Mrigashira Nakshatra: మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి
Mrigashira Nakshatra: 27 నక్షత్రాలలో మృగశిర ఒకటి. ఈ నక్షత్రానికి చెందిన వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది? ఎలాంటి పనులు వీరికి సరిపోతాయి అనే దాని గురించి తెలుసుకుందాం.
Mrigashira Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి. అలాగే 27 నక్షత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో మృగశిర నక్షత్రం ఐదోది. ఇవి మానవుడి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి.
మృగ్ + శిర అంటే జింక తల. ఇది నిరపాయమైన రాశి. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కొత్త అనుభవాలను కోరుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. బహుముఖ స్వభావం కలిగి ఉంటారు.
తమ ఎమోషన్స్ ను త్వరగా కంట్రోల్ చేసుకోలేరు. నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. త్వరగా అలసిపోతారు. సోమరితనం కలిగి ఉంటారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో ఒత్తిడిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతాడు. ఒకరకంగా చెప్పాలంటే భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. మృగశిర నక్షత్రం నాలుగు దశల ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
మొదటి దశ
మొదటి దశకు అధిపతి సూర్యుడు. ఈ దశలో శుక్రుడు, కుజుడు, సూర్యుని ప్రభావం ఉంటుంది. ఈ దశ వృషభ రాశిచక్రం 53 డిగ్రీల 20 సెకన్ల నుండి 56 డిగ్రీల 40 సెకన్ల వరకు ఉంటుంది. ఇందులో జన్మించిన వ్యక్తి సాధారణ కళ్ళు, అందమైన దంతాలు, విశాలమైన ముక్కు, మంచి రంగు కలిగిన జుట్టు, అహంకార స్వభావం కలిగి ఉంటాడు. వ్యక్తి విద్యావంతుడు, తెలివైనవాడు, భావోద్వేగంతో ఉంటాడు.
రెండవ దశ
ఈ దశకు అధిపతి బుధుడు. ఇది శుక్రుడు, కుజుడు, బుధ గ్రహాల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ దశ వృషభ రాశిలో 56 డిగ్రీల 40 నిమిషాల నుండి 60 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ దశలో జన్మించిన వ్యక్తి తక్కువ ధైర్యం, పిరికివాడు, సన్నగా, నిరాశకు గురవుతాడు. గణిత శాస్త్రజ్ఞుడు, మంచి సైనికుడు కూడా కావచ్చు.
మూడవ దశ
ఈ దశకు అధిపతి శుక్రుడు. ఇది బుధుడు, కుజుడు, శుక్ర గ్రహాల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ దశ మిథున రాశిలో 60 డిగ్రీల నుండి 63 డిగ్రీల 20 సెకన్ల వరకు ఉంటుంది. ఈ దశలో జన్మించిన వ్యక్తికి ఎత్తైన భుజాలు, పొడవైన ముక్కు ఉంటుంది. ఈ దశలో జన్మించిన వ్యక్తి మరింత ఆలోచనాత్మకంగా, సామాజికంగా, శృంగారభరితంగా ఉంటాడు. ప్రజలతో త్వరగా కనెక్ట్ అవుతాడు. వారితో మమేకమవుతాడు.
నాల్గవ దశ
ఈ దశకు అధిపతి కుజుడు. ఇది బుధుడు, అంగారక గ్రహాల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ దశ మిథున రాశిలో 63 డిగ్రీల 20 సెకన్ల నుండి 66 డిగ్రీల 40 సెకన్ల వరకు ఉంటుంది. ఈ దశలో జన్మించిన వ్యక్తులు మత బోధకులు, చురుకైన వారిగా ఉంటారు. కమాండర్లు, సలహాదారులు లేదా మంచి జ్యోతిష్కులు కూడా కావచ్చు.అంగారకుడు అధిపతిగా ఉండటం వల్ల కాస్త దూకుడు స్వభావం కలిగి ఉంటారు. కోపం త్వరగా వచ్చేస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.