Hanuman jayanti 2024: 2024 లో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది? ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి?
Hanuman jayanti 2024: ఈ ఏడాది హనుమాన్ జయంతి మార్చి 23వ తేదీ వచ్చింది. ఆంజనేయ స్వామికి పూజ చేసి ఈ పరిహారాలు పాటించడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి.
Hanuman jayanti 2024: ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఆపద్బాంధవుడిగా, భయంగా ఉన్నప్పుడు అభయాన్నిఇచ్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారు. హిందువులు పూజించే ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. ప్రతి ఒక్క ఊరిలోనూ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 23 మంగళవారం వచ్చింది.
హనుమంతుడికి ఇష్టమైన రోజు మంగళవారం. అటువంటి మంగళవారం లేదా శనివారం రోజు హనుమాన్ జయంతి వస్తే దాని ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు దేశవ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలను కాషాయ రంగు జెండాలతో అలంకరిస్తారు. ఆరోజు హనుమంతుడు ఆశీస్సుల కోసం సుందరకాండ పఠిస్తారు. రామనామ జపం చేస్తారు. దానధర్మాలు చేస్తారు. ఉపవాసం ఉండి సుందరకాండ పారాయణం చేస్తారు.
పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3.25 గంటలకు ప్రారంభమై 24వ తేదీన ఉదయం 5.18 గంటలకు ముగుస్తుంది. అందువల్ల హనుమాన్ జయంతి 23వ తేదీ జరుపుకోనున్నారు. ఈ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో, సూర్యుడు మేష రాశిలో సంచరిస్తారు. హనుమంతుడు అనుగ్రహంతో మనిషి అన్ని రకాల సమస్యల నుండి బయటపడతాడు. అంజనీ మాత గర్భం నుంచి జన్మించినందుకు గాను ఆయన్ను ఆంజనేయుడుగా పిలుచుకుంటారు.
శని పట్టని దేవుళ్ళలో హనుమంతుడు ఒకరు. హనుమంతుడి అనుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. దీన్ని జపించడం వల్ల మనసులోని భయాలు తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం మీ మీద ఉండదు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. అలాగే హనుమంతుడి అనుగ్రహం కోసం సుందరకాండ పారాయణం చేయాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం శ్రీరామ నామాన్ని జపిస్తే త్వరగా ప్రసన్నుడవుతాడు.
హనుమాన్ జయంతి రోజు పాటించాల్సిన పరిహారాలు
హనుమాన్ జయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఆరోజు ఉపవాసం అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. పసుపు లేదా ఎరుపు రంగులో దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ విగ్రహానికి తమలపాకులు సమర్పించాలి. అలాగే సింధూరంతో విగ్రహాన్ని అలంకరించాలి.
హనుమంతుడికి ఇష్టమైన బెల్లం, పప్పు నైవేద్యంగా సమర్పించాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. రామాయణం పారాయణం చేయడం వల్ల హనుమాన్ ఆశీస్సులు లభిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్ర దానం, డబ్బు దానం చేయడం మంచిది. అలాగే హనుమాన్ జయంతి రోజు గులాబీ దండ వేయడం వల్ల ఆయన అనుగ్రహం పొందుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.
వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు, నష్టాలను నివారించేందుకు హనుమాన్ జయంతి రోజు సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అలాగే ఆంజనేయస్వామి గుడిని స్వామి వారికి ఇష్టమైన కాషాయ రంగు జెండాలతో అలంకరించిన వాళ్ళు ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక తెల్ల కాగితం మీద స్వస్తిక్ గుర్తు వేసి హనుమంతుడికి సమర్పించాలి. తర్వాత ఆ కాగితాన్ని భద్రంగా ఇంట్లో పెట్టుకోవాలి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నట్లయితే హనుమాన్ జయంతి రోజు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయస్వామికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది.