అచలము అనగా కొండ అని. సింహాచలం అంటే సింహరూపంలో ఉన్న పర్వతమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగో అవతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి అవతార మూర్తిగా వెలసిన క్షేత్రం సింహాచల క్షేత్రమని చిలకమర్తి తెలిపారు. పురాణాల ప్రకారం.. హిరణ్యకశ్యపుడికి మహావిష్ణువు అంటే వైరం. అతని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడు విష్ణుభక్తి మానకపోవడంతో ఆ శ్రీ మహావిష్ణువే మాయావై తన కొడుకు రూపంలో జన్మించాడని భ్రమించి ఆ బాలుడిని చంపాడినికి హిరణ్యకశ్యపుడు ప్రయత్నించెను. అలా ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ప్రహ్లాదుడిని శ్రీ మహావిష్ణువు రక్షిస్తూ ఉండెను.
ఓసారి హిరణ్యకశ్యపుడు.. విష్ణువు ఎక్కడ ఉన్నాడు? అని అడగ్గా స్వామి సర్వాంతర్యామి అన్నిచోట్లా ఉన్నాడని ప్రహ్లాదుడు బదులిచ్చాడు. ఈ మాటలతో ఆగ్రహానికి గురైన హిరణ్యకశ్యపుడు విష్ణువును స్తంభంలో చూపించమనెను. శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో స్తంభంలో ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుడిని సంహరించెను. ఆ రకంగా లక్ష్మీ నరసింహ స్వామి ప్రహ్లాదుడిని రక్షించడం కోసం ఈ భూమ్మీద వెలసిన క్షేత్రం సింహాచలం అని పురాణాల్లో చెప్పబడుతుంది.
స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్ట మొదటి సారి వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాడని ప్రతీతి. మరొక వృత్తాంతం ప్రకారం హరి నామాన్ని జపిస్తున్న ప్రహ్లాదుడిని చంపాలని భావించాలని హిరణ్యకశ్యపుడు.. ఆ బాలుడిని సముద్రంలో పారేయమని సైన్యాన్ని ఆదేశిస్తాడు. రాజు చెప్పిన విధంగా సైనికులు చేయగా.. సముద్రంలో ఆ బాలుడిని రక్షించి, విష్ణుమూర్తి వరాహ నరసింహ రూపంలో సింహాచలంలో దర్శనమిచ్చారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయని చిలకమర్తి చెప్పారు.
నరసింహ మూర్తులు మొత్తం 32 ఉన్నట్లు పురణాలు తెలియజేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు. ఉగ్రం వీరం మహా విష్ణుం అనే నరసింహ బీజాక్షరాలతో కూడిన మహామంత్రంలో 32 అక్షరాలుంటాయి. నరసింహుని క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన సింహాచల క్షేత్రం సరిగ్గా 32 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుందని.. అందుకే ఆ క్షేత్రానికి పురణాల్లో ఎంతో విశిష్ఠత ఉందని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలిపారు.
విష్ణువు పర్వతాలకు అధిపతి. నిజానికి ప్రాచీన కాలంలో మన దేవాలయాలన్నీ పర్వతాలపైనే విలసిల్లాయి. స్వయంభువుగా స్వామి వెలిసిన పర్వతాలన్నింటికీ ఆ మూలమూర్తితో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది. అంటే ఆలయంలో కొలువైన మూర్తితో పాటు ఆ స్వామి వెలసిన కొండ కూడా అంతే పవిత్రమైనదని గుర్తించాలని చిలకమర్తి అన్నారు. సింహాచలం సింహం ఆకారంలో ఉంటుంది. సింహాచల పర్వతానికి వ్యాసపూర్ణిమనాడు గిరి ప్రదక్షిణ చేస్తారు. సింహగిరికి మూడు సంవత్సరాల పాటు వ్యాసపూర్ణిమ నాడు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని.. చతుర్విధ పురుషార్థాలు పొందుతామని, చక్కటి సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.