Gotram Origin: ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోకూడదా? అసలీ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది?-gotram origin came from mula purushas same gotra people marriage is not valid ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gotram Origin: ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోకూడదా? అసలీ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది?

Gotram Origin: ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోకూడదా? అసలీ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది?

Ramya Sri Marka HT Telugu
Nov 15, 2024 09:21 PM IST

Gotram Origin:పూజా కార్యక్రమాల్లో, యజ్ఞాలలో ప్రస్తావించే గోత్రం అందరికీ ఒకేలా ఉండదు. సంస్కృత పదాల్లా అనిపించే ఆ గోత్రం వెనుకున్న కథేంటి? ఓకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోకూడదని ఎందుకంటారు?

ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకోకూడదా?
ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకోకూడదా? (pinterest)

దైవారాధన చేసే సందర్భాలైన ఆలయాల్లో అర్చన, పూజా కార్యక్రమం, యజ్ఞం, హోమం, వ్రతం చేసేటప్పుడు మన పేరు, తండ్రి పేరుతో పాటు కచ్చితంగా ప్రస్తావించే పేరు గోత్రం. ఈ గోత్ర నామం ఒకటే ఉన్నవారిని సగోత్రికులు అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సగోత్రికులకు వివాహం జరిపించడం విరుద్ధం. ప్రేమ పెళ్లిళ్ల మాట అటుంచితే పెద్దలు కుదిర్చి జరిపించే పెళ్లిళ్లకు గోత్రాన్ని కచ్చితంగా చూసుకుంటారు. ఒకవేళ అబ్బాయి, అమ్మాయి గోత్ర నామాలు ఒకటే అయితే పెళ్లి చూపులతోనే ఆగిపోతారు.

అసలు అంతలా పట్టించుకునే గోత్రం అనే పద మూలం సంస్కృతం నుంచి వచ్చింది. ‘గౌః’ అనే సంస్కృత పదం నుంచే గోత్రం పుట్టింది. ‘గౌః’ అనే పదానికి గోవుల సమూహం, వేదం, గురువు, భూమి అనే అర్థాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక గోత్రం అనే పేరు ఛాందోగ్యోపనిషత్‌లోని సత్యభామ జాబిలి కథలో తొలిసారి ప్రస్తావించారు. ఈ గోత్రాన్ని వంశోత్పాదకులైన ఆది పురుషుల పేర్లను బట్టి పిలుస్తుంటారు.

భారతదేశంలో ప్రాచీన కాలాన ప్రతి కుటుంబానికి పాడి పశువులే సంపద. గోవులు ఎక్కువ ఉన్నవారిని సంపన్నులుగా భావించేవారు. వాటిని పోషించడానికి, సంరక్షించడానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చేంది. అమితమైన గో సంపదను తీసుకుని వెళ్లే సమయంలో గోవుల సమూహాలకు గుర్తింపు కోసం పేర్లు పెట్టేవారు. మందలలోని గోవులు ఇతర మందలలో కలిసిపోయినప్పుడు గో కాపరుల మధ్య వివాదాలు తలెత్తేవి. ఆ గొడవలను తపోనిష్టులైన గోత్ర పాలకులు తీర్చేవారు. కాలక్రమేణా ఆ గోత్ర పాలకుల పేర్లే గోత్ర నామాలుగా పేరు తెచ్చుకున్నాయి. ముందుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు మాత్రమే గోత్ర నామాలుండేవి. తొలి నాళ్లలో ఉన్న గోత్ర నామాలు అత్రి, జమదగ్ని, అగస్త్య, విశ్వామిత్రా గోత్రాలు మాత్రమే. ఆ తర్వాత మిగిలిన వారంతా కులాల వారీగా గోత్ర నామాలను ఏర్పరచుకున్నారు. వారి వంశానికి మూల పురుషులైన వారి పేర్లనే గోత్ర నామాలుగా పెట్టుకున్నారు. ఫలితంగా ఆయా వంశీకులు వారి మూల పురుషుల పేర్లను యజ్ఞ యాగాలలో తలచుకుంటుంటారు. సగోత్రికులంతా ఒకే రుషికి పుట్టిన వాళ్లన్న మాట. వివాహ సంబంధమైన విషయాల్లో వీటిని బట్టే సగోత్రికులా కాదా అనే నిర్ధారణకు వస్తారు. ఒకవేళ అమ్మాయి, అబ్బాయి సగోత్రికులైతే వారిని ఒకే తండ్రికి పుట్టిన అన్నా చెల్లెళ్లు కింద పరిగణిస్తారు. సాధారణ సందర్భాల్లోనూ సగోత్రికులైన మగవారు తారసపడితే వారిని అన్నగానో, తమ్ముడిగానో భావిస్తుంటారు.

ఓకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?

ఒకే గోత్ర నామం ఉన్న వారు పెళ్లి చేసుకుంటే, ఆ పుట్టే పిల్లల్లో జన్యుపరమైనలోపాలు ఉంటాయి. జన్యు నమూనాలు ఒకే రీతిలో ఉండటం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. కొన్ని సందర్భాల్లో సంతానం కూడా కలగకపోవ్చని పెద్దల మాట. కొందరి జ్యోతిష్యుల సూచన ప్రకారం.. ఏడు తరాల తర్వాత వారి గోత్రాన్ని మార్చుకోవచ్చట. అంటే ఏడు తరాల పాటు ఒకే గోత్రంలో కొనసాగుతుంటే ఎనిమిదో తరం వారి గోత్రాన్ని అవసరాన్ని బట్టి పెద్దగా పరిగణించాల్సిన అవసర్లేదని చెబుతున్నారు.

Whats_app_banner