక్తుల ప్రార్థనలతో సంతుష్టురాలైన జగదంబ తాను ధరించిన సకల శాకములను (కూరలు) వారికి అనుగ్రహించింది. దీంతో ప్రజల ఆకలిదప్పులు తీరాయి. శాకములను ధరించి, స్వయంగా సకల లోకాలకు శాకములను ప్రసాదించిన ఆ రూపంలో జగన్మాత శాకంభరిగా లోకాలకు ఆరాధ్యమైంద‌ని చిలకమర్తి వివ‌రించారు. అనంతరం జగన్మాత తన శరీరం నుంచి 32 మహాశక్తుల్ని ఉద్భవింపజేసి ఆ శక్తితో రాక్షస సంహారం చేసి, ముల్లోకాలకు శాంతిని ప్రసాదించింద‌ని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel