Geetha Jayanti: మార్గశిర మాస ప్రాధాన్యత ఏమిటి? గీతా జయంతి విశిష్టత ఏమిటి?
గీతా జయంతి అంటే ఏమిటి? మార్గశిర మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ విశిష్టత, ప్రాముఖ్యత ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మాటల్లో తెలుసుకుందాం.
"మాసానం మార్గశిర్షోహం" అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో స్వయంగా చెప్పడం చేత మార్గశిర మాసానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏర్పడిందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, పౌర్ణమి రోజు చంద్రుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసమునకు మార్గశిర మాసమని పేరు అని చిలకమర్తి తెలిపారు. మార్గశిర మాసం దక్షిణాయానంలో ఆఖరి మాసం అవడం విశేషం. మార్గశిర మాసంలో సూర్యుడు ధనూ రాశిలో సంచరించడం చేత ఈ మాసంలోనే ధనుర్మాస వత్రములు ఆచరిస్తారని ఈ మాసం శ్రీ మహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసమని పురాణములు తెలియజేసినట్లుగా చిలకమర్తి తెలిపారు.
మహాభారతం ప్రకారం, కురుక్షేత్రములో మహాభారత యుద్ధము ప్రారంభమైన మాసము మార్గశిర మాసమని, మార్గశిర మాసములోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ప్రభోదించినట్లుగా మహాభారతం తెలియజేసినదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మహాభారతం ప్రకారం, మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి రోజు శ్రీకృష్ణుడు, అర్జునుడికి గీతోపదేశం చేసి తన విశ్వరూప దర్శనాన్ని అందించిన రోజుగా కూడా చెప్పబడిందని చిలకమర్తి తెలియజేశారు. అందుచేతనే హర్యానాలోని కురుక్షేత్రంలో ఈ రోజుకి ప్రతి మార్గశిర మాసంలో మార్గశిర మాస శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పదిహేను రోజులు విశేషముగా గీతా జయంతిని జరుపుకుంటారు. హర్యానా రాష్ట్రమునకు (హరి+ఆనా= హర్యానా) హరి అనగా శ్రీమహా విష్ణువు, ఆనా అనగా రావడం. హర్యానా అనగా శ్రీహరి స్వయంగా విచ్చేసిన ప్రాంతము కాబట్టి హర్యానా అని, ఈ ప్రాంతమునందే శ్రీకృష్ణుడు వచ్చి కురుక్షేత్రం నందు మార్గశిర మాసములో గీతోపదేశాన్ని అందించడం చేత హర్యానా నందు మార్గశిర మాసంలో గీతా జయంతిని విశేషముగా జరుపుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మార్గశిర మాసంలోనే దక్షిణ భారతదేశంలో ధనుర్మాస వ్రతం, గోదా కళ్యాణం వంటివి ఆచరిస్తారు. మార్గశిర మాసంలో ఏవ్యక్తి అయినా శ్రీహరి/శ్రీమన్నారాయణుడి దశావతారాలకు సంబంధించిన ఏ ఆలయాలను సందర్శించినా (శ్రీరాముడు, కృష్ణుడు, పరశురాముడు.. వగైరా) విష్ణుమూర్తి ఆలయాలలో దర్శనాల వంటివి చేసుకున్నా, వారికి శ్రీమహా విష్ణువు అనుగ్రహం చేత శుభఫలితములు కలుగుతాయని బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామములు పారాయణం చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు. మార్గశిర మాసంలో ఆదివారాలు శ్రీరాముల వారి ఆలయాలను దర్శించడం మంచిది. సోమవారం శ్రీకృష్ణుడిని అర్తించడం విశేషం. మంగళవారం లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం మంచిది. బుధవారం శ్రీమన్నారాయణుడు లేదా శ్రీమహా విష్ణువు యొక్క ఏ ఆలయాన్ని దర్శించినా శుభఫలితాలు కలుగుతాయి. గురువారం వామన, శ్రీరామ ఆలయాలు దర్శించడం శుభఫలితాలను ఇస్తుంది. శుక్రవారం అనంత పద్మనాభుడు, పరశురాముడు, బలరాముడు మరియు లక్ష్మీ నారాయణ ఆలయాలను దర్శించడం విశేషమైనటువంటి ఫలం. శనివారం వేంకటేశ్వర స్వామిని, మత్స్య కూర్మ వరాహ అవతారాలలో ఉన్న శ్రీమహా విష్ణువు ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మార్గశిర మాసంలో తెలిసి కానీ తెలియగానీ భగవద్గీత విన్నా, చదివినా, పారాయణం చేసినా విశేషమైన పుణ్యఫలితం కలుగుతుందని చిలకమర్తి తెలియజేశారు.