Maha Shivaratri: మహాశివరాత్రి మహిమ విన్నారా.. శివలోక ప్రాప్తి పొందాలంటే ఇలా చేయాలి
Maha Shivaratri: శివరాత్రి మహిమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పిన విషయాలను ఇప్పుడే తెలుసుకోండి.

పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సాంగోపాంగముగా వేదాలను అభ్యసించాడు. పురాణాలను, శాస్త్రాలను పఠించాడు. తన విద్వత్తు చేత రాజసన్మానాలను పొందాడు. ఆయన భార్య సోమిదమ్మ. ఈ దంపతులకు లేకలేక ఒక కుమారుడు కలిగాడు. అతనికి గుణనిధి అని నామకరణం చేశారు.
ఆ పిల్లవాడిని అల్లారుముద్దుగా పెంచసాగారు. చదువుకొనే వయస్సు వచ్చే సరికి అతనికి ఉపనయన సంస్కారాలు చేసి, విద్యాభ్యాసానికి గురువుల దగ్గరకు పంపించారు. గుణనిధి చదువునందు ఆశ్రద్ద చూపి అల్లరి చిల్లరగా తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు.
జూదానికి బానిస
చెడు స్నేహాలు చేసి చెడు అలవాట్లకు లోనయ్యాడు. జూదానికి బానిసయ్యాడు. జూదంలో ఓడిపోయి నప్పుడల్లా తల్లిని అడిగి డబ్బు తీసుకుని చెల్లించేవాడు. తల్లి కూడా లేక లేక కలిగిన సంతానమని ప్రేమతో గుణనిధి అడిగినంత పైకం ఇచ్చేది. గుణనిధి పదహారు సంవత్సరాల వాడయ్యాడు. తల్లిదండ్రులు అతనికి ఒక సద్రాహణ కన్యతో వివాహం జరిపించారు. అయినా గుణనిధిలో మార్పు రాలేదు. యధావిధిగా జూదంలో పాల్గొనసాగాడు. గుణనిధి చెడు అలవాటును పసిగట్టిన తల్లి అతనికి పైకం ఇవ్వడం మానేసింది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
యజ్ఞదత్తుడు దివాణంలో పని ఒత్తిడి వల్ల కొడుకు విద్యా భ్యాసం గురించి ఆరా తీయలేదు. తీరిక ఉన్నవేళలో భార్యను అడిగినప్పుడు ఆమె గుణనిధి బాగా చదువుకుంటున్నాడని అబద్ధాలు చెప్పేది. ఒకనాడు గుణనిధి జూదంలో ఓడిపోయి పందెం పైకం కట్టడానికి తల్లిని డబ్బులడుగగా, ఆమె నిరాకరించింది. దానితో అతడు దొంగతనానికి అలవాటుపడ్డాడు. చీరలు, పట్టు వస్త్రాలు, పాత్రలు మొదలైనవి దొంగిలించేవాడు. అది తెలిసినా అతని తల్లి, కొడుకు మీది ప్రేమతో మిన్నకుండిపోయేది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఉంగరాన్ని గుర్తుపట్టిన యజ్ఞ దత్తుడు
ఒక జూదరి పందెంలో గెలిచిన రత్నాంగుళీయకాన్ని వేలికి ధరించి నగరంలో తిరగసాగాడు. అదే వీధిలో వెడుతున్న యజ్ఞ దత్తుడు ఆ ఉంగరాన్ని గుర్తుపట్టి, అతడిని గద్దించి అడుగగా, గుణనిధి జూదంలో ఈ ఉంగరాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడని, అందుకే తాను దీనిని ధరించానని తెలియజేశాడు. ఆ మాట విన్న యజ్ఞదత్తుడికి అమితమైన ఆగ్రహం కలిగింది.
చేసేది లేక అతనికి ఇవ్వవలసిన పైకాన్ని ఇచ్చి, ఉంగరాన్ని తీసుకుని గృహానికి తిరిగి వచ్చాడు. మితిమీరిన ఆగ్రహంతో ఉన్న పతిని చూచిన సోమిదమ్మ- నాథా! ఎందుకలా ఉన్నారు? అని అడిగింది. అదంతా తరువాత చెబుతాను. పెట్టెలో దాచిన రత్నాంగుళీయకమును తీసుకురమ్మని చెప్పాడు.
