మన బుద్ధి, శక్తులను ప్రేరేపించే విద్యా స్వరూపిణి సరస్వతీదేవి-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మాఘశుద్ధ పంచమి శుభదినం సరస్వతీ దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ రోజున విశ్వమంతా కలిసి దేవిని ఆరాధిస్తారనీ, తద్వారా బుద్ధి, శక్తులను పొందుతారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘ శుద్ధ పంచమి నాడు ఈ విశ్వమంతా అనగా మానవులు, మనువులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ సరస్వతీదేవిని ఆరాధిస్తారని దేవీభాగవతం చెబుతోంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి. అని సరస్వతీ సూక్తంలో వాక్ స్వరూపం గురించి చెప్పబడింది.

వాక్యం స్వరూపం నాలుగు విధాలుగా ఉంటుంది.
1. పరా
2. పశ్యంతీ
3. మధ్యమా
4. వైఖరీ.
మనలో మాట పలకాలన్న భావం స్ఫురింపజేసేదే 'పరా'. మాట పలికే ముందు 'పర' ద్వారా ప్రేరేపితమై భావాత్మకంగా గోచరించేదే 'పశ్యంతీ'. ఆ భావం మాటలుగా మార్చుకున్న స్థితి 'మధ్యమా'. ఆ మాటలు శబ్దరూపంలో పైకి వినబడేదే 'వైఖరీ'!
యోగ శాస్త్ర పరంగా వీటి ప్రయాణం గురించి చెప్పాలంటే మూలాధారం నుంచి నాభి, హృత్, కంఠ, నాలుకలు వీటన్నింటికీ మూలమైన నాదం కూడా సరస్వతీ రూపమే. ఇక భావ ప్రకటన కోసం చెట్లు 'పరా' వాక్కుని, పక్షులు పశ్యంతీ వాక్కును, జంతువులు 'మధ్యమా' వాక్కును, మనుష్యులు 'వైఖరీ' వాక్కును ఉపయోగిస్తున్నారు. ఆ తల్లి శ్వేతపద్మవాసిని కనుక 'శారద' అని అన్నారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సరస్వతీ మూల మంత్రం..
నిరంతరం జపించవలసిన ఒకానొక సరస్వతీ మూల మంత్రాన్ని వేదాలు మనకందించాయి. ఆ మూలమంత్రం ఇది
- "ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా"
ఈ సరస్వతీ మంత్రాన్ని పంచమినాడు కాని, లేదా అక్షరాభ్యాస సమయంలో కాని, లేదా ఏదైనా పవిత్రమైన తిథినాడు కాని గురువు ద్వారా ఉపదేశం పొంది జపిస్తే విద్యా జ్ఞాన సంపద లభిస్తుంది.
ఈ మంత్రం కల్పవృక్షం వంటిదని దేవీ భాగవతం చెపుతోంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఈ మంత్రాన్ని వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. దీనిని జపించి, ఆ ప్రభావంతో వాల్మీకి కవి అయ్యాడు.దార సుధాపయోధిసిత తామర సామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను మదిగాన నెన్నడు గల్గు భారతీ"అని ప్రార్థించాడు. సరస్వతీదేవి తెలుపుదనాన్ని సందర్శించి, అర్చించాలని కోరుకున్నారు పోతన.
తెల్లని పద్మంపై కూర్చుని, ఒక కాలు నిలువుగా ఒక కాలు దానిపై అడ్డంగా ముడుచుకుని కూర్చున్నట్లు, లేక నిలబడి, ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది. ఆ తల్లి తెల్లని గంధం పూతతో దర్శనమిస్తుంది. అందుకే ఆ తల్లిని కూచిమంచి తిమ్మకవి ఈ క్రింది విధంగా స్తుతించాడు.
"బలుతెలివులు మరువము, బంగరు వీణియ మిన్కుటం దెయిన్ జిలుక తుటార్ బోటియును, జిందపు వన్నియమేను బొత్తమున్ జెలువపు దెల్లదమ్మి విరిసింగపు గద్దెయు గల్గి యొప్పున ప్పలుకుల చాన, జానలరు పల్కు లొసంగెడు గాతనిచ్చలున్"
"బాగా తెల్లనైన పక్షి హంసనే గుర్రపు వాహనంలా చేసుకున్న తల్లి బంగారు వీణను, మెరిసే అందెలను, చిలుకను, పుస్తకాన్ని ధరించి, శంఖం వంటి తెలుపు మేనితో ప్రకాశిస్తూ, అందమైన తెల్లని పద్మాన్నే ఆసనంగా చేసుకున్న 'వాగ్దేవి' సరస్వతి, చక్కని పలుకులను నాకు నిత్యం అనుగ్రహించుగాక" అని ఆ కవీశ్వ రుడు వేడుకుంటున్నాడు.అందుకే ఆ తల్లిని ప్రతి శ్రీపంచమి నాడు భక్తిశ్రద్ధలతో పూజించుకోవాలి. శ్రీపంచమి నాడు విద్యార్థులు ఆ తల్లిని పూజించడం వల్ల, చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.