Gupta navaratrulu: హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం నవరాత్రులలో దుర్గామాతను పూజిస్తారు. ఏడాదికి రెండు సార్లు నవరాత్రులు జరపుకుంటారు. మాఘ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. వీటిని దక్షిణాదిన కంటే ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటారు. ఈ గుప్త నవరాత్రులలో దుర్గామాతను రహస్యంగా పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని విభిన్న రూపాలలో పూజిస్తారు.
మాఘ మాసంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని రోజుకొక రూపంలో పూజించినట్టే ఈ సమయంలో కూడా దుర్గమ్మని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ఈ గుప్త నవరాత్రుల సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో అనేక మార్పులు వస్తాయని నమ్ముతారు. కొన్ని చిన్న చిన్న చర్యలు పాటించడం వల్ల సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
కొంతమందికి ఎంత కష్టపడినా కూడా కెరీర్ లో విజయం సాధించలేకపోతారు. చేతికి అందినట్టే అంది చివరి నిమిషంలో విజయం చేజారిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు గుప్త నవరాత్రుల సమయంలో ఈ నివారణ పాటించి చూడండి. వృత్తిలో మంచి విజయం సాధిస్తారు. ఈ సమయంలో ప్రతిరోజూ దుర్గా దేవి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే దుర్గాదేవి చాలీసాని పఠించాలి.
ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవవు. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో గుప్త నవరాత్రుల సమయంలో లక్ష్మీ దేవి ఫోటోని మీ ఇంట్లోని పూజ గదిలో ప్రతిష్టించండి. ఈ లక్ష్మీదేవి మెడలో పూల మాల ఉన్న ఫోటో మాత్రమే కొనుగోలు చేయండి. ప్రతిరోజూ పూజ సమయంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన తామర పువ్వులు సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట నిలుస్తుంది.
నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ గుప్త నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించి పూజ చేయండి. అలాగే ఓం క్రేం కాళికాయై నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఈ మంత్రం పఠించడం వల్ల చెడు దృష్టి నుంచి రక్షిణ ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోమతి చక్రం అనేది ఆచారాలలో తరచుగా ఉపయోగించే ఒక పవిత్రమైన వస్తువు. ఇది ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. 21 గోమతి చక్రాలు, మూడు కొబ్బరి కాయలు ఒక పసుపు వస్త్రంలో కట్టి పూజ చేయాలి. దాన్ని ఆఫీసు లేదా దుకాణం తలుపు దగ్గర వేలాడదీయాలి. ఇలా చేస్తే చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు.
గుప్త నవరాత్రులలో ఏడు గోమతి చక్రాలను ఎర్రటి వస్త్రంలో చుట్టి లాకర్ లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఎప్పటికీ సంపదకు లోటు ఉండదు. గోమతి చక్రం ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్య, ఆర్థిక వృద్ధి ఉంటుంది.
పదకొండు గోమతి చక్రాలని ఎర్రటి వస్త్రంలో చుట్టి బియ్యం లేదా గోధుమలు ఉండే పాత్రలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆహార పదార్థాలు చీడపీడలు లేకుండా ఉంటాయి.