Guru Purnima 2023: రేపు గురుపూర్ణిమ.. ఈ పండగ విశిష్టత, ఏం చేయాలో తెలుసుకోండి
Guru Purnima 2023: రేపు జూలై 3, 2023న గురుపూర్ణిమ. ఈ పండగ విశిష్టత, ఏం చేయాలో ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
భారతీయులకు సనాతన ధర్మాన్ని పాటించే వారికి గురుపూర్ణిమ ముఖ్యమైన పండుగ. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము వేద వ్యాసులవారు జన్మించిన రోజు గురుపౌర్ణమి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గురు పూర్ణిమ రోజు మంత్రోపదేశం పొందిన గురువులను పూజించాలి, సత్మరించాలి. వ్యాసులవారు రచించిన ఏ గ్రంథమునైన ఈరోజు పఠించాలి. పరాశర మహర్షి, శక్తి మహర్షి, వ్యాసమహర్షి వంటి మహర్షులను ఈరోజు స్మరించుకోవాలని చిలకమర్తి తెలిపారు. ద్వైత అద్వైత విశిష్ట అద్వైత గ్రంథాలను అందించినటువంటి గురువుల యొక్క పూజ ఆచరించాలి. శంకరాచార్యులవారు, రామానుజాచార్యులవారు, మద్వాచార్యుల వంటి వారి సేవలో నిమగ్నమవ్వాలి.
వ్యాస పూర్ణిమనే భారతీయ సాంప్రదాయంలో “గురుపూర్ణిమ” అని వ్యవహరిస్తారు. వ్యాసుని జన్మతిథిని “ఆషాఢ పూర్ణిమ'గా బ్రహ్మాండ పురాణం చెపుతోంది. శ్రీ కృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్దురువైతే, శక్తిమంతమైన సంస్కృతిని, దానికి అవసరమైన విశాల వాజ్మయాన్ని సృష్టించిన వ్యాసుడు లోకానికే గురువు. “వ్యాసోనారాయణ స్వయం” సర్వగురువులకూ గురు స్థానీయుడు వేదవ్యాసుడు. వ్యాసుడు భారతీయ సంస్కృతిని రూపుదిద్ది వేదాలను విభజించి, కౌరవపాండవ గాథను 'మహాభారతం'గా నిర్మించాడు.
మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ది కెక్కింది. సర్వోపనిషత్తులసారమైన గీత్ర గ్రంథస్థం చేశారు. భాగవతాది పురాణాలు లోకానికి అందించి మహోపకారం చేశారు. ఆ మహాత్ముని ఈ రోజున అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. వ్యాసమహర్షి జగద్దురువులు వారి ద్వారా లోకానికి అందించిన ధర్మాలనే గురువులు మనకు అందజేస్తారు కనుక ఆ జగద్దురువును మన గురువులయందే దర్శించి ఆరాధించాలి. అందులకే సంప్రదాయజ్ఞులు వ్యాసపూర్ణిమను గురుపూర్ణిమగా నిర్ణయించారు. వ్యాసుడు తన శిష్యులలో పైలుడికి బుగ్వేదాన్ని, వైశంపాయనునికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునికి అధర్వణవేదాన్ని అప్పగించి లోకంలో వ్యాప్తి చెందింపచేశారు. వ్యాసుడు పరిపూర్ణ తత్వజ్ఞానంతో బ్రహ్మసూత్రములు రచించారు. అందుకే మునులలో నేను వ్యాసుడు అని గీతలో శ్రీ కృష్ణుడు అంటారు.
సందేశం: వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏ గ్రంథమైనా (అష్టాదశ పురాణాలలో ఏదేని గ్రంథము గాని, భారత, భాగవత గ్రంథాలనుగాని) ఉంచి అందు వ్యాస దేవుని ఆవాహన చేసి షోడశోపచారములతో పూజ గావించవలెను. వాస్తవానికి నిజమైన గురు పూజ ఈ రోజే. మంత్రోపదేశ గురువులను గానీ, చదువులు చెప్పే గురువులను కాని యథోచితంగా సత్మరించాలి. గురువులలోనే వ్యాసదేవుని భావించి ఆరాధించాలి. వారివారి గురు పరంపరను పూజించాలి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