ఆమె కంగారుపడి ఎక్కడో పెట్టాను. గుర్తుకురావడం లేదు. తరువాత వెదికి ఇస్తాను అని పలికింది. రత్నాంగుళీయకమును ఆమెకు చూపించి, ఆమెను నిందించాడు. కొడుకు ప్రవర్తనను తనకు తెలియకుండా చేసి వాడిని నాశనం చేసిందని తూలనాడాడు అని బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మిత్రులతో కలిసి శివాలయానికి
కులమును కళింకతముగావించే పుత్రుడి కన్నా సంతానము లేకపోవడమే ఉత్తమం. వంశగౌరవం కోసం కళంకిత తనయుడిని త్యాగం చేయాలి. ఇది సనాతన నియమం అని పలికి తనయునికి తిలోదకములను సమర్పించాడు. భార్యను పరిత్యజించాడు. మరొక శ్రోత్రియ కన్యను పరిణయమాడాడు.తన ప్రవర్తన తండ్రికి తెలిసిపోయిందని గుణనిధి ఇంటికి రావడానికి ధైర్యం చాలలేదు. ఏమిచేయాలో దిక్కుతోచక అటూయిటూ తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలి బాధ అతడిని దహించసాగింది. అదే సమయంలో ఒక శివ భక్తుడు వివిధ పక్వాన్నములను తీసుకొని తన పరివారం, మిత్రులతో కలిసి శివాలయానికి వెడుతున్నాడు.
శివనామ సంకీర్తనలు
పక్వాన్నముల సువాసనలు గుణనిధి ఆకలిని అధికం చేశాయి. దానితో అతడు అక్కడి నుంచి లేచి శివభక్తుడిని అనుసరించి శివాలయానికి వెళ్లి ద్వారం వద్ద నిల్చున్నాడు. ఆ రోజు శివరాత్రి. శివభక్తుడు తన పరివారం, మిత్రులతో కలిసి శివనామ సంకీర్తనలు గావిస్తూ రాత్రి సమయం దాకా గడిపి. శివుడికి తాను తెచ్చిన పక్వాన్నము లను నివేదించి అక్కడనే పడుకున్నాడు. మిగతా వారంతా ఆల యంలోనే విశ్రమించారు. ఆలయ ద్వారం దగ్గరే ఉన్న గుణనిధి సమస్త శివారాదనను గమనించాడు. అందరూ నిద్రించాక శివుడి నివేదనను ఆరగించాలన్న ఆరాటంతో గుడిలోకి ప్రవేశించాడు.
లోపల దీపం కొండెక్కబోతోంది. తన ఉత్తరీయాన్ని చించి, వత్తిగా చేసి, నూనెలో తడిపి దీపాన్ని వెలిగించాడు. నైవేద్యం పెట్టిన పక్వాన్న పాత్రలను తీసుకుని త్వరత్వరగా పారిపోబోయాడు. ఆ తొందరలో నిద్రిస్తున్న ఒకరికి గుణనిధి కాలు తగిలింది. వాడు మేల్కొని గుణనిధిని చూచి దొంగ.. దొంగ అని అరవసాగాడు. ఆ అరుపులకు భయపడి పారిపోతున్న సమయంలో గుణనిధి కాళ్లు తడబడి గర్భగుడి వెలుపలనున్న నందీశ్వరుని మీద పడ్డాడు. పడటం తోనే అతని తల పగిలి ప్రాణాలు పోయాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివదూతలు
యమదూతలు అక్కడికి వచ్చారు. అదే సమయంలో శివదూతలు కూడా అక్కడికి వచ్చారు. శివదూతలను చూచి యమదూతలు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఇలా అన్నారు. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు. వీడు మహాపాపి. పాపకృత్యాలెన్నో చేశాడు. శివప్రసాదాన్ని దొంగిలించిన నీచుడు. ఇటువంటి పాపాత్ముడిని కైలాసానికి తీసుకుని పోవడానికి వచ్చారా?
శివలోక ప్రాప్తి
యమదూతలకు సమాధాన మిస్తూ శివదూతలు- మహా శివరాత్రి నాడు భక్తి చేతగాని, మరే ఇతర కారణాల చేతగాని ఉపవసించి, జాగరణ చేసినట్లయితే శివలోకప్రాప్తి లభిస్తుంది. అన్నము దొరకని కారణం చేత గుణనిధి ఉపవసించాడు. శివాలయంలో శివుని చూస్తూ జాగరణ చేశాడు. శివసన్నిధిలో నందీశ్వరుని దగ్గర ప్రాణాలు వదిలాడు. అందువల్ల ఇతని సమస్త పాపాలు నశించిపోయాయి అని పలికి గుణనిధి సూక్ష్మ శరీరాన్ని తమతో తీసుకుపోయారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.