మీరు మంత్రాలని ఫోన్ రింగ్ టోన్ గా పెట్టుకున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?
భక్తి ఉండవచ్చు కానీ అది శృతి మించకూడదు. దేవుడిని స్తుతించేందుకు ఉపయోగించే మంత్రాలు కఠినమైన నియమాలు అనుసరిస్తూ పఠించాలి. అంతే కానీ వాటిని ఫోన్ రింగ్ టోన్ గా పెట్టుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
హిందూ ధర్మ శాస్త్రంలో మంత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దైవానికి దగ్గర అయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయి. దేవుళ్ళను కీర్తించేందుకు, వారిని ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం పూజ సమయంలో మంత్రాలను పఠిస్తూ ఉంటారు.
మానసిక ప్రశాంతతను అందించడంలో మంత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏదైనా మంత్రాలు గురువులు ఉపదేశం చేయనిదే ఫలించవు. రుషులు, వేద శాస్త్ర నిపుణులు, గురువులు చెప్పే విధంగా మాత్రమే మంత్రాలు పఠించాలి. అది కూడా భక్తి శ్రద్ధలతో పఠించినప్పుడే వాటికొక అర్థం, పరమార్థం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో భక్తి వెర్రిపోకడలు పోతుంది. దేవుడిని కీర్తించే భజనలు, పాటలు, కీర్తనలు వేరు. భగవంతుడి సాక్షాత్కారంగా పరిగణించే మంత్రాలు వేరు.
రేడియో, టీవీ, ఫోన్ లో దేవుడి భక్తి పాటలు పెట్టుకుని చాలా మంది వింటూ ఉంటారు. కొందరు ఇష్టమైన వాళ్ళు వాటిని సెల్ ఫోన్ రింగ్ టోన్ లేదా కాలర్ ట్యూన్ గా పెట్టుకుంటారు. చాలా మంది ఫోన్లకు కాలర్ ట్యూన్ గా భక్తి పాటలు వినిపిస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో మంత్రాలు కూడా రింగ్ టోన్ గా పెట్టుకుంటున్నారు. అయితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యమైన పని కాదని పండితులు హెచ్చరిస్తున్నారు.
మంత్రాలు పఠించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి భక్తి అనే పేరుతో మంత్రాలు రింగ్ టోన్ గా పెట్టుకోవడం మంచిది కాదు. ఈ పనుల వల్ల సత్పఫలితాలు రావడం మాట అటుంచితే అవి మనల్ని పతనం వైపుకు తీసుకుని వెళతాయి. మంత్రాలు ఎప్పుడూ భక్తి, శ్రద్ధలతో నియమ నిష్టలతో పఠించాల్సిన పవిత్రమైనవి. అవి పాటలు, కీర్తనలు కావు.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాయత్రీ మంత్రం, మృత్యుంజయ మంత్రం రింగ్ టోన్ గా పెట్టుకుంటున్నారు. అలా ఎప్పటికీ చేయకూడదు. మీరు దైవ భక్తి కలిగి ఉండి దేవుడి పాటలు పెట్టుకోవాలని అనుకుంటే అన్నామాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎప్పుడంటే అప్పుడు పాడుకోవచ్చు, ఫోన్ లో వినవచ్చు. కానీ మంత్రాలు మాత్రం రింగ్ టోన్ గా పెట్టుకోవడం దేవతలను, దేవుళ్ళను అవమానించినట్టే అవుతుంది. వారిని అగౌరవపరిచినట్టుగా మారుతుంది. అందుకే మంత్రాలు కేవలం ధ్యానం చేసేటప్పుడు మాత్రమే పఠించాలి. వీటిని ఎప్పుడు అలా పెట్టుకోకూడదు.
మంత్రాలు పఠించేందుకు సరైన సమయం ఉంటుంది. పదాలు తప్పులు లేకుండా మనసు ఏకాగ్రతతో సరైన విధంగా వాటిని పఠించాలి. మంత్రాలు ఎప్పుడూ పాటలు కావు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మంత్రాలు సరిగా పఠించినప్పుడే దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్