కనకధారా స్తోత్రం రచించిన జ‌గ‌ద్గురువు ఆది శంక‌రాచార్యుల వారి వైభవం-glory to jagadguru adi shankaracharya who composed kanakadhara stotram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కనకధారా స్తోత్రం రచించిన జ‌గ‌ద్గురువు ఆది శంక‌రాచార్యుల వారి వైభవం

కనకధారా స్తోత్రం రచించిన జ‌గ‌ద్గురువు ఆది శంక‌రాచార్యుల వారి వైభవం

HT Telugu Desk HT Telugu
Jul 03, 2024 06:31 PM IST

కనకధారా స్తోత్రం రచించిన జ‌గ‌ద్గురువు ఆది శంక‌రాచార్యుల వారి వైభవం, ఆయన జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక వేత్తగా ఎదిగిన తీరు గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

జ‌గ‌ద్గురువు ఆది శంక‌రాచార్యులు
జ‌గ‌ద్గురువు ఆది శంక‌రాచార్యులు

శివుని ఏకాద‌శ రుద్రుల్లో ఒక రుద్రుడు భ‌ర‌తఖండంలో కలియుగం నందు నాస్తిక‌త్వాన్ని అంత‌రింపచేసి బౌద్ధ‌మ‌తం, చాంద‌సవాదాన్ని త‌రిమి కొట్ట‌డానికి నిర్గుణ ప‌ర‌బ్ర‌హ్మ తత్త్వాన్ని అద్వైత మార్గాన్ని స్థాప‌న చేయ‌డానికి నిర్గుణం ద్వారా మోక్షాన్ని క‌లియుగంలో ఎలా పొంద‌వ‌చ్చో చూపించ‌డానికి శంక‌రులే స్వ‌యంగా భూమ్మీద జ‌న్మించిన అవ‌తారం శ్రీ జ‌గ‌ద్గురువు ఆది శంక‌రాచార్యుల అవ‌తార‌మ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శంక‌రాచార్యుల వారు స్వ‌యంగా శివ స్వ‌రూప‌మేన‌ని తెలియ‌జేసే అనేక ఘ‌ట‌న‌లు ఆయ‌న జీవితంలో స్ప‌ష్టంగా క‌నిపించాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే వేదాలు, ఉప‌నిష‌త్తులు సారాంశంతో సహా తెలుసుకుని క‌న‌క‌ధారా స్తోత్రం వంటివి అందించారు. పూర్ణాన‌ది వంటి న‌దుల‌ను దారి మ‌ళ్లింప చేసి త‌న శ‌క్తిని తెలియ‌జేసి ఎంతోమందిని ఆశ్చ‌ర్యానికి గురి చేశార‌ని చిల‌క‌మ‌ర్తి తెలియ‌జేశారు.

అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త జ‌ద్గురువు ఆది శంక‌రాచార్యులు. స్మృతి పురాణాల ప్రకారం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఆది శంకరులు క్రీస్తుపూర్వం 509వ సంవత్సరంలో కేరళలోని కాలడిలో జన్మించార‌ని పురాణాలు తెలియ‌జేస్తున్నాయ‌ని చిలకమర్తి తెలిపారు. చిన్నవయస్సులోనే కనకధారలు కురిపించారు.

మొసలి పట్టునుంచి విడిపించుకునే నెపంతో సన్యాసం స్వీకరించారు. ఓంకారేశ్వరంలో గోవింద భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసం చేశారు. బ్రహ్మసూత్రానికి శారీరభాష్యం రచించారు. శంకరాచార్యులు స్తోత్రసాహిత్యం, ఉపదేశ గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు కూడా వెలువరించారు. గోవిందుని గురువైన గౌడపాదులు బోధించిన అద్వైత సిద్ధాంతాన్ని శంకరులు వ్యాప్తిలోనికి తీసుకువచ్చార‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

గాణాపత్యం, కౌమారం, సౌరం, వైష్ణవం, శాక్తేయం, శైవం అనే ఆరుమతాలను శంకరులు స్థాపించి, షణ్మతస్థాపనాచార్యులయ్యార‌ని చిల‌క‌మ‌ర్తి తెలియ‌జేశారు. వామాచారాన్ని ఖండించి, దేవాలయాల్లో శిష్టాచారాన్ని నెలకొల్పారు. పంచాయతన పూజా విధానాన్ని ప్రబోధించారు. భారతావనికి నాలుగు దిక్కులలోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలను శంకరులు స్థాపించారు. వాటిలో మొదటిది పూరీ జగన్నాథ క్షేత్రంలోని గోవర్ధన పూర్వామ్నాయ పీఠం. పశ్చిమదిక్కున ద్వారకలో నెలకొల్పిన కాళికా పీఠం రెండోది. ఉత్తర దిక్కున శంకరులు నెలకొల్పిన ఆమ్నాయపీఠం నరనారాయణుల తపోభూమి అయిన బదరీ క్షేత్రంలో ఉంది.

కర్మిష్ఠి అయిన మండనమిశ్రులను వాదంలో గెలిచి దక్షిణ ఆమ్నాయ పీఠమైన శృంగేరి శారదా పీఠాధిపత్యం ఇచ్చి సురేశ్వరాచార్యగా మార్చారు. సమస్త విజ్ఞాన భాండాగారంగా సౌందర్యలహరిని ఆయ‌న‌ బోధించార‌ని ఆధ్యాత్మిక వేత్త‌ చిల‌క‌మ‌ర్తి తెలిపారు. క్రీస్తుపూర్వం 477వ సంవత్సరంలో సిద్ధి పొందిన శంకరుల సమాధి కేదార్‌నాథ్‌ క్షేత్రంలో ఉంది. త్రిమతాచార్యులలో మొదటివారిగా, జగద్గురువుగా మనవారు శంకరులను కీర్తిస్తున్నార‌ని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు.

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel