Gudi padwa 2024: ఉగాదిగా జరుపుకునే గుడి పడ్వా వేడుకల గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?-gudi padwa festival date and significance traditions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gudi Padwa 2024: ఉగాదిగా జరుపుకునే గుడి పడ్వా వేడుకల గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

Gudi padwa 2024: ఉగాదిగా జరుపుకునే గుడి పడ్వా వేడుకల గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

Gunti Soundarya HT Telugu
Apr 08, 2024 03:54 PM IST

Gudi padwa 2024: తెలుగు రాష్ట్రాల ప్రజలు చైత్ర మాసం తొలి రోజును ఉగాది పండుగగా జరుపుకుంటారు. మహారాష్ట్ర ప్రజలు మాత్రం గుడి పడ్వా గా ఈ పండుగను పిలుస్తారు. అసలు గుడి పడ్వా అంటే ఏంటి? ఎలా జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

గుడి పడ్వా గురించి ఆసక్తికర విషయాలు
గుడి పడ్వా గురించి ఆసక్తికర విషయాలు (freepik)

Gudi padwa 2024: చైత్ర మాసం తొలి రోజున హిందువులు ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను తెలుగు వారి నూతన సంవత్సరంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలు ఉగాది పండుగను జరుపుకుంటే ఇదే పండుగను మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల ప్రజలు గుడి పడ్వాగా జరుపుకుంటారు. ఈ ఏడాది గుడి పడ్వా పండుగ ఏప్రిల్ 9వ తేదీ జరుపుకోనున్నారు. 

yearly horoscope entry point

గుడి పడ్వా ప్రాముఖ్యత

బ్రహ్మ దేవుడు విశ్వం సృష్టించిన రోజే గుడి పడ్వాగా భావిస్తూ మరాఠీయులు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం 14 సంవత్సరాల వనవాసం ముగిసిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడని చెబుతారు. ఈరోజే శ్రీరాముడు రావణాసురిడిపై విజయం సాధించిన రోజుగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా గుడి పడ్వా జరుపుకుంటారు. 

ఉత్తర భారతదేశంలో ఈరోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో చాలామంది ఉపవాసం ఉండి దుర్గాదేవికి, శ్రీరాముడికి పూజలు చేస్తారు. గుడి పడ్వా అనేది 17వ శతాబ్దపు మొఘలులపై మరాఠాలు సాధించిన విజయానికి సంబంధించిన వేడుకగా కొందరు భావిస్తారు. వారి విజయం తర్వాత చత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఆచారాన్ని కొనసాగించారని చెబుతారు. 

గుడి ఎత్తడం అంటే ఏంటి?

గుడి పడ్వా రోజు మహారాష్ట్ర ప్రజలు గుడిని ఎత్తుతారు. వెదురు కర్ర తీసుకొని దానికి పట్టు వస్త్రం చుట్టి దాని మీద కలశాన్ని ఏర్పాటు చేస్తారు. వేప పువ్వులు, మామిడి ఆకులు, ఎరుపు రంగు పువ్వులు వంటి వాటిని దానికి తగిలించి అందంగా అలంకరిస్తారు. దాని మీద రాగి లేదా వెండితో చేసిన కలశాన్ని బోర్లిస్తారు. కలశం మీద స్వస్తిక్ గుర్తు వేస్తారు. సాధారణంగా దీన్ని ఇంటి తలుపు ముందు లేదా టెర్రస్ మీద ఏర్పాటు చేసుకుంటారు. అత్యంత పవిత్రమైన రోజుగా గుడి పడ్వాను భావిస్తారు. ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. 

ఈ పండుగకు ఒక రోజు ముందు ఊరేగింపు నిర్వహిస్తారు. అందరూ అక్కడికి చేరి దీపాలను వెలిగించడం, ఆకులపై దీపాలను పెట్టి నదిలో వదలడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమను పెరుగుతుందని నమ్ముతారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గుర్తుగా కొంతమంది ఈ గుడిని ఎగురవేస్తారు. గుడి ఎత్తడం వల్ల జీవితంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. ఈ గుడికి ధ్వజం అని కూడ పిలుస్తారు. ఈ గుడిని ఇంటిలో ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటారు. ఇది అందరికీ కనిపించేలా పెట్టుకుంటారు.

గుడి పడ్వా రోజు పాటించే ఆచారాలు 

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు. గుడి పడ్వా రోజు ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుని గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుంటారు. ఇంటి ముందు అందమైన రంగోలిలు పువ్వులు వేసి అలంకరించుకుంటారు. ఇష్టదైవానికి పూజ చేసుకుని శ్రీఖండ్, మోదక్ వంటి సంప్రదాయ ఆహారాలు నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా పండుగ జరుపుకుంటారు. 

రైతులు గుడి పడ్వాను  కొత్త పంట కాలంగా భావిస్తారు. మంచి పంటలు పండాలని కోరుకుంటూ పొలాలు దున్నుకుంటారు. ఉత్తర భారతీయులకు ఈరోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి.  

Whats_app_banner